నేను… జోడేఘాట్ విజయ తిలకాన్ని..!
అల్లుకున్న అడవికి ఆత్మను నేను. ‘జల్.. జంగల్.. జమీన్' నినాదపు జోడేఘాట్‌ను నేను. తిరుగుబాటు చెలిమెకు ఊటను నేను. సంస్కరణల అధ్యయనాల మార్లవాయిని నేను. చెట్టు బెరడు నుంచి పుట్టిన కాగితాన్ని నేను. అవును. కుమ్రం భీముడను. నిజాంపై దండెత్తిన బరిసెను. ఎక్కుపెట్టిన విల్లంబును. మర్లవడ్డ అడవిబిడ్డను. నేను ఆసిఫాబాద్‌ను. ఒట్టి ఆసిఫాబాద్‌ను కాదు కుమ్రం భీం-ఆసిఫాబాద్‌ను.
అల్లుకున్న అడవికి ఆత్మను నేను. ‘జల్.. జంగల్.. జమీన్’ నినాదపు జోడేఘాట్‌ను నేను. తిరుగుబాటు చెలిమెకు ఊటను నేను. సంస్కరణల అధ్యయనాల మార్లవాయిని నేను. చెట్టు బెరడు నుంచి పుట్టిన కాగితాన్ని నేను. అవును. కుమ్రం భీముడను. నిజాంపై దండెత్తిన బరిసెను. ఎక్కుపెట్టిన విల్లంబును. మర్లవడ్డ అడవిబిడ్డను. నేను ఆసిఫాబాద్‌ను. ఒట్టి ఆసిఫాబాద్‌ను కాదు కుమ్రం భీం-ఆసిఫాబాద్‌ను. చెట్టుకు కొమ్మకు వేలాడిన శిరస్సును. గిరుల నొసలుపై నుంచి జారిన నెత్తుటి జలపాతాన్ని. ‘జున్గావా’ నుంచి ‘కుమ్రం భీం-ఆసిఫాబాద్’ దాకా నాది శతాబ్దాల ప్రయాణం. పచ్చిపుండులా సలిపిన నా గడ్డపై కేసీఆర్ లేపనమై వాలిండు. దగాపడిన ఈ ధరిత్రి మీద.. మోసపోయి గోసపడ్డ ఈ గడ్డకు మళ్లీ జీవజలమై నిలిచిండు.
ఆసిఫాబాద్ జిల్లా అయితే ఏమొస్తది? అని ఈసడించిన వాళ్లు శిరసెత్తి చూసేలా తీర్చిదిద్దిండు.
సరిగ్గా పదేండ్ల కింద తనను తాను తిరిగి రూపాంతరీకరించుకుంటూ ముందుకు సాగుతున్న కుమ్రం భీం-ఆసిఫాబాద్ ప్రయాణానికి అక్షరరూపమే ఈ కథనం…
జోడేఘాట్…. చెట్ల కొమ్మలను కొలిమిలా మండించిన యోధుడు పుట్టిన వీరభూమి. నిజాం ఫర్మానాను ధిక్కరించిన ధీశాలి కుమ్రం భీముడి అడ్డ. ఆదివాసీ బిడ్డలను పోరుశిఖరాలుగా మలచిన నేల. భుక్తి.. విముక్తి కోసం నిజాం సైన్యాలతో కొట్లాడిన పోరుభూమి. 1930వ దశకంలో కుమ్రం భీం పేరు వింటే నిజాం సర్కారుకు వణుకు. ‘కొమురం భీముడో.. కొమురం భీముడో.. రగరాగ సూరీడై మండాలి కొడుకో’ అని పాడుకునేలా మండించిన ఫిరంగి. కెరమెరి.. బాబేఝరి చుట్టుపకల 12 ఆదివాసీ గ్రామాలపై హక్కులు తమకే దక్కాలని నినదించి, అడవి బిడ్డల స్వతంత్రం కోసం నిజాంతో తలపడుతున్న క్రమంలో 1940లో కుమ్రం భీం అసువులు బాసిన సంగతి అందరికీ తెలుసు. అప్పుడు మూగబోయిన జోడేఘాట్ అనేక దశాబ్దాల అనంతరం తిరిగి లోకానికి పరిచయమైంది ఉద్యమాల నేపథ్యంలోనే! ఒకప్పుడు ఆదివాసీ బిడ్డలు, కుమ్రం భీం వారసులు… జోడేఘాట్‌కు వెళ్లాలంటే కూడా నిషేధిత ప్రాంతంగా