విషం బారిన పడకుండా ఖైదీలను కాపాడిన ఇన్స్పెక్టర్ రుద్ర.. డోలో నుంచి అసలు విషయాలను రాబట్టాలని తీర్మానించుకొన్నాడు. అసలు డోలో ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ నేరంలో అరెస్టయ్యి జైలుకొచ్చాడు? ఎందుకు ఇలా చేస్తున్నాడు? అనే విషయాలు తెలుసుకోవడానికి రికార్డులను తిరగేశాడు. స్ట్రింగర్స్, స్పైల సాయంతో రికార్డుల్లో నమోదవ్వని రహస్య సమాచారాన్ని కూడా రాబట్టాలనుకొన్నాడు. చివరకు డోలోకు సంబంధించిన వివరాలతో ఓ కేస్ షీట్‌ను పట్టుకొని అతనున్న స్పెషల్ సెల్‌కు వెళ్లారు రుద్ర అండ్ టీమ్.
డోలో దగ్గరకు వెళ్లిన రుద్ర అతనితో.. ‘ఎంత కోటింగ్ ఇచ్చినా కూడా నోరు విప్పలేదట! మరేం పర్లేదు. నువ్వు ఏమీ చెప్పకు. మా స్ట్రింగర్స్, స్పైల ద్వారా నీ గురించి మాకు కావాల్సిన సమాచారం అంతా తెలిసిపోయింది’ అంటూ కేస్ షీట్ ఫైల్‌ను చూపిస్తూ రుద్ర ఇంకా ఏదో చెప్పబోయాడు. రుద్రను అడ్డుకొన్న డోలో..‘రుద్రా.. రుద్ర! నీ చెంచాగాళ్లు.. అదే, నీ స్ట్రింగర్స్, స్పైలు మహా అయితే, నేను చైనాలో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ కంపెనీలో ఓ సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేసినట్టు కనిపెట్టవచ్చు. డోలోకు ఫ్యామిలీ ఏమీ లేదని, ఒక్కడినేనని కూడా రాయొచ్చు. ఇంకా నాకు ప్రపంచంలోని దాదాపు అన్ని భాషలు వచ్చు అని కూడా చెప్పొచ్చు. ఈ మూడు ముక్కలకు మించి నా గురించి ఒక్క ముక్క కూడా ఎక్కువ దొరకలేదు కదూ’ అంటూ డోలో అనగానే.. అడ్డుకొన్న రుద్ర.. ‘నీ ముఖం. అది నీ ఓవర్ కాన్ఫిడెన్స్. నీ గురించి మాకు ఏంతెలియాలో అన్నీ తెలిశాయ్’ అంటూ దీటుగా బదులిచ్చాడు. దీనికి అంతెత్తున లేచిన డోలో.. ‘ఏయ్.. రుద్ర! ఇప్పుడు నేను చెప్పిన మూడు ముక్కలకు మించి ఏ ఒక్క విషయం నా గురించి ఎక్స్ట్రా తెలిసినా.. ఇప్పుడే.. ఇక్కడే.. నా గురించి, ఈ సీక్రెట్ ఆపరేషన్ గురించి మొత్తం నేనే స్వయంగా చెప్పేస్తా.. దమ్ముంటే ఒక్క ఎక్స్ట్రా విషయం నా గురించి చెప్పురా’ అంటూ సవాల్ విసిరాడు డోలో.
‘రుద్ర.. వాడు అంత రెచ్చిపోతుంటే మీరు ఆగిపోతారెందుకు. ఒక్క విషయమేనట కదా.. చెప్పేయండి. అప్పుడు గానీ వాడి అహం అణగదు’ అంటూ కరణ్ అనగానే, ‘అవునురా.. రుద్ర. ఒక్క ఎక్స్ట్రా డీటెయిల్ చెప్పమని సవాల్ విసిరాడుగా.. చెప్పేయ్’ అంటూ జయ కూడా కరణ్‌తో శ్రుతి కలిపింది. ‘అప్పుడు మనకు ఈ సీక్రెట్ ఆపరేషన్ గురించి రీసెర్చ్ చేసే పని తప్పుతుంది సార్’ అంటూ రామస్వామి ఆయాసంగా అన్నాడు. అదే భావనను స్నేహిల్ కూడా వ్యక్తం చేశాడు. ఎవరెన్ని మాట్లాడినా.. రుద్ర నోటి నుంచి మాట రావడంలేదు. డోలో సవాల్‌కు నిశ్చేష్టుడై ఆలోచనలోపడ్డాడు రుద్ర. ఇంతలో మళ్లీ కలుగజేసుకొన్న డోలో.. ‘వాడి ముఖం. వాడికి నా గురించి ఒక్క ఎక్స్ట్రా విషయం కూడా తెలియదు. రేయ్.. రుద్ర. నీకో విషయం చెప్పాలా.. నిజానికి నీ స్ట్రింగర్స్, స్పైలు నా గురించి కనిపెట్టిన ఆ మూడు ముక్కలు కూడా నేను కావాలనే ఆ విషయాలను బయటపెడితే, వారు కనిపెట్టారు గానీ, లేకపోతే వాళ్లకు ఆ విషయాలు కూడా తెలిసేవి కాదు. ఇదీ నీ నెట్వర్క్’ అంటూ గట్టిగా నవ్విన డోలో మళ్లీ కొనసాగించాడు.
