గాండీవం (అది ఎవరు)
చతుర్మహా వరాలకు సంబంధించి నాలుగు అస్త్రాల పేర్లను రుద్ర కరెక్ట్‌గా చెప్పడంతో పత్రం పునఃరూపంలోకి మారిపోయింది. ‘జయము.. జయము.. వీరాధివీరా.. భవిష్యత్తు ప్రమాదాలను నియంత్రించే చతుర్మహా వరాలకు సంబంధించిన నాలుగు మహిమాన్విత అస్ర్తాల పేర్లను సరిగ్గా చెప్పావు’ అంది దైవవాణి.
ది మిస్టరీస్ ఆఫ్ ద్వారకా-9
ఈ అస్త్రాల శక్తి నీకు లభిస్తే, ఈ ప్రపంచం మరో స్వర్గసీమవుతుంది. నాలుగు అస్త్రాల్లో రెండు అస్ర్తాలు అంటే గాండీవం, శారంగం ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. అంటే, ఒకదాన్ని గెలిస్తే, కొద్దిపాటి శ్రమతోనే మరొకటి ప్రసాదంగా నీ దరి చేరుతుంది. మూడు, నాలుగు అస్త్రాలైన సుదర్శన చక్రం, పాంచజన్యం.. నీ పూర్తి శక్తి-యుక్తులతో సాధించాల్సిందే. ముందు తొలి అస్త్రం గురించి చెప్తాను జాగ్రత్తగా విను’ అంటూ ఆ దైవవాణి ఇలా కొనసాగించింది. రుద్రతో పాటు మిగతావారందరూ శ్రద్ధతో వినడం ప్రారంభించారు.
‘అర్జునుడి ధనుస్సుగా పిలిచే ఈ గాండీవాన్ని బ్రహ్మదేవుడు ధర్మాన్ని రక్షించడానికి సృష్టించాడు. ఈ ధనుస్సుకు అక్షయ తూణీరం ఉంది.. అంటే, ఎన్ని బాణాలు వదిలినా కొత్తగా వస్తూనే ఉంటాయి. శత సహస్ర వర్షాపాటు బ్రహ్మ ఈ ధనుస్సును తన వద్దే ఉంచుకొని ఆ తర్వాత శివుడికి అటు నుంచి ఇంద్రుడు, చంద్రుడికి ఆ తర్వాత వరుణదేవుడికి ఈ గాండీవం చేరింది. కురుక్షేత్రానికి ముందు ఖాండవ వన దహన సమయంలో వరుణదేవుడి ప్రసాదంతో అగ్నిదేవుని ద్వారా అర్జునునికి ఈ ధనుస్సు లభించింది. ఇంద్రుడి వర్షాన్ని అడ్డుకోవడానికి తొలుత ఈ గాండీవం సాయపడింది. అనంతరం కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టడానికి, భీష్మ, ద్రోణ, కర్ణాది మహాయోధులను ఎదుర్కోవడానికి అర్జునుడికి ఈ గాండీవమే ప్రధాన ఆయుధంగా నిలిచింది. మహాభారత యుద్ధం ముగిసి, ద్వాపరయుగం అంతమయ్యే సమయంలో.. అర్జునుడు దీనిని తిరిగి సముద్రుడికి ఇచ్చి.. తద్వారా వరుణ దేవునికి అప్పగించాడు. ఇప్పుడు భవిష్యత్తు ప్రపంచాన్ని కాపాడటానికి గాండీవ మహా ప్రసాదమైన జల కలశం మీకు అవసరం. ఆ కలశం దగ్గర ఉంటే, నీటి కష్టాలు తొలగిపోవడమే కాదు జలప్రళయాలు సంభవించకుండా రక్షగా ఉంటుంది. జలకలశ మంత్రం ఈ పత్రంలో ఉంది. ఆ మంత్రం నీ వశం కావాలంటే, గాండీవానికి నారి బిగించు. మానవమాత్రులైన మీకు అది అసాధ్యం. అయితే, ఆ గాండీవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఓ మార్గం ఉంది. చెప్తా.. జాగ్రత్తగా విను’ అంటూ దైవవాణి మళ్లీ కొనసాగించింది. ఇంతలోనే పక్కన అత్యంత తేజోమయ కాంతితో ఓ ధనుస్సు ప్రత్యక్షమయ్యింది.
‘వీరా.. నీ పక్కన కనిపిస్తున్న తేజోమయ ఆయుధమే.. గాండీవం. దాని నారిని నువ్వు బిగించాలంటే.. అంతకుముందు ఇది చెయ్యి.