చిత్రీకరించిన పరిస్థితులకు స్వరాష్ట్ర సాధన అగ్గిపెట్టింది. హట్టిలో కుమ్రం భీం వర్ధంతి జరుపుకొనే పరిస్థితుల నుంచి బాజాప్తా జోడేఘాట్‌లోనే భీంకు నివాళి అర్పించే దాకా మార్పు తీసుకురావడమే కాదు, ఆదివాసీ ప్రపంచం అబ్బురపడేరీతిలో కేసీఆర్ ప్రభుత్వం అదే ప్రాంతంలో ఆదివాసీ మ్యూజియాన్ని నిర్మించింది. దాన్ని స్వయంగా కేసీఆరే 2016లో ప్రారంభించారు. నూతన జిల్లాల కూర్పుపై చర్చలు జరుగుతున్నప్పుడు పూర్వం ఆసిఫాబాద్ జిల్లా ఉండేదని దాన్ని ఏర్పాటు చేయాలని తానే అధికారులకు గుర్తుచేసి ఆదేశించారు. దానికి కుమ్రం భీం ఆసిఫాబాద్ అని పేరు పెట్టారు. తెలంగాణ గడ్డ మీద పూసిన ఎర్రపూల విస్తరణను అడ్డుకునేందుకు ‘నక్సలైట్లే నిజమైన దేశభక్తులు’ అని ఎన్టీ రామారావు ఇదే గడ్డ మీద (తిర్యాణి మండలం గిన్నెదరిలో) నినదించి తాత్కాలికంగా వారి దృష్టి మళ్లించిన విషయాన్నీ… ఆ తర్వాత ఆయన అల్లుడు చంద్రబాబు వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధిపథంలో తీసుకెళ్తానని చెప్పి తిరిగి చూడని సంగతినీ… దశాబ్దాలపాటు ఆదివాసీలను దగా చేసిన కాంగ్రెస్ పాలననూ అడవిలోని ఏ కొమ్మను
అడిగినా చెప్తుంది.

Cm Kcr
పునరావిష్కరణ పతాక
రాంజీగోండ్ పరిపాలనలో భాగంగా ఉన్న ఆసిఫాబాద్‌ను 1907 దాకా ‘జున్గావా’గా పిలిచేవాళ్లు. ఆసఫ్జాహీ వంశం పేరున ఏర్పడిన ఆసిఫాబాద్‌కు నిజాం సర్కార్ అధిక ప్రాధాన్యం ఇచ్చేది. హైదరాబాద్ సంస్థానంలో ఉస్మాన్ అలీఖాన్ తొలి బస్‌డిపోను ఆసిఫాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. రెబ్బెనలోని రైల్వేస్టేషన్‌ను ఆసిఫాబాద్ రోడ్‌గా మార్చారు. 1905లో మహారాష్ట్రలోని నాందేడ్, యావత్మాల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో ఆదిలాబాద్ జిల్లా ఏర్పడింది. కానీ, దానికి 1940 వరకు ఆసిఫాబాదే జిల్లా కేంద్రంగా ఉండేది. నాటి నిజాం కార్యాలయ భవనాల్లో మొన్న మొన్నటిదాకా ఆసిఫాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొనసాగిన సంగతి ఈ తరానికి ఎలా తెలుస్తుంది? తెలంగాణ కోసం కేసీఆర్ బయలెల్లినప్పటి నుంచి జిల్లాల పునర్విభజన చర్చకు వచ్చినప్పుడే, ఆసిఫాబాద్ అసలు కథ అందరికీ తెలిసింది. ఏడున్నర దశాబ్దాలపాటు మరుగున పడిన ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం చరిత్రను కేసీఆర్ తవ్వితీశారు. అప్పటిదాకా నినాదానికే పరిమితమైన ‘మావ నాట.. మావ రాజ్’ (మాగ్రామంలో మా పాలన) అనే కొమురం భీం మాటను కేసీఆర్ నిజం చేశారు.

