ప్రకృతి గర్భం ఒక అనంతమైన రహస్యాల గని. శతాబ్దాల తరబడి భూమి పొరల్లో దాగి ఉండే ఒత్తిడి, వేడి.. కారణంగా శిలాజాలు కాలక్రమేణా అత్యంత విలువైన రత్నాలుగా రూపాంతరం చెందుతాయి. ఇటీవల మయన్మార్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద కెంపు లభ్యమవడంతో ప్రపంచవ్యాప్తంగా రత్నాలగురించిన చర్చ మళ్లీ ఊపందుకుంది.ఇప్పటివరకు మానవాళి కంటికి చిక్కిన అత్యంత భారీ, అత్యంత ఖరీదైన పచ్చ, వజ్రం, ముత్యం, పగడం వంటి మహారత్నాలు ఎక్కడ దొరికాయి? వాటి బరువు, విలువ ఎంత? ప్రస్తుతం అవి ఎక్కడ ఉన్నాయి? లాంటి విశేషాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ద గిగా పర్ల్… 27 కిలోల ముత్యం!

అందానికి, స్వచ్ఛతకు చిహ్నం.. ముత్యం. సముద్రంలో దొరికే ఈ ప్రకృతి సిద్ధ అందంలోనూ ప్రపంచపు అద్భుతాలు ఉన్నాయి. వాటిలో ఒకటి గిగా పర్ల్. ఇది ప్రత్యేక రకమైన సముద్రపు చిప్పల ద్వారా సహజంగా ఏర్పడిన భారీ ముత్యం. ఒక ఫిలిపినో-కెనడియన్ కుటుంబానికి ఇది వారసత్వంగా లభించింది. గిన్నిస్ వరల్డ్ బుక్, జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద ముత్యంగా గుర్తించాయి. ఫిలిప్పీన్స్‌లోని పలావన్ దీవుల తీరంలో ఒక మత్స్యకారుడికి ఇది లభించింది. అయితే 2018లోనే అధికారికంగా ప్రపంచానికి పరిచయమైంది. సముద్రంలో ఒక రాక్షస గుల్ల లోపల ఈ ముత్యం ఆ మత్స్యకారుడికి దొరికింది. దాని విలువ తెలియని ఆయన, దానిని ఒక ‘అదృష్ట దేవత’గా భావించి తన మంచం కింద చాలా ఏండ్లపాటు దాచుకున్నాడట. ఒకసారి అతని ఇల్లు తగలబడినప్పుడు, దీనిని సురక్షితంగా బయటికి తీసి అధికారులకు చూపించడంతో ప్రపంచం నోరెళ్లబెట్టింది. 1934 సంవత్సరంలో ఇది దొరకగా దీని బరువు సుమారు 27.65 కిలోలు. అంటే, దాదాపు 1,38,250 క్యారెట్లు. 850 కోట్ల రూపాయల విలువచేసే దీన్ని, కెనడాలోని టొరంటోలో 22 క్యారెట్ల బంగారంతో చేసిన ఆక్టోపస్ శిల్పంలో అమర్చి ప్రదర్శిస్తున్నారు.
మయన్మార్ ‘మహా కెంపు’

మన దగ్గర బాగా ప్రాచుర్యం పొందిన రత్నాల్లో కెంపు ఒకటి. దాని ఆకర్షణీయమైన రంగు నగల్లో ఇమిడే స్వభావం వల్ల మనవాళ్లు దీన్ని ఎంతగానో ఇష్టపడతారు. మయన్మార్‌లోని ప్రముఖ రత్నాల లోయ ‘మొగోక్’ ప్రాంతంలో ఇటీవల మైనింగ్ చేస్తుండగా ఒక భారీ కెంపు రాయి లభ్యమైంది. దీని బరువు 2.2 కిలోలు (దాదాపు 11,000 క్యారెట్లు). ఇదివరకు 1996లో ఇంతకంటే పెద్ద కెంపు దొరికినప్పటికీ, ప్రస్తుత రత్నం రంగు (నేరేడు రంగు కలగలిసిన ఎరుపు…పర్పుల్-రెడ్), పారదర్శకత అత్యంత శ్రేష్టమైనవిగా నిపుణులు తేల్చారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ కొన్ని వందల కోట్లు పలుకుతుందని అంచనా. ప్రస్తుతం దీన్ని మయన్మార్ ప్రభుత్వ అధీనంలో, రాజధాని నేపిడోలోని దేశాధ్యక్షుడి కార్యాలయంలో భద్రపరిచారు.
భారీ పచ్చ… బహీయా ఎమరాల్డ్

