జన వ్యవహారంలో గుంటగలగరాకు అని పిలిచే మొక్కని ఆయుర్వేదంలో ‘భృంగరాజ్’ అని పిలుస్తారు. ఇది చిన్న పొదలాగా, నేలపై పరచినట్టుగా పెరిగే మొక్క. దీని పూలు తెలుపు, పసుపు రంగులో ఉంటాయి. ఈ పూలు గడ్డిపూల కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. తేమగా ఉన్నచోట ఈ మొక్క వేగంగా పెరుగుతుంది.
భృంగరాజ్ మొక్క ఆయుర్వేదంలో ‘కేశరాజుగా’ ప్రసిద్ధిగాంచింది. జుట్టు సమస్యల పరిష్కారానికి ఈ మొక్క ఎక్కువగా ఉపయోగపడుతుంది. భృంగరాజ్ హెపటోప్రొటెక్టివ్, యాంటీ ఏజింగ్, కేశవృద్ధి గుణాలు కలిగి ఉంటుంది. జుట్టును నల్లగా ఉంచుతుంది. వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. తలనొప్పి, మైగ్రేన్, నిద్రలేమి సమస్యలను నివారిస్తుంది. భృంగరాజ్ మొక్కలతో తయారు చేసిన భృంగరాజ్ ఆయిల్, హెర్బల్ షాంపులు, క్రీములు, తలనూనెలు మార్కెట్లో ఉన్నాయి. వీటికి డిమాండ్ కూడా బాగానే ఉంది.
ఆకును చేత్తో నలిపితే పసరు తాకి చేయి నల్లగా మారిపోతుంది. మా పెద్దవాళ్లు ఈ గుంటగలగరాకుతో ఇంట్లోనే తలనూనెను తయారు చేసుకునేవారు. ఈ నూనె బట్టతల సమస్యను నివారిస్తుందనేవారు. గుంటగలగర విత్తనాలు నల్ల నువ్వుల కన్నా సన్నగా ఉంటాయి. ఎండిన విత్తనాలు నేలపై రాలి, వర్షాకాలం రాగానే వాటంతట అవే మొలకెత్తుతాయి. ఇవి మైదానాల్లో విరివిగా పెరుగుతాయి.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు