కొన్ని దేశాల కుట్రల కారణంగానే ‘మిషన్ డోలో’ తెరమీదకు వచ్చిందని, దురుద్దేశంతో ప్రారంభించిన ఈ మారణహోమానికి సంబంధించిన విషయాలను దౌత్యపరమైన కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం బయటకు వెల్లడించలేకపోతున్నదని తెలుసుకొన్న రుద్ర అండ్ టీమ్ తీవ్రంగా కలత చెందారు. ఇంతలో కలుగజేసుకొన్న జయ.. ‘పోనీ రుద్ర! మిషన్ డోలోను ఆపేసి మనకు తోచిన దేశభక్తిని మనం కనబర్చాం. ఇక, ఎక్కువగా ఆలోచించకుండా ఉంటే మంచిదేమో’ అని సముదాయించింది.
ఇంతలో స్నేహిల్.. ‘సరే.. సరే.. ఈ మిషన్‌ను ఆపేయడానికి అందరం డే అండ్ నైట్ ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడు పార్టీ టైమ్’ అంటూ అరిచాడు. ‘సిటీకి చేరాకే! అదంతా’ అని రుద్ర అనగానే మిగతావారూ సరేనన్నారు. హైదరాబాద్‌కు చేరుకొన్న రుద్ర టీమ్ మరునాడు సాయంత్రం హైటెక్‌సిటీలోని ఓ మంచి రెస్టారెంట్‌కు వెళ్లాలని ప్లాన్ వేసింది. స్నేహిల్ కారులో అందరూ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా వెళ్తున్నారు. ఉత్సాహంతో డ్రైవ్ చేస్తున్న స్నేహిల్.. కారు స్పీడ్‌ను 70 దాటించాడు. ఇంతలో కారులోని సౌండ్ సిస్టమ్ నుంచి ఓ వాయిస్ మెసేజీ ఆన్ అయ్యింది.
‘హలో రుద్ర.. ‘మిషన్ డోలో’కు ఎండ్ కార్డ్ పడిపోయిందని సంబురపడిపోతున్నావా? ఈ దేశ ప్రజలను కాపాడామని నువ్వు, నీ టీమ్ హ్యాపీగా ఉన్నారా? సరే అదీ ఒకవిధంగా నిజమే! రుద్ర.. నీ తెలివితేటలతో అత్యంత కష్టమైన మిషన్ డోలోను ఆపేయగలిగావ్. కానీ, ఓ పెద్ద తప్పు చేశావ్. సరే.. అవన్నీ తర్వాత చెప్తాగానీ.. ఇప్పుడు నిన్ను, నీ టీమ్‌ను చంపాలని నేను ఫిక్స్ అయ్యా. మీరు ఉన్న ఈ కారులో నేను బాంబు పెట్టా. కారు స్పీడ్ 70 దాటగానే, నా వాయిస్ మెసేజీతో పాటు.. బాంబ్ టైమర్ యాక్టివేట్ అవుతుంది. కారు స్పీడ్ 70 కంటే తగ్గినా.. టైమర్ యాక్టివేట్ అయ్యాక నేను ప్రశ్న అడిగిన 5 నిమిషాల్లోపు కరెక్ట్ సమాధానాన్ని చెప్పలేకపోయినా ఈ కారు బ్లాస్ట్ అవుతుంది. కారులో నుంచి బయటికి దూకే వెసులుబాటు కూడా మీకు లేదు. కారులో ఎక్కినప్పుడు మీ టీమ్ అందరి వెయిట్‌ను లాక్ చేశా. అన్నట్టు.. కారులో పెట్టిన బాంబును ఎవ్వరూ డిఫ్యూజ్ చేయలేరు. దానంతట అదే డిఫ్యూజ్ అవ్వాలి. అదెలా అవుతుందో నేను తర్వాత చెప్తా. అప్పటివరకూ మీ ప్రాణాలు కాపాడుకోండి. ఒరేయ్ స్నేహిల్.. డ్రైవింగ్‌లో నువ్వు తోపు, తురుమ్ అంటావ్గా.. ఇంతకీ, కారు ఫుల్ ట్యాంక్ చేయించావా? లేదా?? హహ్హ.. ఇప్పుడు ‘మిషన్ డోలో’ అసలు మజా ఏంటో చూద్దురుగానీ.. లెట్స్ బిగిన్ ‘రేస్ టు ది ఫినిష్ ఆఫ్ మిషన్ డోలో” అంటూ వాయిస్ ఓవర్ ఆగిపోయింది.
