శ్రావణ మేఘాలు రాగాలు తీస్తున్నవేళ.. కొంగుముడి వేసుకుంటున్న కొత్త జంటల్లో ఉరిమే ఉత్సాహం! ఉభయులూ ఒకరికొకరు అభయం ఇచ్చుకున్నా.. బయటికి కనిపించని బెరుకేదో ఆ ఆనందానికి బ్రేక్ వేస్తుంటుంది. పెండ్లికి ముందు ఎంత తెలుసుకున్నా.. మూడుముళ్లు పడిన తర్వాత ఇరువురి జీవితమూ వింత ప్రశ్నలతో కూడిన ప్రహేళికలా మారిపోతుంది. సంసార సూత్రాలు, దాంపత్య రహస్యాలు కలివిడిగా పూరిస్తేనే.. పదకేళిక వినోదభరితంగా సాగుతుంది. ఆమెకు జవాబు తట్టకపోతే.. ఆయన వెన్నుతట్టాలి. ఆయనకు ప్రశ్న అర్థం కాకపోతే.. ఆమె విడమర్చి చెప్పాలి. ముద్దులు ఇచ్చి పుచ్చుకున్నంత ఇదిగా… సలహాలు, సూచనలు పంచుకోవాలి.
మురిపాలు తోడుకున్నంత ఆత్రంగా.. ఒకరి కష్టంలో మరొకరు తోడుండాలి. ఏడడుగులతో మొదలయ్యే జీవన యానంలో ఒక్కసారిగా తలెత్తే మార్పులు కొత్తజంటను తడబడేలా, పొరబడేలా చేయొచ్చు. అకస్మాత్తుగా మారే దినచర్య అతనిలో కంగారు పుట్టిస్తే, అనివార్యంగా ఎత్తుకోవాల్సిన బాధ్యతలు ఆమె ఓపికకు పరీక్షగా నిలుస్తాయి. ఆ కంగారు తగ్గాలన్నా, ఈ పరీక్ష నెగ్గాలన్నా.. ఇద్దరం ఒక్కటే అన్న స్పృహ సదా కలిగి ఉండాలి. ఈ శ్రావణంలో ఒక్కటవుతున్న జంటల కోసమే ఈ ప్రణయగీత. సంసార యోగం, శృంగార యాగం, అనుబంధాల రాగం.. కలగలిసిన ఈ గీత మీ కల్యాణ గీతికను కల్యాణీరాగమంత కమనీయంగా మార్చేస్తుంది.
-కణ్వస
రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాః అని ఆర్షవాక్కు. ఎంత పెద్దలు కుదిర్చినా, ప్రేమించి పెండ్లి చేసుకున్నా.. రాసిపెట్టి ఉంటేగానీ పెండ్లిపుస్తకం శ్రీకారం చుట్టుకోదు! పెండ్లి దాకా ఒక లెక్క.. పెండ్లి తర్వాత ఇంకో లెక్కగా ఉంటుంది లైఫ్! పైగా ఇప్పుడు ముడిపడుతున్న జంటలన్నీ దాదాపు జెన్ జీ తరానికి చెందినవే! పెద్దల మాటలు చెవికెక్కించుకోవడం అంతగా అలవాటు లేని తరమిది! డేటింగ్ వలపు వలలు దాటుకొని వచ్చిన ఘనులే చాలామంది. ‘పెండ్లంటే… నూరేండ్ల పంట’ అని హితవు పలికితే ఎగాదిగా చూసే రకమే అంతా! తరం ఏదైనా.. పెండ్లి తర్వాత కుటుంబం ఏర్పడుతుంది. బాధ్యతలు విస్తరిస్తాయి. అనుబంధాలు వెల్లివిరుస్తాయి.
