Kolkata | కిటకిట నగరిలో ఆ మూడు వీధులు తిరిగి.. ఈ ఆరు రుచులు ఆస్వాదించండి!
‘మాతంగీ కాళీ నిలయా.. చౌరంగీ రంగుల దునియా...’ అని కలకత్తా పురి వైభవాన్ని చాటిన వేటూరి పాటలో.. అక్కడి వీధి రుచుల ఘుమఘుమలు కనిపించవు. కానీ, ఈ కిటకిట నగరిలో వీధివీధికీ కరకరలాడే చిరుతిండి పలకరిస్తుంది.
Kolkata | ‘మాతంగీ కాళీ నిలయా.. చౌరంగీ రంగుల దునియా…’ అని కలకత్తా పురి వైభవాన్ని చాటిన వేటూరి పాటలో.. అక్కడి వీధి రుచుల ఘుమఘుమలు కనిపించవు. కానీ, ఈ కిటకిట నగరిలో వీధివీధికీ కరకరలాడే చిరుతిండి పలకరిస్తుంది. బెంగాలీ విందులో మిర్చి మసాలా అంత ఘాటుగా ఉండకపోయినా.. గంగూలీ సందులో కాటీ రోల్స్ చవులూరిస్తాయి. ఈసారి ఆ మహా నగరికి వెళ్లినప్పుడు.. హౌరా వారధి చూడటంతోనే సరిపెట్టకుండా మూడు వీధులు తిరిగి ఆరు రుచులు ఆస్వాదించండి.
బెంగాలీ బాబుల బుగ్గలు రసగుల్లాల్లా ఉంటాయంటారు. సంగీత దర్శకుడు ఎస్డీ బర్మన్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్తరువులు చూడండి.. ఈ మాట ఎంతమాత్రం అతిశయం కాదని ఒప్పుకొంటారు. బెంగాలీ బాబీలు ప్రేమగా చేసే రసగుల్లాలు.. కోల్‌కతాకు వచ్చే అతిథులను తియ్యగా పలకరిస్తాయి. వంగసీమ స్వీట్లలో రసగుల్లాది ప్రత్యేక స్థానం. కోల్‌కతాలో దిగాక ఎక్కడ రుచికరమైన రసగుల్లాలు దొరుకుతాయోనని మల్లగుల్లాలు పడకండి.. ఏ మిఠాయి కొట్టుకు వెళ్లినా, ఈ స్పెషల్ స్వీటు సదా సిద్ధంగా ఉంటుంది. ఓ రెండు నోట్లో వేసుకొని, బుగ్గలు ఉబ్బిస్తే సరి!
తియ్యటి వేడుక చేసుకున్నాక కాస్త కారం తగిలితే జిహ్వ వహ్వా అంటుంది! జైకా ఏరియా పార్క్ స్ట్రీట్‌లో కాటీ రోల్స్ ఫేమస్. పరాఠాలను పిజ్జాకన్నా అందంగా ముస్తాబు చేసి ఇచ్చే హాట్ ఫుడ్ ఇది. వేడివేడి పరాఠాపై చికెన్ కూరో, మటన్ కర్రీనో, వెజ్ పాకమో ఏది కోరితే అది వేసి.. సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు పరిచి, రోల్ చేసి ఇస్తారన్నమాట! దాన్ని టేస్ట్ చేయగానే.. పక్కనున్న కోల్‌కతా బాబూ మొషాయ్ని “చాలా బాగుంది’ అనడానికి బెంగాలీలో ఏం చెప్పాలి” అని అడక్కుండా ఉండలేం.
రెండు రుచులు చవిచూసి ఊరుకుంటే ఏం బాగుంటుంది? పొట్టలో పేరుకున్న పరాఠాలు కాస్త అరిగేలా పది అడుగులు వేసి మరో వీధిలోకి తిరిగితే.. మరో రుచి పలకరిస్తుంది. దానిపేరు లుచీ ఆలూ దమ్. మన పూరీకి తక్కువ, పానీపూరీకి ఎక్కువ సైజులో ఉంటుందీ వెరైటీ! దీంట్లోకి కాంబినేషన్‌గా ఇచ్చే దమ్ ఆలూ చేయడంలో కోల్‌కతా పాకయాజులు కింగులే! ఆలుగడ్డ ముక్కలను సుతిమెత్తగా ఉడికించి, ఎర్రనికారం దట్టించి ఇచ్చే ఈ కర్రీ అదిరిపోతుందంతే! ఒక్కసారి ఈ కాంబినేషన్ ట్రై చేశాక.. పక్కవాడి ప్లేట్లోని లుచీ లాక్కుని పేచీకి దిగినా ఆశ్చర్యపోనవసరం లేదు!
ఇక సాయంత్రం పనిగట్టుకొని అయినా నెహ్రూ రోడ్‌కు వెళ్లి.. మొఘులాయ్ పరాఠా టేస్ట్ చేయాల్సిందే! త్రికోణాకృతిలో కట్ చేసి ఇచ్చే పరాఠాల్లో కార్న్, ఆనియన్ ఇలా రకరకాల వెరైటీలు అందుబాటులో ఉంటాయి. వంగసీమలో అడుగుపెట్టిన తర్వాత జలపుష్పాల వంటకాలు రుచి చూడకుండా మత్స్యనారాయణుడి అనుగ్రహం పొందగలమా? చేపలతో బెంగాలీలు చేసినన్ని వెరైటీ పాకాలు మరెవరికీ రావన్నది అక్షర సత్యం. చేపల కూర తిని ఊరుకుంటే..కోశా మాంగ్షోకు కోపం రాకుండా ఉంటుందా! గంటల తరబడి నిదానంగా వండే మటన్ కూర ఇది. బెంగాలీలు దీన్ని కంఫర్ట్ ఫుడ్‌గా భావిస్తారు.
కోల్‌కతాలో దొరికే మరో వెరైటీ ఆలూ పోస్టో! గసగసాలు నూరి, వివిధ మసాలాలు కూరి చేసే ఆలూ కూర దేంట్లోకి నంజుకున్నా సూపర్బ్‌గా ఉంటుంది. టెలీభాజా రుచి చూడకుంటే కోల్‌కతా పర్యటన పూర్తికానట్లే! పేరు చిత్రంగా ఉంది.. ఇదేం వెరైటీనో అనుకోకండి! వంకాయ బజ్జీలనే బెంగాలీలో టెలీభాజా అంటారు! వీధివీధిలో ఈ బండ్లు కనిపిస్తాయి. అరటికాయలతోనూ కొందరు చేస్తారు. ఎంతో రుచిగా ఉంటాయి. ఇన్ని తిన్నాక ఊరికే వచ్చేస్తే.. పొట్టలో కంగారు పుట్టొచ్చు. అలా కావొద్దంటే.. కలకత్తా కిళ్లీ వేసుకుంటే సరి!!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