వాయిస్ మెసేజీ విన్న రుద్రతో పాటు కరణ్, జయ, రామస్వామి, హరిశ్వకు చెమటలు పట్టాయి. అసలేం జరుగుతుందో ఎవ్వరికీ అర్థంకావట్లేదు. భయంతో కారును స్లో చేయబోతున్న స్నేహిల్ను వారించిన రుద్ర.. 70+ స్పీడ్‌ను క్యారీ చేయమని చెప్పాడు. ఇంతలో వాయిస్ ఓవర్ మళ్లీ ప్రారంభమయ్యింది. ‘నేనెవ్వరో తెలుసుకోవాలంటే, ముందు మీ ప్రాణాలు కాపాడుకోండి. అది జరగాలంటే, నేనడిగే ప్రశ్నకు 5 నిమిషాల్లో మీ టీమ్ సమాధానం చెప్పాలి. ప్రశ్న వినండి.. పార్కింగ్‌లో తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు, నీలం, బూడిద రంగు కార్లు ఉన్నాయి. అయితే, ఈ ఆరు కార్లు ఏదో ఓ వరుసలో ఒకదాని వెనుక ఒకటి పార్కింగ్ చేసి ఉన్నాయి. పసుపు రంగు కారు చివర్లో లేదు. ఎరుపు రంగు కారు, బూడిద రంగు కారు మధ్యలో నీలం రంగు కారు ఉంది. పసుపు రంగు కారు వెనుకాల తెలుపు రంగు కారు ఉంది. నలుపు రంగు కారు ముందు బూడిద రంగు కారు ఉంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే? నీలం రంగు కారు పార్కింగ్‌లో ఏ ప్లేస్‌లో ఉంది? మీకు ఐదు నిమిషాలే టైమ్. ఈ టైమ్‌లో ఒరేయ్ రుద్ర.. నువ్వు అండ్ నీ టీమ్ రెండు పనులు చేయాలి. ఒకటి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఆ తర్వాత.. నేను చెప్పిన ఆరు రంగుల కార్లను నీ కారుతో ఢీకొట్టాలి. ఈ ఢీకొట్టే సమయంలో ఎక్కడా నీ కారు 70 స్పీడ్ కంటే తక్కువకు పడిపోకూడదురోయ్.. ఒకవేళ, స్పీడ్ తగ్గిందా.. కారులోని మీరంతా పీస్పీస్ అయిపోతారు. త్వరగా ఆన్సర్ చెప్పి.. ఈ 5 నిమిషాల్లోనే బ్రిడ్జి మీద వెళ్తున్న ఆరు రంగురంగుల కార్లను డ్యాష్ ఇచ్చేయండి.. యువర్ టైమ్ స్టార్ట్ నౌ..’ అంటూ వాయిస్ ఓవర్ అయిపోగానే.. కారులో ఉన్న ఆరుగురి హార్ట్ బీట్ మరింతగా పెరిగిపోయింది.
టైమ్ కావోస్తుండటంతో బాగా ఆలోచించిన రుద్ర.. నీలం రంగు కారు ఏ ప్లేస్‌లో ఉందో కరెక్ట్‌గా సమాధానం ఇచ్చాడు. దీంతో మళ్లీ యాక్టివేట్ అయిన వాయిస్ మెసేజీ.. గుడ్ రుద్ర.. కరెక్ట్‌గా సమాధానం చెప్పావ్. ఇప్పుడు ప్రశ్నలో అడిగిన 6 రంగుల కార్లను వెతికిపట్టుకొని ఢీకొట్టండి. మీ కారు స్పీడ్ మాత్రం తగ్గొద్దు. ఫాస్ట్.. అంటూ గెదమడంతో రుద్ర సూచనలతో బ్రిడ్జి మీద ప్రయాణిస్తున్న రెడ్, వైట్, బ్లాక్, యెల్లో, బ్లూ, యాష్ కలర్ కార్లను.. ఎంతో కష్టంతో లైట్‌గా డ్యాష్ ఇస్తూ స్నేహిల్ కారును పోనిచ్చాడు. జరిగిన హఠాత్పరిణామానికి కోపోద్రిక్తులైన అక్కడివారు.. రుద్ర టీమ్ ఉన్న కారును అడ్డుకోవడానికి యత్నించారు. దీంతో రుద్ర అండ్ టీమ్ కంగుతిన్నది. అదిపక్కనబెడితే, పజిల్లో అడిగిన ప్రశ్నకు కరెక్ట్ సమాధానాన్ని మీరు కనిపెట్టారా?
పజిల్లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. పార్కింగ్‌లో పసుపు, తెలుపు, ఎరుపు, నీలం, బూడిద, నలుపు రంగు కార్లు ఒకదాని వెనుక ఒకటి వరుసగా నిలిపి ఉన్నాయి. అంటే నీలం రంగు కారు ప్లేస్-4.
– రాజశేఖర్ కడవేర్గు