Pathaka
మళ్లీ పుట్టిన కాగితం
అవును. నిజం. ఇక్కడ కాగితం మళ్లీ పుట్టింది. 1938లో M/S Hyderabad Constru ction Company Ltd. పేరుతో ఏర్పడి ఏప్రిల్ 1942లో ఉత్పత్తి ప్రారంభించిన సిర్పూర్ పేపర్ మిల్ (ఎస్పీఎం) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో మూతపడింది. హైదరాబాద్ సంస్థానంలో స్థాపించిన మొట్టమొదటి కాగితపు తయారీ పరిశ్రమ ఇది. కాగితం తయారుచేసే ప్రాంతం కనుక కాలక్రమంలో దాని పేరు ‘కాగజ్‌నగర్’గా మార్పు చెందింది. తెలంగాణ వచ్చాక ఎస్పీఎంను తిరిగి తెరిపించేందుకు కృషిచేశారు నాడు పరిశ్రమల శాఖమంత్రిగా ఉన్న కేటీఆర్. ఫలితంగా, అక్కడ 2018లో పునరుత్పత్తి ప్రారంభమైంది.
జరానికే పానం పోయిన జాగలో…
అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన. అందరికీ గుర్తే. తాగేందుకూ సక్కగ నీరులేని కానికాలం. ఒర్రెల్ల నీళ్లు.. వాగుళ్ల నీళ్లు.. తోపుల్ల నీళ్లు.. దోసిటపట్టి గొంతుదించుకున్నారు అక్కడి బిడ్డలు. రక్షిత మంచి నీటి పథకం ఊసే ఎత్తలేదు ప్రభుత్వం. దాంతో పారేనీళ్లు పచ్చి విషమయ్యాయి. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జ్వరాలకు జనం పిట్టల్లా రాలారు. మలేరియా అనీ, చలిజ్వరం అనీ చెప్పుకొచ్చింది ప్రభుత్వం. కానీ, చూస్తుండగానే కేవలం జ్వరంతో కన్నుమూసిన వాళ్లు ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో 380 మంది అని సర్కారు లెక్కచెప్పింది. ఎన్నో ప్రయోగాలు చేసి ఆ చావులకు ‘కలుషిత నీరే కారణం’ అని తేల్చారు. సర్కారు చెప్పిన సంఖ్య నిజం కాదు.. అసలు 2,272 మంది చనిపోయిండ్లని అప్పటి ఏపీసీసీ లెక్క గట్టింది. 1999లో ఢిల్లీ నుంచి సోనియాగాంధీ నార్నూర్ వచ్చింది. కండ్ల నీళ్లు తీసుకుంటూ, ‘రేపు కాంగ్రెస్ సర్కార్ రాంగనే.. రోగం తిరిగే మందు కనుక్కుంటాం. అప్పటిదాకా ఓపిక పట్టండి’ అని ధైర్యం చెప్పింది. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెసే ఉమ్మడి రాష్ర్టాన్ని ఏలింది. అయినా ఈ జ్వరానికి శాశ్వత మందు కనుగొనలేదు. కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చాక ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందించే మిషన్ భగీరథ పథకం ప్రవేశ పెట్టారు. అలా చలి జ్వరానికి శాశ్వతంగా రోగం కుదిర్చారు. అంతేకాదు, జ్వరం వస్తే కిలోమీటర్ల కొద్దీ నడిచే తిప్పల్లేకుండా.. మంచాల మీద తీస్కపోయే అక్కరలేకుండా కండ్ల ముంగట.. కాళ్లకు దగ్గర్నే ఆసిఫాబాద్‌లో పెద్ద మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు.