‘రేయ్.. రుద్ర.. నీకు ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నా. నేను ఇప్పుడు చెప్పే ఓ కథలో అంతర్లీనంగా నేను ఎక్కడ నుంచి మొదలయ్యానో.. చివరికి ఎక్కడికి చేరానో అనే వివరాలు ఉన్నాయి. వాటిని నువ్వు కరెక్ట్‌గా కనిపెడితే, నా గురించి నువ్వు కనుక్కోవడం కాదు.. నా కథను నేనే చెప్తా.. నా కథ నీకు తెలియాలంటే, ఈ కథలో నా జర్నీని కనిపెట్టు’ అంటూ డోలో అంటుండగానే, వెంటనే తలూపాడు రుద్ర. డోలో మొదలుపెట్టాడు.
‘అది డైనోసార్ల కాలం. ఓ డైనోసార్ తన భారీ దేహంతో ఇబ్బందిపడేది. ఓ రోజు దానికి బాగా ఆకలై.. అర్ధరాత్రి ఓ శాపగ్రస్త గుడ్లగూబను తిన్నది. అంతే, ఒక్కసారిగా తిమింగలంగా మారిపోయింది. అయితే, మళ్లీ ముందులాగే ఇప్పుడు కూడా భారీ రూపం వచ్చిందని భావించిన ఆ తిమింగలం.. తాను ఉన్న నీటిలోనే పక్కన ముద్దు ముద్దుగా కదులుతున్న ఓ బాతును చూసింది. అంతే, తనను కూడా అలా బాతుగా మార్చమని దేవుడిని ప్రార్థించింది. అయితే, బాతుగా మారితే పిల్లి వచ్చి తినొచ్చని దేవుడు హెచ్చరించాడు. అయినా వినలేదు ఆ తిమింగలం. సరే నీ కర్మ అంటూ తిమింగలాన్ని బాతుగా మార్చాడు దేవుడు. అంతే, అలా మారిందో లేదో.. ఆ బాతును పిల్లి వచ్చి తినేసింది. అది చూసిన ఓ యువతి ఆ పిల్లిని కాలుతో గట్టిగా తన్నింది. ఆ దెబ్బకు పిల్లి కంట్లోంచి కన్నీళ్లు వచ్చాయి. అయితే, పిల్లి బాధను చూడలేని ఆ యువతి.. గిన్నెలో పాలు పోసింది. పిల్లికి స్నేహంగా ఉంటుందని ఓ కోడిని కూడా తీసుకొచ్చి పెంచింది. ఇదీ కథ’ అంటూ డోలో ముగించాడు.
ఆ కథను విన్న కరణ్, జయ, రామస్వామి, స్నేహిల్ మూకుమ్మడిగా.. ‘రుద్ర.. వీడికి పిచ్చి పట్టింది. మన టైమ్ వేస్ట్ చేయడానికే ఇలాంటి కథలు చెప్తున్నాడు. ముందు ఆ కేస్‌షీట్‌లో ఉన్న వీడి వివరాలను ఫాలో అవుతూ మనం ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుదాం’ అని అంటున్న వారిని అడ్డుకొన్న రుద్ర.. ‘ఇప్పుడు డోలో ఏ మూడు ముక్కలైతే చెప్పాడో.. మన స్ట్రింగర్స్ ఇచ్చిన రిపోర్ట్‌లో అవే ఉన్నాయి’ అని రుద్ర బదులివ్వగానే అందరూ నిర్ఘాంతపోయారు. సన్నగా విజిల్ వేయడం ప్రారంభించాడు డోలో. అయితే, ఆ విజిల్‌ను డామినేట్ చేస్తూ గట్టిగా విజిల్ వేసిన రుద్ర.. ‘ఏయ్.. డోలో! నీ అసలు స్టోరీ చెప్పడం ప్రారంభించడానికి రెడీ అవ్వు..’ అంటూ డోలో చెప్పిన కథలో అంతర్లీనంగా ఉన్న అతని జర్నీని దేశాల పేర్లతో సహా వరుసగా చెప్పాడు రుద్ర. అది విన్న డోలో ఒక్కసారిగా షాకయ్యాడు. రుద్ర చెప్పిందేంటో మీరు కనిపెట్టారా?
సమాధానం : డోలో చెప్పిన కథలోని జంతువులు, పక్షులు ఒక్కో దేశం మ్యాప్‌ను పోలినట్టు ఉంటాయి. వాటిని కథా వరుసలో పెడితే, పాకిస్థాన్‌లో (డైనోసార్) మొదలైన డోలో ప్రయాణం.. అక్కడి నుంచి ఫ్రాన్స్ (గుడ్లగూబ), ఆ తర్వాత ఫిన్లాండ్ (తిమింగలం), బెలారస్ (బాతు), బల్గేరియా (పిల్లి), ఇటలీ (యువతి కాలు బూటు), శ్రీలంక (కన్నీటి బిందువు) నుంచి చివరకు చైనా (కోడి)కి చేరినట్టు రుద్ర తేల్చేశాడు.