ఆప్యాయతలు పలకరిస్తాయి. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. అదే సమయంలో సరికొత్త సవాళ్లు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆడపిల్లకు. సంసారంలో ఆమె పాత్ర అతి కీలకం. భార్యగా, కోడలిగా, వదినగా, అత్తగా ఇలా ఒక్కసారిగా అనేక పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయాల్సిన సందర్భం ఏర్పడుతుంది. ప్రతి పాత్రకూ నూటికి నూరుపాళ్లూ న్యాయం చేయాల్సిన అవసరం లేదు. కానీ, ఆ పాత్రోచితంగా వ్యవహరించినా.. సంసారం సజావుగా సాగిపోతుంది. అబ్బాయి విషయానికి వస్తే.. సంపాదనాపరుడననే గర్వం మొన్నటి తరంతో అటకెక్కింది. ఇంటి పనులు చక్కదిద్దడంలో కాస్తోకూస్తో కదలడం నిన్నటి తరంలోనే మొదలైంది. ఇప్పుడు ఇద్దరూ సంపాదనాపరులే! అన్నిటా ఇద్దరూ సరి సమానమయ్యారు!! వ్యవహారశైలిలోనూ అదే వరుస కొనసాగిస్తే.. మూడో మనిషి జోక్యం అవసరం లేకుండా.. సంసారం అన్లిమిటెడ్ 5జీ ప్యాక్‌లా సాగిపోతుంది.

సరసం సల్లాపంగా సాగినంత మాత్రాన సంసారం సారవంతమవ్వదు. ఆలుమగల మధ్య ఆకర్షణలు తీక్షణంగా ఉన్నా.. వాటికి భంగం కలిగించే పరిస్థితులు చాలానే ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు. అత్తగారింట అడుగుపెట్టిన కొత్త కోడలికి అక్కడ అర్రలు ఎన్ని ఉన్నాయో అర నిమిషంలో తెలిసిపోతుంది. కానీ, ఆ అర్రల్లో ఉండే మనుషుల్లోని అరమరికలు అర్థం చేసుకోవడం కత్తి మీద సామే! అత్తగారు ఆరోగ్యంగా ఉన్నారంటే ఒకరకమైన టెన్షన్. మామయ్య మంచం పట్టి ఉంటే మరోరకం ఆందోళన. అత్తమామలు చుట్టపుచూపుగా వచ్చి వెళ్లే రకమని తెలిస్తే.. ఇంకో తీరు ఆలోచనలు పొడచూపుతాయి. అత్తగారి పిలుపుతోనే భర్త అలర్ట్ అయితే సరేసరి! తరాలు మారినా… ఆనవాయితీగా వస్తున్న కొన్ని భావనలు ఇప్పటికీ తాజాగానే ఉన్నాయి.
అవన్నీ అత్త, కోడళ్ల మధ్య దూరం పెంచేవే అయ్యి ఉండటం బాధాకరం. అన్నాళ్లూ అల్లారుముద్దుగా పెరిగిన కొడుకు తన మాట వినకుండా పోతాడేమో అని బెంగ తల్లిది అయితే, తల్లి చాటు బిడ్డను నా కొంగున ముడివేసుకోవడం ఎంత కష్టమో అని భార్య కలత చెందుతుంటుంది. ఈ ఇద్దరి మధ్యా ఎటు మొగ్గు చూపాలో తెలియక సతమతమయ్యే పాత్ర కొడుకుది! ఏ ఒక్క పాత్రకూ సరైన న్యాయం చేయకపోయినా… ఒక్కోసారి తీవ్ర పరిస్థితులే ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఈ దుస్థితి రావొద్దంటే.. కోడలు తన పాత్రను సమర్థంగా పోషించాలి. అందరి తల్లో నాలికలా మారాల్సినంత అవసరం లేదు కానీ, నోరు జారకుండా వ్యవహారం నడపాల్సి ఉంటుంది.