‘చన్నులేని ఆవు పాలు అవి. చెయ్యిలేని వాడు వాటిని పిండాడు. అగ్నిలేకపోయినా ఆ పాలు మరిగిపోయాయి. అలాంటి పాలను నోరులేని బాల తాగింది. ఇప్పుడు ఆ పాలను వెంటనే ఓ పాత్రలో నువ్వు తీసుకొనిరా.. పాత్రలోని సగం పాలను తామరకమలానికి మొదట రాయి.. ఆ కమలం మీద ఉన్న కలువ పువ్వులకు నువ్వు తీసుకొచ్చిన పాలను అద్దు. కలువ పువ్వుల కింద ఉన్న సంపెంగ పువ్వును ఈ పాలతో తడుము. సంపెంగ పువ్వు కింద ఉన్న దొండ పండ్లను ఆ పాలతో నిమురు. దొండ పండ్లలో దాగున్న మల్లె మొగ్గలపై ఈ పాలను పోయి’ అలా చేసిన తర్వాత ఆ పాత్రలో మిగిలిపోయి స్వచ్ఛంగా ఉన్న ఆ పాలను ఈ గాండీవంపై పోయి. అప్పుడు ఆ గాండీవం నీ వశమయ్యి.. దాని నారిని నువ్వు బిగించగలవు. ఆ నారిని బిగించిన తర్వాత.. ఏం చేయాలో చెప్తాను. నీకు పది నిమిషాల సమయం మాత్రమే’ అంటూ దైవవాణి ఆగిపోయింది.

Arjuna
దైవ వాణి ఇచ్చిన సూచనలు ఎవ్వరికీ అర్థంకాలేదు. ఏంచేయాలో తెలియట్లేదు. ఇంతలో రామస్వామి.. ‘సార్.. పొడుపు కథల్లో ఇలాంటివి నేను విన్నాను. కానీ, నేను చెప్పే జవాబు సరైనదో లేదో మాత్రం నాకు తెలియదు’ అంటూ సంశయంతో అన్నాడు. అప్పటికే, ఏమీ తోచని రుద్ర.. ‘మరేం పర్లేదు.. చెప్పండి బాబాయ్..’ అనగానే, కాస్త ధైర్యం తెచ్చుకొన్న రామస్వామి.. రుద్ర చెవిలో ఏదో చెప్పాడు. ఆ వెంటనే అప్రమత్తమైన రుద్ర.. రామస్వామి చెప్పినట్టే చేస్తూపోయాడు. అందరూ వింతగా చూస్తున్నారు. కాసేపటికి, పనులన్నీ పూర్తికాగానే, రుద్ర సులువుగా బంగారం, రత్నాలతో పొదిగిన గాండీవాన్ని అరచేయితో సునాయాసంగా లేపి నారి బిగించాడు. ఇంతలో పసిడితో మెరిసిపోతూ అక్షయ తూణీరాలు ప్రత్యక్షమయ్యాయి. ‘భేష్.. వీరాధివీరా.. అనుకొన్నట్టుగానే, సరిగ్గా సమాధానాలు చెప్పావ్. ఇక, గాండీవం ద్వారా జలకలశం నీ సొంతం కావాలంటే, ఆ పదునైన అక్షయ తూణీరాలతో నీ ముఖాన్ని ఛిద్రం చేసుకో!’ అంటూ రుద్రతో దైవవాణి అనగానే, అందరూ షాక్‌కి గురయ్యారు. అది, పక్కనబెడితే, రుద్రకు రామస్వామి ఇచ్చిన జవాబులేంటో చెప్పగలరా?
సమాధానం
మొదటగా.. చన్నులేని ఆవు పాలు అవి (నీటితో నిండిన మేఘం).. చెయ్యిలేని వాడు వాటిని పిండాడు (మేఘం కురిసింది).. అగ్నిలేకపోయినా ఆ పాలు మరిగిపోయాయి (ఎండతో సముద్రపు నీరు ఆవిరైంది).. అలాంటి పాలను నోరులేని బాలతాగింది (ఆ ఆవిరి నీటిని మేఘం తాగింది).. అంటే వాననీరు. ఆ వాననీరును తామరకమలానికి (ముఖానికి) మొదట రాయి.. ఆ కమలం మీద ఉన్న కలువ పువ్వులకు (కండ్లు) నువ్వు తీసుకొచ్చిన పాలను అద్దు. కలువ పువ్వుల కింద ఉన్న సంపెంగ పువ్వును (ముక్కుకు) ఈ పాలతో తడుము.. సంపెంగ పువ్వు కింద ఉన్న దొండ పండ్లను (పెదవులు) ఆ పాలతో నిమురు.. దొండ పండ్లలో దాగున్న మల్లె మొగ్గలపై (దంతాలు) ఈ పాలను పోయి. రుద్ర తనకు తానుగా ఇలా చేశాడు.
– రాజశేఖర్ కడవేర్గు
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

