‘న్యూ ఇయర్ అయితే ఏంటి? ఏం మారిందనీ?’.. అనేవాళ్లు కూడా ఒకటి మాత్రం మార్చుకోవాల్సిందే. అదే.. క్యాలెండర్. కొత్త సంవత్సరంతో పాటు కొత్తగా మనింట్లో అడుగు పెట్టే కాలపత్రం ఇప్పుడు కొంగొత్తగా రూపుదిద్దుకుంటున్నది. అలంకరణ వస్తువులానూ మారిపోయింది.
త్రీ డైమన్షన్.. వండర్ గోడకు వేలాడదీసే వాటికన్నా డెస్క్ క్యాలెండర్లకే మార్కెట్లో గిరాకీ ఎక్కువ. చూడగానే ‘ఇది క్యాలెండరా?’ అనిపించేట్టు అలంకరణ వస్తువుల్లా రూపొందుతున్నాయి. డూ ఇట్ యువర్సెల్ఫ్ (డీఐవై) పేపర్ క్రాఫ్ట్స్గానూ త్రీడీ క్యాలెండర్లు వస్తున్నాయి. పియానో, కుట్టుమిషిన్, శాండ్విచ్ మేకర్, ఆటో.. ఇలా రకరకాల బొమ్మల రూపంలో బల్ల మీద పెట్టుకునేందుకు వీలుగా వీటిని మనమే తయారు చేసుకోవచ్చు. ఈ తరహా క్యాలెండర్ కిట్లో బొమ్మలను చేసే అట్టలు, వాటిని ఎలా చేయాలో నేర్పించే ఇన్స్ట్రక్షన్ కాగితం, నెలలు మార్చుకునేందుకు వీలుగా క్యాలెండర్ కార్డ్స్ ఉంటాయి. ఆ సూచనలను అనుసరిస్తే చాలు.. త్రీడీ క్యాలెండర్ సిద్ధం అవుతుంది.
పర్యావరణ పరిరక్షణకు కంకణం కట్టుకున్న సంస్థ.. డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ఇండియా. ఈ వేదిక కూడా విభిన్నమైన థీమ్స్తో క్యాలెండర్లను రూపొందించి.. ప్రకృతి మీద తనదైన ప్రేమను చాటింది. వాల్ క్యాలెండర్లతో పాటు డెస్క్ క్యాలెండర్లూ ఇందులో ఉన్నాయి. పక్షులు, సీతాకోక చిలుకలతో పాటు నిండైన సహజ వర్ణాల మేళవింపుగా కనిపించే చిత్రాలతో ‘బ్రైట్ అండ్ బ్యూటిఫుల్’ పేరున ప్రత్యేక క్యాలెండర్నూ తీసుకొచ్చింది. ప్రకృతి ప్రేమికులను ఇవి అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
వాళ్లకు చేతుల్లేవు. అయితేనేం కాళ్లు, నోటితోనే అచ్చెరువొందించే చిత్రాలు గీస్తారు. ఇలాంటి కళాకారులతో ఏర్పడినదే.. ఎంఎఫ్పీఏ సంస్థ. ఆ వేదిక ప్రతినిధులు గీసిన అందమైన చిత్రాలతో రూపుదిద్దుకొన్నది ఎంఎఫ్పీఏ క్యాలెండర్. వ్యక్తుల మధ్య అనుబంధాలను సూచించేలా డెస్క్టాప్ క్యాలెండర్ ఉంటే, వివిధ సంప్రదాయ నృత్య భంగిమలకు అద్దం పడుతూ వాల్ క్యాలెండర్ ముస్తాబైంది. బొమ్మల తీరు, రంగుల మేళవింపు అద్భుతం. వీటిని చూసిన ఎవరైనా.. చేతులు లేని చిత్రకారులు గీశారంటే ఓ పట్టాన నమ్మలేరు.