‘కనక’రాజును కని..
ఎక్కడో ఆస్ట్రియాలో పుట్టి నిజాం పిలుపుతో ఇక్కడికి వచ్చి ప్రఖ్యాత మానవశాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన హేమన్డార్ఫ్కు ఆశ్రయం ఇచ్చిన మార్లవాయి (జైనూర్ మండలంలోని ఆదివాసీగ్రామం) ప్రపంచంలోనే ప్రత్యేకత సాధించింది. ఇక్కడ తనను చేరదీసిన లచ్చుపటేల్‌ను తన గుండెల్లో నిలుపుకోవటమే కాకుండా డార్ఫ్ తన కొడుక్కి అదే పేరు (లచ్చుపటేల్ అలియాస్ నికోలస్) పెట్టుకొని కృతజ్ఞత చాటుకున్నాడు. కానీ, నిజాం జమాన నుంచి కొత్త రాష్ట్రం పుట్టిన దాకా మార్లవాయి మొహం చూసినోళ్లు లేరు. కేసీఆర్ హయాంలో రాజ్‌గోండుల దైవనాట్యంగా పేరున్న గుస్సాడి నృత్యానికి ఈతరం నాట్యగురువుగా పిలిచే కనకరాజుకు పద్మశ్రీ వచ్చేందుకు చేసిన కృషితో పాటు, ఆయనకు రూ. కోటి ప్రకటించి అందజేసిన కాలాన్ని మార్లవాయి గుర్తు చేసుకుంటున్నది. అంతేనా కేసీఆర్ పదేండ్ల పాలనలో హేమన్‌డార్ఫ్ అధ్యయన నేపథ్యాన్ని ఆదివాసీల ఆత్మతో కేసీఆర్ ఆకళింపు చేసుకొని అడవి బిడ్డల జీవనస్థితిగతులను ఆకాశమంత మెరిసేలా చేశారు అనేది లోకానికి తెలిసిన ముచ్చటే.

Kanakaraju
గిరిజనం వాకిట భానూదయం
గిరులు, మైదానాలు అన్న తేడా లేకుండా గిరిజన బిడ్డలు సాగించిన ‘జల్.. జంగల్… జమీన్’ పోరు నినాదం వరకే పరిమితమైంది. కానీ, ఏకకాలంలో ఆదివాసీ -గిరిజనులు ఉండే 28 జిల్లాలు, 2845 గ్రామాల్లో 1,51,146 మందికి 4,06,369 ఎకరాల అటవీ భూమిపై నాడు కేసీఆర్ ప్రభుత్వం యాజమాన్య హక్కు పత్రాలను పంపిణీ చేసే కార్యక్రమానికి 2023 జూన్ 30వ తేదీన వేదిక అయిందీ కుమ్రం భీం ఆసిఫాబాద్. ఆ సందర్భంగా కుమ్రం భీం వారసుడు (మనుమడు) కుమ్రం సోనేరావు కేసీఆర్ గురించి చేసిన వ్యాఖ్యానం చిరస్మరణీయమైంది. ‘నావోరు తాదో బావనోర్. దాదోన్ జోసే సమ్జేమాన్తోర్’ (మా తాతలెక్క కేసీఆర్ మా గురించి పట్టించుకున్నరు. కేసీఆర్‌ల మా తాత ఉన్నడు అనుకుంటం’ అని ప్రకటించాడు. ‘ఆ కాలంల మా తాత జల్.. జంగల్.. జమీన్ అని ఫైట్ చేసిండు. అది కుమ్రం భీం చెప్పిన నీతి. దాన్ని అమలు చేసి పాటించిండు కేసీఆర్. ఆయనలో మాకు భీం కనిపిస్తడు’ అని చెప్పిన గడ్డ ఇది.
– నూర శ్రీనివాస్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