అత్తయ్య తల్లితో సమానం అని భావించగలిగితే ఈశ్వరుడికి పనేం ఉండదు. ఎందుకంటే.. ఆ ఇంట్లో పోరుకు అవకాశమే ఉండదు!! కోడలి ముందుతరానికి చెందిన అత్తలకు వాళ్ల అత్తలతో కలిగిన అనుభవాలు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. అత్త ఎన్ని ఆరళ్లు పెట్టినా.. కిక్కురమనని తరం కాబట్టి, తన కోడలి దగ్గర కాస్త బెట్టు ప్రదర్శించి, పెత్తనం తనదే అనిపించుకోవాలనే తాపత్రయం కొందరిలో ఉంటుంది. ఇక కోడలి దగ్గరికి వస్తే.. తన తల్లి పట్ల నాయనమ్మ చూపించిన కాఠిన్యం చూస్తూ పెరిగి ఉంటుంది. ఆ నాయనమ్మ మీద తల్లి వెళ్లగక్కిన అక్కసు ప్రభావం కూడా ఈ కోడలిపై తక్కువేం ఉండదు. ఇక ఇరుగుపొరుగు ముచ్చట్లు అగ్నికి ఆజ్యం పోస్తూనే ఉంటాయి.
దరిమిలా.. అత్త అనగానే అర్థం కాని బ్రహ్మ పదార్థమనే భావన మైండ్‌లో ఎక్కడో బలంగా నాటుకుపోయి ఉంటుంది. పెండ్లయిన తొలినాళ్లలో పెద్దగా ఇబ్బందేం ఉండదు! అత్తాకోడళ్లలో అణిగి ఉన్న వైరి భావనలు పేట్రేగడానికి చిన్న మిస్ కమ్యూనికేషన్ చాలు. అది కనుక రాజుకుంటే.. నెలలు గడిచే కొద్దీ దావానలం ఆ ఇంటిని చుట్టుముట్టేస్తుంది. ఏండ్లు కరిగిపోయినా పూడ్చుకోలేనంత అగాథం మిగిలిపోతుంది. ఇలా జరగొద్దంటే.. అత్తాకోడళ్లు.. తల్లీకూతుళ్లుగా మసులుకోవడం ఒక్కటే పరిష్కారం. నవ వధువు గృహ ప్రవేశం చేసిన నిమిషానికే ఇంతటి సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది అనుకోవద్దు. ఇందుకోసం ఇద్దరూ మేలైన పరిణతిని ప్రదర్శించాల్సి ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు కనీసం ఆరు నెలల గడువు నిర్దేశించుకోవాలి. ఇది ఎవరికి వారు తమ మనసుల్లో అనుకోవాలి కానీ, బయట పెట్టుకోకూడదు.
అత్తయ్య ఇష్టాయిష్టాలు, కోడలి కష్టనష్టాలు గమనిస్తూ ఉండాలి. అన్నిటినీ మించి ‘ఏ మాట ఇతరులు నిన్నంటే చిన్నబుచ్చుకుంటావో.. ఆ మాట ఇతరులను పొరపాటున కూడా అనకు’ అన్న భీష్ముడి మాటను సదా మననం చేసుకోవాలి. ఈ సమయంలో అత్తగారి వ్యవహారం కీలకం. కోడలు తప్పు చేస్తే ‘ఏదో చిన్నతనం’ అనుకోవాలి. నయానే నచ్చజెప్పాలి కానీ, భయాన లొంగదీసుకునే ప్రయత్నం చేయొద్దు. ఇక కోడలి విషయానికి వస్తే.. అత్తగారిని అర్థం చేసుకోకపోయినా ఫర్వాలేదు కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ అపార్థం చేసుకోవద్దు. ఏదైనా అనుమానం వస్తే అడగాలి. సందేహం నివృత్తి చేసుకోవాలి. వారి వయసుకు, అనుభవానికి గౌరవం ఇవ్వాలి. ఆప్యాయంగా మాట్లాడాలి. అనునయించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా చిన్నాచితకా వాదోపవాదాలు జరిగితే అక్కడితో వదిలేయాలి కానీ, మరో సందర్భంలో వాటిని ఏకరువు పెట్టొద్దు. దానివల్ల.. పరిస్థితులు ఇంకా చేజారిపోయే ప్రమాదం ఉంటుంది.
సంసారం సజావుగా సాగాలంటే దాంపత్యం రసరమ్యంగా ఉండాలి. మిగతా విషయాల్లో ఎవరిది కాస్త పైచేయి అయినా ఫర్వాలేదు కానీ, శృంగార యాత్రను ఇద్దరూ సమవుజ్జీలై కొనసాగించాలి. ఆమె సిగలో పూలకు సెగలు పుట్టించే శక్తి ఉంటుంది. అతని చూపులకు ఆ సెగలను రెట్టింపు చేసే యుక్తి ఉంటుంది. ఈ ముచ్చట ఇంత రంజుగా ఉండాలంటే.. చూపులతో మాట్లాడుకోవాలి. చిరు స్పర్షతో పగలే వెన్నెళ్లు పూయించాలి. చిట్టి మేసేజ్‌తో గాఢాలింగనం ఇచ్చిన అనుభూతిని కలిగించాలి. పొట్టి ఎమోజీతో అధరామృతం గ్రోలినంత పని చేయాలి. ఈ సందేశాల పరంపరలో సందేహాలన్నీ నివృత్తి కావాలి. అప్పుడు ఏనాటిదో ఈ అనురాగం అన్న భావన కలుగుతుంది. ఏ పూటకా పూట ఉభయులకూ కావాల్సినంత కోటా దక్కుతుంది. ప్రేమ, వాంఛ, ఆరాధన, అభిమానం ద్రవ్యాలుగా శృంగార యాగం సాగాలి.

బిడియాలకు గడియ వేసేయాలి. వలపు తలపుల తలుపులు బార్లా తెరవాలి. మొహమాటాల తెర దించి మోహపు మాటల చెరలో బందీలవ్వాలి. ప్రణయ కేళీలో సందేహాలు తలెత్తితే.. చౌకబారు నీలి చిత్రాలపై ఆధారపడకూడదు. నేలబారు ఆలోచనలు అస్సలు చేయకూడదు.
నిపుణులను సంప్రదించి.. నైపుణ్యాలను పెంపు చేసుకోవాలి. ఆహార నియమాలు పాటిస్తూ.. వ్యాయామంతో ఆహార్యంలో మార్పులు చేసుకుంటూ.. ఆ కార్యంలో ఘనులు అనిపించుకోవాలి. ఇవి ఇద్దరికీ అన్వయమయ్యే సూత్రాలే! వీటిని పాటిస్తూ పోటాపోటీగా వ్యవహరిస్తే.. హనీమూన్ కోసం ప్రత్యేకంగా సుదూర తీరాలకు వెళ్లాల్సిన పని ఉండదు. అలాగని హనీమూన్‌కు వెళ్లొద్దని కాదు! పెండ్లయిన నాలుగు రోజులకే ఆదరాబాదరాగా వెళ్లడం కన్నా.. ఓ నెల నిడివిచ్చి చేసే జంటయాత్ర మరింత ప్రయోజనకరంగా, ప్రణయభరితంగా ఉంటుందని సర్వేకారుల ఉవాచ.
దాంపత్యం నాలుగు గోడల మధ్య సాగే శృంగారం మాత్రమే కాదు! నలుగురిలో ఉన్నా.. చూపులతోనూ రొమాన్స్ కొనసాగించవచ్చు. చిరు హాస్యంతో మనసు పదే పదే చూరగొనవచ్చు. అంతెందుకు, కొసరి వడ్డించే వంటలో, కొరికి ఇచ్చే పదార్థంలో, కోరి తెచ్చే వస్తువులో ఇలా ఎందెందు వెదికికా.. అందందు ప్రేమ తొణికిసలాడాలి. వంటింట్లో చేసే చిరు సాయం ఆ రాతిరిని మనోహరంగా మార్చేయగలదు. ఆఫీస్ నుంచి ఆమె అలిసి వచ్చిన వేళ.. వేళ్లు తాకేలా ఇచ్చే టీ కప్పులోనూ ప్రేమ తుఫాను పుట్టగలదు. అన్నిటికీ మించి.. జీవిత భాగస్వామిపై అచంచలమైన ప్రేమ, అవ్యాజమైన అనురాగం కలిగి ఉంటే.. ప్రతి రాత్రీ వసంత రాత్రే!! నావాడు, నాది అన్న భావన ముందు వినూత్నమైన భంగిమలు ప్రసాదించే థ్రిల్ కూడా దిగదుడుపే!!