ప్రపంచంలోనే ఇప్పటివరకు లభ్యమైన అత్యంత భారీ, అరుదైన పచ్చ శిల బహీయా ఎమరాల్డ్ . ఇది ఒకే పెద్ద రాయిలా కాకుండా, నల్లటి ఖనిజ శిలగా కనిపిస్తుంది. దీని లోపల దాదాపు తొమ్మిది భారీ పచ్చ స్పటికాలు కలిసిపోయి ప్రకృతి సిద్ధంగా రూపుదిద్దుకుంది. 2001లో బ్రెజిల్‌లోని ‘బహీయా’ మైనింగ్ ప్రాంతంలో ఇది దొరికింది. దీని బరువు దాదాపు 341 కిలోలు. రత్నాల లెక్కల్లో చెప్పాలంటే అక్షరాలా 17,00,000 క్యారెట్లు (1.7 మిలియన్ క్యారెట్లు)! ఇక, అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ.3,300 కోట్లుగా లెక్కగట్టారు. ఈ పచ్చ రత్నం కథ హాలీవుడ్ సినిమాను తలపిస్తుంది. బ్రెజిల్ నుంచి అమెరికాకు అక్రమంగా రవాణా అయిన ఈ రత్నం, 2005లో ‘కత్రినా’ తుఫాను వరదల్లో న్యూ ఓర్లీన్స్‌లోని ఒక అండర్‌గ్రౌండ్ వాల్ట్‌లో నీట మునిగింది. ఆ తర్వాత దీని యాజమాన్యం కోసం దాదాపు 8 మంది కోర్టుల్లో దావాలు వేశారు. చివరకు అమెరికా ప్రభుత్వం దీనిని స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి అత్యంత సురక్షితమైన రహస్య ప్రభుత్వ వాల్ట్‌లో భద్రంగా ఉంది.
కలినన్ డైమెండ్.. రాజ చిహ్నం!

మానవ చరిత్రలోనే ఇప్పటివరకు దొరికిన అత్యంత భారీ, నాణ్యమైన ముడి వజ్రం ‘కలినన్’. దక్షిణాఫ్రికాలోని ప్రీటోరియా సమీపంలో ఉన్న
‘ప్రీమియర్ నంబర్ 2’ గనిలో మైనింగ్ సూపరింటెండెంట్ అయిన ఫ్రెడరిక్ వెల్స్ దీనిని కనుగొన్నారు. ఆ గని యజమాని థామస్ కలినన్ పేరు మీదుగా దీనికి నామకరణం చేశారు. 1905 సంవత్సరంలో లభ్యమైన ఈ వజ్రం బరువు 3,106 క్యారెట్లు. ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం దీని అంచనా విలువ దాదాపు రూ.3,300 కోట్లు. అయితే దీని చారిత్రక ప్రాధాన్యం దృష్ట్యా ఇది మరింత అమూల్యమైనదిగా చెప్పవచ్చు.
దక్షిణాఫ్రికా ప్రభుత్వం దీనిని బ్రిటన్ రాజు ఎడ్వర్డ్ VIIకి పుట్టినరోజు కానుకగా బహూకరించింది. ఆ తర్వాత ఈ భారీ వజ్రాన్ని కట్ చేసి, 9 పెద్ద ముక్కలుగా (కలినన్ I నుంచి కలినన్ IX వరకు), 96 చిన్న వజ్రాలుగా మార్చారు. ఇందులో అతిపెద్ద ముక్క అయిన ‘కలినన్-1’ (స్టార్ ఆఫ్ ఆఫ్రికా- 530.2 క్యారెట్లు) వజ్రాన్ని బ్రిటన్ రాజదండంలో అమర్చారు. రెండో పెద్ద ముక్క అయిన కలినన్-2 (317.4 క్యారెట్లు) వజ్రాన్ని రాజ కిరీటం (బ్రిటన్ ఇంపీరియల్ స్టేట్ క్రౌన్) ముందు భాగంలో అమర్చారు. ప్రస్తుతం ఇవన్నీ లండన్ టవర్లోని ‘హౌస్ ఆఫ్ విండ్సర్’ రాయల్ కలెక్షన్లో అత్యంత భద్రత మధ్య ఉన్నాయి.
వారెవ్వా వైఢూర్యం!

రత్నాల రాశిలో వైఢూర్యానిది ప్రత్యేక స్థానం. అందులో శ్రీలంకకు చెందిన ‘ది ఐ ఆఫ్ ది డ్రాగన్’ ప్రపంచంలోనే అతిపెద్ద కట్ చేసిన రత్నంగా రికార్డు సృష్టించింది. ఇది పసిడి-పచ్చరంగులో మెరిసిపోతుంది. కాంతి పడినప్పుడు పిల్లి కన్నులాంటి ఒక తీక్షణమైన తెల్లని కాంతి రేఖ అటూ ఇటూ కదులుతూ కనిపించడం దీని ప్రత్యేకత. ఈ రేఖ డ్రాగన్ కంటిని పోలి ఉండటంతో దీనికా పేరు వచ్చింది. ఈ అపురూప రత్నం 19వ శతాబ్దం చివరలో శ్రీలంకలోని ప్రసిద్ధ రత్నాల గని ప్రాంతమైన ‘రత్నపుర’లో లభ్యమైంది. ముడి రూపంలో ఉన్న ఈ శిలను ఎంతో నైపుణ్యంతో కట్ చేసిన తర్వాత దీని నికర బరువు అక్షరాలా 465 క్యారెట్లు (సుమారు 93 గ్రాములు)గా తేలింది. సాధారణంగా మార్కెట్లో 5 నుంచి 10 క్యారెట్ల నాణ్యమైన వైడూర్యం దొరకడమే గగనం. అలాంటిది 465 క్యారెట్ల భారీ పరిమాణంలో, ఎక్కడా చిన్న పగులు కూడా లేకుండా లభించడం రత్న శాస్త్ర చరిత్రలోనే ఒక అద్భుతం. అంతర్జాతీయ మార్కెట్ అంచనాల ప్రకారం దీని విలువ సుమారు రూ.500 కోట్ల నుంచి రూ.650 కోట్లు ఉంటుంది. ఈ ప్రత్యేక రత్నం ప్రస్తుతం అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.లో గల ప్రసిద్ధ ‘స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ’లో భద్రంగా ఉంది. దీనిని ‘మహారాణి క్యాట్స్ ఐ’గా పిలుస్తున్నారు.
అతిపెద్ద ఏకశిలా పగడం

మహాసముద్రాల లోతులు ఎప్పుడూ వింతలు, విశేషాలకు నిలయాలు. పసిఫిక్ మహాసముద్రంలో శాస్త్రవేత్తలు కనుగొన్న ఒక సరికొత్త జీవ కళాఖండం అప్పట్లో ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ఒకే ఒక్క జీవిగా శతాబ్దాలుగా పెరుగుతూ, ఏకంగా బ్లూ వేల్ కంటే పెద్దదిగా మారిన ఒక ‘మెగా కోరల్’ గురించే ఇదంతా. పసిఫిక్ మహాసముద్రంలో 2024 అక్టోబర్‌లో నేషనల్ జియోగ్రాఫిక్ బృందం ఈ అతి పెద్ద పగడాన్ని కనుగొంది. ఈ చానెల్‌కు చెందిన ‘ప్రిస్టీన్ సీస్’ బృందం సోలమన్ దీవుల సమీపంలో పరిశోధనలు చేస్తున్నప్పుడు ఈ అద్భుతం బయటపడింది. సముద్రపు లోతుల్లో ఏదో నౌక మునిగిపోయి ఉంటుందని భావించిన డైవర్లు, దగ్గరకు వెళ్లి చూసి ఆశ్చర్యపోయారు. అది ఎటువంటి నౌక కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా నిశ్శబ్దంగా పెరుగుతూ వస్తున్న ఒక భారీ పగడం.ఇది ఎంత పెద్దదంటే.. అంతరిక్షం నుంచి కూడా చూడొచ్చు. ఇది 34 మీటర్ల వెడల్పు, 32 మీటర్ల పొడవు, 5.5 మీటర్ల ఎత్తుతో ఉంది. ఐదు టెన్నిస్ కోర్టులను పక్కపక్కన పెడితే ఎంత స్థలం ఆక్రమిస్తుందో, అంత పెద్దగా ఇది వ్యాపించి ఉంది. పవోనా క్లావస్ అనే నిర్దుష్ట జాతికి చెందిన ఈ ఒకే ఒక్క పగడంలో సుమారు 100 కోట్ల సూక్ష్మ పగడపు జీవులు కలిసికట్టుగా జీవిస్తున్నాయి. శాస్త్రవేత్తల ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ పగడం వయసు సుమారు 300 నుంచి 500 సంవత్సరాలు. అంటే, అమెరికా స్వతంత్ర దేశం కాకముందు నుంచి, భారతదేశంలో మొఘలుల పరిపాలన కాలం నాటి నుంచి ఈ పగడం సముద్ర గర్భంలో పెరుగుతూనే ఉందన్నమాట! ఇన్నాళ్లూ ఎన్నో తుఫానులు, సముద్ర మార్పులు, మానవ కాలుష్యాలను తట్టుకుని ఇది ఇంత కాలం సజీవంగా ఉండటం ఒక పెద్ద అద్భుతం!