e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home బతుకమ్మ నా వైఫల్యాలను.. సగర్వంగా చెబుతా!

నా వైఫల్యాలను.. సగర్వంగా చెబుతా!

నా వైఫల్యాలను.. సగర్వంగా చెబుతా!

తీరం చేరిన అలల సౌందర్యం వెనుక కడలి సంఘర్షణను తరచి చూసే హృదయం ఉండాలి. గమ్యాన్ని ముద్దాడిన గర్వం వెనుక పాదముద్రల ప్రయాస తెలుసుకోవాలి. శిఖరారోహణ చేసినా పుడమి ఆలంబన మరవొద్దు. విజయాలతోపాటు అపజయాల ఎరుకా ఉండటమే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. దర్శకుడు శ్రీరామ్‌ వేణు జీవితాన్ని పరికిస్తే ఈ మాటలన్నీ అక్షర సత్యమనిపిస్తాయి. సినీరంగంలో పదేండ్ల సుదీర్ఘ ప్రయాణం ఆయనది. సక్సెస్‌కంటే, ఫెయిల్యూర్స్‌ గురించి మాట్లాడటమే తనకు ఇష్టమని చెబుతారాయన. ఇటీవల విడుదలైన ‘వకీల్‌ సాబ్‌’తో కెరీర్‌లోనే చిరస్మరణీయమైన విజయాన్ని అందుకున్న శ్రీరామ్‌ వేణు ‘బతుకమ్మ’ ముందు తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.

జగిత్యాల జిల్లాలోని మూడుబొమ్మల మేడిపల్లి నా స్వస్థలం. నాన్న టైలరింగ్‌ చేసేవారు. దర్శకుడిగా నా తొలిచిత్రం ‘ఓ మై ఫ్రెండ్‌’ విడుదలైన సమయంలో ఆయన మరణించారు. ఐదో తరగతి వరకూ మా ఊరి బడికే వెళ్లాను. నిజామాబాద్‌ కిసాన్‌నగర్‌లోని సెయింట్‌ ఈ.ఏ.యస్‌ హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదివా. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఇంటర్‌, డిగ్రీ చేశాను.

‘వకీల్‌ సాబ్‌’ విజయం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తున్నది. నేను ఎంతగానో అభిమానించే హీరో చిత్రానికి దర్శకత్వం వహించే అదృష్టం దక్కింది. అంతకంటే ఏం కావాలి? దీంతో, సినిమా ఖరారైన తొలిరోజు నుంచే నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. విడుదలైన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా సినిమాకు లభిస్త్తున్న ఆదరణ నా సంతోషాన్ని మరింత పెంచుతున్నది. ముఖ్యంగా మహిళాలోకం సినిమాకు పట్టం కట్టడం గొప్ప విషయం. పవన్‌కల్యాణ్‌ వంటి పెద్దస్టార్‌ను డైరెక్ట్‌ చేసినా, స్క్రిప్ట్‌ రూపకల్పన దగ్గరినుంచి షూటింగ్‌ పూర్తయ్యేవరకు ఎటువంటి ఒత్తిడికీ లోనుకాలేదు. నేను ఆరాధించే హీరోతో సినిమా చేస్తున్నాననే ఉత్సాహమే, నన్ను వేలుపట్టుకొని ముందుకు నడిపించింది.

అందరూ రిజెక్ట్‌ చేశారు
దర్శకుడిగా పదేండ్ల ప్రయాణంలో మూడు సినిమాలు మాత్రమే చేసినా ఎప్పుడూ అసంతృప్తిగా ఫీలవలేదు. రాశికంటే వాసి బాగుండాలని తపించే తత్త్వం నాది. పరిశ్రమలో నా ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. కెరీర్‌ పరంగా అనేక సంఘర్షణలు, అవరోధాల్ని ఎదుర్కొన్నా. దర్శకుడిగా తొలి రెండు చిత్రాలు ‘ఓ మై ఫ్రెండ్‌’, ‘ఎంసీఏ’ మధ్య ఏడేండ్ల విరామమొచ్చింది. ఆ సమయంలో ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోకు కథలు చెప్పాను. అందరివద్దా తిరస్కారాల్ని చవిచూశాను. అగ్రహీరోలు మొదలుకొని అప్పటి వర్దమాన హీరోలందరూ నన్ను రిజెక్ట్‌ చేశారు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే.. అప్పుడే వెలుగులోకి వస్తున్న కొందరు యువహీరోలు కూడా నా కథలు వినడానికి ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు.

ఫెయిల్యూర్స్‌ గురించే..
దిల్‌రాజుగారి కాంపౌండ్‌లో ఉంటే అన్ని పనులూ సులభంగా జరిగిపోతాయనే భావన ఉంది. అది నిజం కాదు. ఆయన దగ్గర పనిచేస్తూనే నేను ఏడేండ్లు సినిమా ఛాన్స్‌ లేకుండా ఉన్నా. దిల్‌రాజుగారు వెన్నెముకలా ఉంటూ తమ సంస్థలోని వ్యక్తులకు తోడ్పాటునందిస్తారు. హీరోలకు కథలు చెప్పి వాళ్లను కన్విన్స్‌ చేయడం, స్క్రిప్ట్‌ మేకింగ్‌లో వారితో కలిసి ప్రయాణం చేయాల్సిన బాధ్యతలన్నీ మనపైనే ఉంటాయి. దిల్‌రాజుగారు నిర్మించాలనుకున్న ‘బెంగళూర్‌ డేస్‌’ సినిమాపైన ఏడాదిన్నరపాటు పనిచేశా. అనివార్య కారణాలవల్ల ఆ ప్రాజెక్ట్‌ను పక్కన బెట్టారు. అయినా, నిరుత్సాహ పడలేదు. ఏ సంస్థలో పనిచేసినా అంతిమంగా మన ప్రతిభ, కృషినిబట్టే విజయాలు వరిస్తాయి. నేను ఖాళీగా ఉన్న ఏడేండ్ల కాలంలో సినిమాల స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తూ, కథా
చర్చల్లో సహకారం అందిస్తూ.. అలా వచ్చిన డబ్బుతో జీవితాన్ని గడిపాను. నాతో పని చేయించుకొని సినిమాల్లో టైటిల్‌ క్రెడిట్‌ ఇవ్వకపోయినా ఎవరికీ చెప్పుకోలేదు. కానీ, నా ఫెయిల్యూర్స్‌ గురించి చెప్పుకోవడానికి మాత్రం ఎప్పుడూ సంకోచించను. ఓ వ్యక్తి విజయాలతోపాటు వైఫల్యాల్ని కూడా తెలుసుకుంటేనే అతని పరిపూర్ణమైన ప్రయాణాన్ని అర్థం చేసుకోగలం. నా ఏడేండ్ల స్ట్రగుల్స్‌ చూసిన దర్శకుడు సుకుమార్‌గారు ‘నీ ప్లేస్‌లో నేను ఉంటే ఆత్మహత్య చేసుకొని ఉండేవాడిని కావొచ్చురా..’ అన్నారు.

ఆశావహ దృక్పథమే నడిపించింది
ఇండస్ట్రీలో ఎవరికెవరూ సహాయం చేయరు. సొంతంగా ఎదగాలి. సినిమా అవకాశాల పరంగా ఎన్నో తిరస్కారాల్ని ఎదుర్కొన్నా నాలోని ధైర్యం, సినిమా మీదున్న మమకారం, కుటుంబం పట్ల ప్రేమ ఇండస్ట్రీలో నన్ను నిలబడేలా చేశాయి. నా భార్యతోపాటు కుటుంబ సభ్యులందరూ ప్రతి క్షణం బాసటగా ఉన్నారు. జీవితం, సంపాదన గురించి నా భార్య ఏ రోజూ నన్ను ప్రశ్నించలేదు. ఏం జరిగినా, జరగకపోయినా జీవితం పట్ల ఆశావహ దృక్పథం ఉండేలా తను నాలో స్ఫూర్తినింపింది. అలాంటి గొప్ప సహచరి దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా. అలాగే, జీవితంలో ఓడి గెలిచిన ఎంతోమంది వ్యక్తుల గాథలు నిరంతరం నన్ను సానుకూల భావనతో ఉండేలా ప్రేరణనిచ్చాయి. బాధ్యతలు, బరువులు ఏ మాత్రం లేకుంటే జీవితాంతం రోజుకో సినిమా చూస్తూ బతికేస్తాను. నాకు సినిమా తప్ప మరో వ్యాపకం లేదు. అంతలా సినిమాను ప్రేమిస్తా.

