1969లో ‘నాగావళి ఫిలింస్’ సంస్థను కె.ఎ.ప్రభాకర్, కె.బాబురావు సోదరులు స్థాపించారు. తరువాత ఇదే సంస్థ ‘రామ విజేత ఫిలింస్’, అటు తరువాత ‘విజేత ఫిలింస్’గా స్థిరపడింది. ఈ సంస్థ నిర్మించిన తొలి చిత్రం ‘జరిగిన కథ’. జె.బాబురావు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో ఈ చిత్రం వచ్చింది. దీనికి కె. ప్రభాకర్ నిర్మాత. ఈ చిత్రం కోసం కవి సినారె నాలుగు గీతాలు రాశారు. సినారెతోపాటు డా॥ దాశరథి వంటి మరికొందరు కూడా ఈ చిత్రానికి గీతాలు రాశారు. అన్నీ ప్రసిద్ధి పొందినవే అయినా ఇందులో నారాయణ రెడ్డి రాసిన ‘భలే మంచిరోజు, పసందైన రోజు’ గీతం పొందిన ఖ్యాతి వేరు.
అప్పుడే కాదు ఇప్పటికీ అనేక వేడుకలకు, వేదికలకు వెలుగై నిలుస్తున్న సినారె గీతానికి ఘంటసాల స్వరం, సంగీత దర్శకత్వం తోడుకావడం విశేషమైతే, దీనిని హిందుస్థానీ గీతాల పద్ధతిలో స్వర పరచడం మరో ముచ్చట. ఈ చిత్రంలోని నాయకులిద్దరూ అన్నదమ్ములు, ఆగర్భ శ్రీమంతులు. ఒకరు ప్రసాద్ (కొంగర జగ్గయ్య), మరొకరు రఘు (కృష్ణ). ఇక ఈ గీత సందర్భాన్ని గురించి సినారె మాటల్లో విందాం “చాలా కాలంగా పెళ్లి చేసుకోవడానికి తాత్సారం చేస్తున్న ఆ కథానాయకుడు తల్లి ఒత్తిడిని కాదనలేక ఓ తరుణిని పెళ్లాడటానికి ఒప్పుకొంటాడు. ఆమె ఎవరో కాదు ఈ కథానాయకుడి తమ్ముడు ప్రేమించిన నాయికే. ఆ తమ్ముడు కృష్ణ, ఆ నాయిక కాంచన.
జగ్గయ్య ప్రమోద పారవశ్యంలో పియానో వాయిస్తూ పాడే పాట అది. ఆ సన్నివేశాన్ని ఉల్లేఖిస్తూ ఉండగానే నా త్వరితమతి పల్లవిని అల్లుకోసాగింది. ఆపుకోలేక వినిపించబోతుంటే ఘంటసాలగారు అందుకున్నారు…” అంటూ ఈ పాట ట్యూన్ పుట్టుక గురించి చెబుతారు సినారె. ఘంటసాల స్వరపరిచిన ఆ ట్యూన్ ‘తన నాన నానతనా నాన నాన / తనా నాన తానాతాన నాన’. సినారె స్వరపరిచిన పాట ఘంటసాలకు ఎంతగా నచ్చిందంటే… ఘంటసాల తన సంగీత ప్రదర్శనల్లో ఎక్కువగా ఈ గీతాన్నే పాడేవారు కూడా! మొదట ఈ గీతాన్ని చూద్దాం!
పల్లవి: భలే మంచిరోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు ॥భలే॥
గుండెలోని కోరికలన్నీ
గువ్వలుగా ఎగిసిన రోజు
గువ్వలైన ఆ కోరికలే
గూటిలోన చేరిన రోజు
నింగిలోని అందాలన్నీ
ముంగిటిలోనే నిలిచే రోజు
అన్నగా, ఆదర్శంగా నిలిచే నాయకుడు ఈ చిత్రంలోని కథానాయకుడు. అందుకే తన భావాలను, కోరికలను, ఆశలు ఆశయాలను ఎక్కడా వ్యక్తపరచలేదు. కానీ, తన మనసుకు నచ్చిన నాయిక తనకు లభించడంతో తన గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసి లేచాయి. అవి ఎంతగా అంటే ఏకంగా అద్దంలో అందివచ్చే చందమామ ఏకంగా అందుకునేంత ఆనందం పొంగిపొర్లిన రోజట. బృందావనం నవ్విన రోజట. గుండెలోని అనేకానేక కోరికలన్నీ గువ్వలవోలె ఎగిరిన రోజట. ఇవన్నే కదా సినారెను అప్పుడూ, ఇప్పుడు… ఎప్పుడూ ఒకేఒక్కడుగా నిలిపింది. మరో చరణం చూడండి..
చందమామ అందిన రోజు
బృందావని నవ్విన రోజు
తొలివలపులు చిలికిన రోజు
కులదైవం పలికిన రోజు
కన్నతల్లి ఆశలన్నీ
సన్నజాజులై విరిసిన రోజు
మొదటి చరణంలోని అభిప్రాయమే ఇతరచోట్ల కనిపిస్తుంది. కవి సినారె ఇక్కడ పోలిక కోసం తీసుకున్న వస్తువులు, విషయాలు రోజూ చూస్తున్నవి, తెలిసినవే కావచ్చు. కానీ, ఈ సందర్భంలో అవి గీతానికి కలికి తురాయిలాగా వెలుగుతున్నాయి. మిగతా పాటలు చూడండి పైన కవి చెప్పినవన్నీ ఎంతగా.. అందంగా కనిపిస్తున్నాయట! ఆకాశంలోని అందాలు అంటే తారకలు అన్నీ ఏకంగా తన ముంగిటిలో నిలిచినట్టు ఉందట. ఎంత అందంగా రాశాడో చూడండి. తన ప్రేయసి తనెదుట, తనకు నచ్చి, మెచ్చి నిలబడితే ఎలా ఉంటుందో ఇందులో చూపిస్తారు కవి. ‘తెలుగు కవిత లయాత్మకత’ను విప్పి చెప్పిన సినారె ఈ గీతంలో అంత్యప్రాసగా ‘రోజు’ అన్న పదాల పునరుక్తి ఈ గీతానికి చక్కని తూగును… అందాన్ని ఇచ్చింది. ఆ అందమే కదా ఆరుపదులు దాటినా ఇప్పటికీ భలే కొత్తగా… భలే మంచిగా… భలే పసందుగా ఉంది.
– పత్తిపాక మోహన్