శృంగారం పండితే జీవితం రసవంతం అవుతుంది. అదే జీవితం ఫలవంతం కావాలంటే.. ఆ లోగిలి అనుబంధాలకు వాకిలిగా మారాలి. అలా జరగాలి అంటే.. ఆలుమగలు ఇద్దరూ బాధ్యతతో మెలగాలి. ఒకరి కుటుంబాన్ని మరొకరు మనస్ఫూర్తిగా అంగీకరించాలి. తనకు ముచ్చటైన అమ్మాయిని అప్పగించిన అత్తమామలను సదా గౌరవ భావంతో చూడటం అల్లుడి విధి. తన భర్తను ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దిన అత్తమామల పట్ల ఆ అమ్మాయి కూడా అదే గౌరవంతో మెలగాలి. ఈ విషయంలో అబ్బాయిలకు అంతగా సవాళ్లు ఎదురుకాకపోవచ్చు! కానీ, అతివలు మాత్రం కాస్త కష్టపడాల్సి వస్తుంది. తను అడుగు పెట్టిన ఇంటి గౌరవం ఆమె ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది.

ఆ ఇంటికి వచ్చేవాళ్లూ, పోయేవాళ్లు, బంధుగణం, వేడుకలు, పండుగలు, ఆచారాలు అన్నిటా ఆమె కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఏర్పడుతుంది. పుట్టింట్లో ఈ పట్టింపులేం లేకపోతే.. అత్తగారింట్లో ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. అలా కావొద్దంటే.. అత్తగారు, ఆడపడుచు, తోడికోడలు సాయం తీసుకోవాల్సిందే! ఓ ఏడాది పాటు వాళ్లను ఫాలో అయితే.. తర్వాత ఎక్కడ ఏం పాటించాలో, ఎవరితో ఎలా వ్యవహరించాలో పట్టు చిక్కుతుంది. ఇవన్నీ మనకెందుకు? అని నిర్లిప్త ధోరణితో ఉండిపోతే.. ఆ పనులేం ఆగవు కానీ, అందులో వెతుక్కున్నా మీరెక్కడా కనిపించరు.
పైగా ఆ ఆనందాల్ని మీరు కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదించలేరు. కాబట్టి, కొత్తింట్లో కొత్తకొత్తగా ఉన్నప్పుడు కాకపోయినా, కొద్ది ఆలస్యంగా అయినా.. కుటుంబ బాధ్యతల్లో చురుగ్గా పాల్గొనేలా చొరవ చూపించాలి. పెద్దల సలహా మేరకు నడుచుకుంటే మేలు! ఈ ప్రయత్నంలో వెనక్కి లాగే క్యారెక్టర్లూ కొన్ని తారసపడతాయి. వారి విషయంలో నొప్పింపక తానొవ్వక అన్నట్టుగా ముందుకెళ్తే ధన్యులు అనిపించుకుంటారు! చెప్పుడు మాటలకు తలొగ్గి.. మీ అవసరం ఉన్నచోట వెనక్కి తగ్గితే ఎన్నటికీ నెగ్గరని గుర్తుంచుకోండి. ‘పెండ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయి’ అని అందరమూ నమ్మేదే! అంతటి స్వర్గంలో డిసైడ్ అయిన బంధాన్ని అవగాహనా రాహిత్యంతో నరక ప్రాయం చేసుకోవడం అవసరమా? కొత్త జంటలూ… ఆలోచించండి. కొత్త జీవితాన్ని మీరు కోరుకున్న, మిమ్మల్ని కోరుకున్న భాగస్వామితో ముచ్చటగా తీర్చిదిద్దుకోండి.
ఆల్ ద బెస్ట్!!
ఎంత ప్రేమించి పెండ్లి చేసుకున్నా, పెండ్లి తర్వాత మరెంత ప్రేమించుకొని పరవశించినా.. ఆలుమగలు అన్న తర్వాత చిన్నాచితకా గొడవలు సహజం. కలహం లేని కాపురం ఉండదు. కానీ, మాటామాటా అనుకోవడంలో పరిధులు మీరకుండా చూసుకోవాలి. ఒకరి వ్యక్తిత్వాన్ని చిన్నబుచ్చేలా అస్సలు వ్యవహరించొద్దు. నేను ఎక్కువ, తను తక్కువ అన్న భావనే ఇగోల గోలకు కారణం అవుతుంది. ఇద్దరం సమానం అనే భావన ఉండాలి. ఒకరు కోపంగా ఉన్నప్పుడు మరొకరు శాంతంగా ఉండాలి. ఒకరిది తప్పయితే మరొకరు అర్థం చేసుకొని మన్నించాలి.

ఆ తప్పు దిద్దుకునే అవకాశం అయినా ఇవ్వాలి. అంతేకానీ, పదే పదే అదే తప్పును ఎత్తి చూపుతూ.. పరిస్థితిని మరింత దిగజార్చుకోవద్దు. ఇక అలకల్లేని సంసారం అల్లికల్లేని పందిరిలా ఇంపుగా తోచదు. ఆమె అలిగినప్పుడు అతను బతిమాలాలి. చిరు కానుకలు సమర్పించో, ఉడుతా సాయం చేసో.. బుంగమూతి ముదితను ప్రసన్నం చేసుకోవాలి. బెట్టు చేసే మగవాణ్ని ఓ మెట్టు దిగైనా నెగ్గించుకోవడం అతివ ధర్మం. ఈ అలకలు కులుకులకు దారి తీయాలే కానీ, చిలువలు పలువలు కారాదు. పింగళివారన్నట్టు… కలహం అంటే ప్రణయ కలహమే అవ్వాలి. ఆ తగువులో ఎంత తెగువ చూపితే అంత బిగువు!
కొత్త జంట ప్రయాణంలో సవాళ్లకేం కొదువ ఉండదు. ముందుగా వెంబడించేది ఆర్థిక సమస్యలే! ఇద్దరూ ఎంత సంపాదించినా.. ఎంత చెట్టుకు అంత గాలి అని ఉండనే ఉందిగా! కొత్తగా పెండ్లి చేసుకొని.. ప్రతి పైసకూ లెక్కలు వేసుకుంటామంటే కుదరకపోవచ్చు. అదే సమయంలో వేలం వెర్రిగా ఖర్చు చేయనూ లేము. పెండ్లికి ముందే ఆర్థిక స్థితిగతులు పంచుకోవడం అనివార్యం. వస్తున్న ఆదాయం, చేస్తున్న ఖర్చు, పెడుతున్న పెట్టుబడి.. వీటన్నిటి గురించి ఇద్దరూ చర్చించుకోవాలి. సంపాదించేది ఇద్దరూ అయినా.. ఒక్కటిగా ఖర్చు చేయాలి.
ఒక్కటిగా కూడబెట్టుకోవాలి. నాది నాకే.. నీది నీకే.. అనే వైఖరి చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. అది మీ అనుబంధానికి విఘాతంగా మారవచ్చు. కాబట్టి, దాపరికాల్లేకుండా, పొరపొచ్చాలు రాకుండా ఫైనాన్స్ మ్యాటర్స్ డీల్ చేయడంలో ఇద్దరూ భాగమవ్వాలి. అప్పుడే అవసరం లేనిచోట ఖర్చు చేయాల్సిన అవసరం రాదు. అవసరమైన చోట రూపాయికి వెతుక్కునే పరిస్థితి రాదు. పిల్లల చదువు, వాళ్ల భవిష్యత్తు కోసం నిధి.. ఇవన్నీ కూడా ఇరువురూ కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలి.

ఆలుమగలు పోటాపోటీగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలతో పర్సనల్ లైఫ్ పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అలాగని కొలువును త్యజించే పరిస్థితిలో ఎవరూ లేరు. ఇలాంటప్పుడు ఇద్దరూ కలిసి ఉండే సమయాన్ని ఇంపుగా మార్చుకోండి. ప్రయత్న పూర్వకంగా చేసే ఈ చిట్కాలు కాలం గడిచే కొద్దీ దాంపత్యానికి కొత్తదనాన్ని అద్దుతూనే ఉంటాయి..
శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలంటే వాకింగ్, జాగింగ్ చేయాలని తెలిసిందే. దీంతోపాటు ప్రతిరోజూ ఓ అరగంట తేలికపాటి కసరత్తులు చేస్తే మరీ మంచిది. ఇంటిపనుల్లో బిజీగా ఉండే ఇల్లాలికి వర్కవుట్లు చేయడం సాధ్యం కాదని భావించొద్దు. అరగంట ముందుగా నిద్రలేస్తే సరిపోతుంది. ఇద్దరూ కలిసి డాబామీద నాలుగు అడుగులు వేసిరండి. ఇంట్లోకి వచ్చాక తేలికపాటి యోగాసనాలు కలిసి వేయండి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటలు మంత్రాల్లా కలిసిపోతాయి. కొత్త ఉత్సాహం ఊపందుకుంటుంది. నడిరాతిరి ముచ్చటకూ ఇది ఉపకరిస్తుంది.
ఉదయం ఉపాహారం, మధ్యాహ్నం భోజనం కలిసి చేసే వీలు ఉండకపోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ కలిసి తినే అవకాశం ఉన్నా.. ఆఫీసుకు వెళ్లే హడావుడిలో అంతగా ఆస్వాదించలేక పోవచ్చు. అందుకే డిన్నర్ విషయంలో ఇద్దరూ ఒక్కతాటిపైకి రావాలి. ఆమెకు నచ్చినవి అతగాడు కొసరి వడ్డించాలి. అతనికి నచ్చినవి ఆమె రుచి చూసి మరీ నోటికి అందించాలి. కలిసి తినేది పదిహేను నిమిషాలే కావొచ్చు.. కానీ, ఆ సమయంలో ఇచ్చిపుచ్చుకునే అన్నం ముద్దలు.. ఆపై ముద్దుల ముచ్చటకు తెర తీస్తాయి.
గడప దాటి… మళ్లీ ఇంటికి వచ్చే దాకా.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండొద్దు. ఎంత బిజీగా ఉన్నా.. వాట్సాప్‌లో ఓ సందేశం పంపండి. అస్సలు టైమ్ ఉండదని కుంటిసాకులు వెతకొద్దు. టీ బ్రేక్‌లో షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులు చూసే తీరిక ఉంటుంది కానీ, ఆమెకు సందేశం పంపడం కుదరదంటే అస్సలు కుదరదు. లంచ్ టైమ్‌లో ‘చట్నీ అదుర్స్’ అని మెసేజ్ చేసి చూడండి.. రిైప్లెగా రెండుకు తక్కువ కాకుండా హార్ట్ సింబల్స్ వచ్చేస్తాయ్. ‘ఈ రోజు వేసుకున్న షర్ట్ బాగుందోయ్’ అని భర్తకు సందేశం పంపి చూడండి.. గతంలో ఆ షర్ట్ వేసుకున్నప్పుడు ఇద్దరూ దిగిన సెల్ఫీ పంపకుండా ఉండలేడు! ఇలా ఒకరి ఆలోచనల్లో ఒకరు ఉన్నారన్న తలంపు సాయంత్రానికి తలపుల వాకిట వలపులు కుమ్మరిస్తుంది.
ఉద్యోగ విషయాల్లో సమవుజ్జీలుగా రాణిస్తున్నా.. ఇంటిపనుల దగ్గర మాత్రం ఆమెదే పైచేయి ఉండాలని ఆశిస్తుంటారు పురుషులు. ఈ వైఖరి అప్పటికే అలిసిపోయిన ఆమె మనసును మరింత కుంగదీస్తుంది. అలాగని పనంతా మగవాళ్లే భుజాన వేసుకోవాలని కాదు. వారు చేస్తున్న పనిని అందుకుంటే చాలు. ఏది ఎవరు చేయాలని లిస్టులు గట్రా రాసుకోకుండా.. ఎవరికి తోచింది వారు చేయడమే పనిగా పెట్టుకోవాలి. ఇద్దరూ కలిసి పనిచేస్తే.. భారం తగ్గుతుంది, బంధం పెరుగుతుంది.