పవన్‌కల్యాణ్‌ ఇన్‌వాల్వ్‌ కాలేదు
‘పెద్ద హీరోలతో సినిమాలు చేస్తే సృజనాత్మకమైన స్వేచ్ఛ ఉండదు. స్క్రిప్ట్‌ మొదలుకొని అన్ని విషయాల్లో వాళ్ల జోక్యం ఉంటుంది’ అనే ఓ అపోహ సామాన్య ప్రేక్షకుల్లో ఉంది. అందులో ఏ మాత్రం వాస్తవం లేదు. పెద్ద హీరోలకు ఓ స్టార్‌డమ్‌, అభిమానగణం ఉంటుంది. అభిమానులు కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఉండాలని కోరుకుంటారు. ఈ సమీకరణాలన్నిటినీ బేరీజు వేసుకొని పెద్ద హీరోలు దర్శకుడికి సలహాలు ఇస్తారు. వాటిని దర్శకులు ఓ బాధ్యతగా స్వీకరిస్తారు. ఇద్దరూ సమన్వయంతో సినిమా బాగా రావడానికి శ్రమిస్తారు. ‘వకీల్‌ సాబ్‌’ విషయంలో పవన్‌కల్యాణ్‌గారు నాకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు.

యథాతథంగా స్వీకరించాలి
సినిమా కథారచనలో నేను అనేక అంశాల్ని స్ఫూర్తిగా తీసుకుంటాను. నేను చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు, నిజ జీవితంలోని సంఘటనలు, వ్యక్తిగతంగా ఎదుర్కొన్న స్ట్రగుల్స్‌.. ఈ అంశాలన్నీ కథారచనలో నాకు ఉపయోగపడతాయి. స్వతహాగా నాలో ఆధ్యాత్మికత, తాత్త్విక భావాలు ఎక్కువ. కర్మ సిద్ధాంతాన్ని, విధిని, మంచితనాన్ని నమ్ముతాను. ఏ పరిస్థితుల్లోనైనా నిజాయతీగా ఉండటానికే ఇష్టపడతాను. లూయిస్‌ ఫిచర్‌ రాసిన ‘ది లైఫ్‌ ఆఫ్‌ మహాత్మాగాంధీ’ నాకు ఎంతో ఇష్టమైన పుస్తకం. అలాగే, చార్లీచాప్లిన్‌ జీవితం నాకు ఎంతో స్ఫూర్తివంతంగా అనిపిస్తుంది. వ్యక్తిగతంగా జీవితమంతా కష్టాలతో సాగినా తెరపై మాత్రం ఆయన నవ్వుల్ని పంచారు. జీవితం ప్రసాదించిన దేనినైనా యథాలాపంగా స్వీకరించి ముందుకు సాగిపోవాలనే సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతాను. నాకు స్వతహాగా కమర్షియల్‌ సినిమాలంటేనే ఇష్టం. ప్రయోగాలు, ఇన్నొవేటివ్‌ కాన్సెప్ట్స్‌ డీల్‌ చేసేంత ఇంటెలిజెన్స్‌ నా దగ్గర లేదనుకుంటాను. కథ ఏదైనా వాణిజ్య హంగుల్ని మేళవించి జనరంజకంగా చెప్పాలని కోరుకుంటాను. దిల్‌రాజుగారి సంస్థలో నా తదుపరి సినిమా ‘ఐకాన్‌’ చేయబోతున్నా. ఓ వినూత్నమైన పాయింట్‌తో వాణిజ్య అంశాల కలబోతగా ఆ సినిమా ఉంటుంది.

ఎలాంటి బహుమతీ అందుకోలేదు

కెరీర్‌లో మూడుసినిమాలు డైరెక్ట్‌ చేశాను. అయినా నేనిప్పటి వరకు భారీ పారితోషికాల్ని
స్వీకరించలేదు.నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘ఏంసీఏ’ ఒకటి. ఆ సినిమాకు నేను నెల జీతం లెక్కన పారితోషికం తీసుకున్నా. ‘వకీల్‌ సాబ్‌’ సినిమాకు కూడా తక్కువ రెమ్యునరేషన్‌ అందుకున్నా. ‘సినిమా అంత పెద్ద సక్సెస్‌ సాధించింది.. దర్శకుడిగా కృతజ్ఞతా పూర్వకంగా మీకేమైనా బహుమతులొచ్చాయా?’ అని కొందరు అడిగారు. వాస్తవం చెప్పాలంటే నాకెవరూ ఎలాంటి బహుమతీ ఇవ్వలేదు. నిర్మాత దిల్‌రాజుగారి దగ్గరి నుంచి కూడా ఎలాంటి బహుమతి అందుకోలేదు(నవ్వుతూ). పవన్‌కల్యాణ్‌గారితో సినిమా చేయడం, ప్రేక్షకులు
అందించిన అపూర్వ విజయమే ఆ సినిమాకు లభించిన పెద్ద బహుమతులుగా భావిస్తున్నా.

-కళాధర్‌ రావు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నా వైఫల్యాలను.. సగర్వంగా చెబుతా!

ట్రెండింగ్‌

Advertisement