ఇండ్లు, పొలాలు, బంగారం తాకట్టుపెట్టినా అప్పు పుట్టని రోజులివి. అలాంటిది, ఆ ఊరిలో మాత్రం ఎవరైనా ‘విదేశాలకు వెళ్తాం’ అంటే చాలు.. ఎలాంటి పూచీకత్తు లేకుండానే లక్షలకు లక్షలు ఒడిలో పోస్తారు. నయా పైసా వడ్డీ తీసుకోరు. ఎప్పటిలోపు తిరిగి చెల్లిస్తావనీ అడగరు. గుజరాత్లోని డింగుచా ప్రజల ఫారిన్ మోజు అంతాయింతా కాదు..
గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ జిల్లాలోని కలోల్ తాలూకా. ఆ పరిధిలో డింగుచా అనే గ్రామం ఉంది. అంకిత్ పటేల్ (21) ఆ పల్లె యువకుడే. తనకు అమెరికాలో చదువుకోవాలని కోరిక. బ్యాంకులో రుణం తీసుకుందామంటే, కుదువ పెట్టడానికి సరైన పత్రాలు లేవు. దీంతో ఓ ట్రస్టును సంప్రదించాడు. తన కల గురించి చెప్పాడు. అంతే వారం రోజుల్లో డబ్బులు అందాయి. అంకిత్ సూట్కేస్ పట్టుకుని పెన్సిల్వేనియా వెళ్లాడు. బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సాధించాడు. రెండేండ్ల తర్వాత సొంతూరికి వచ్చి, తనకు డబ్బులిచ్చిన ట్రస్టుకు.. ప్రేమకొద్దీ రెండింతలు ముట్టజెప్పాడు. ఒక్క అంకిత్ పటేల్ అనే కాదు.. ఆ గ్రామంలో విదేశాలకు వెళ్లాలన్న ఆలోచన ఎవరికి వచ్చినా సరే, అడిగినంత డబ్బు ఇస్తారు. వడ్డీగా పైసా కూడా చెల్లించాల్సిన పన్లేదు. ఉద్యోగం, చదువు, వ్యాపారం.. ప్రయాణ కారణం ఏదైనా కావచ్చు.
డింగుచా గ్రామంలో ఏ ఇంటి తలుపు తట్టినా ప్రవాస కథలే వినిపిస్తాయి. అక్కడ పాటీదార్ సామాజిక వర్గం ఎక్కువ. ఎనిమిది దశాబ్దాల క్రితమే ఈ ఊరి నుంచి కొందరు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లారు. అక్కడ స్థిరపడ్డారు. సొంతూరి మీద ప్రేమతో స్థానికులనూ తీసుకెళ్తున్నారు. ఆర్థికంగా వెసులుబాటు లేని కుటుంబాల కోసం కొన్ని ట్రస్టులు వెలిశాయి. చిన్న లేఖ రాస్తే చాలు.. డబ్బు సర్దుబాటు చేస్తారు. ఇలాంటి ట్రస్టులు పదుల సంఖ్యలో ఉన్నాయిక్కడ. అయితే, ఒక షరతు. ఎన్నేండ్లు అయినా సరే అసలు మాత్రం చెల్లించాలి. వడ్డీకి బదులు ప్రేమపూర్వకంగా ఎంతోకొంత ఇవ్వొచ్చు. ఏడాదికి యాభై మంది వరకూ విదేశాలకు వెళ్తుంటారు. ఒక వ్యక్తి వివిధ మార్గాల ద్వారా విదేశానికి వెళ్లి వ్యాపారమో, ఉద్యోగమో చేసుకోవాలంటే రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. పాటీదార్ వర్గానికి చెందిన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో లక్షన్నరకు పైగా ఉన్నారు. వాళ్లు కూడా సంఘాలు ఏర్పాటు చేసుకొని తమ ఊరినుంచి కొత్తగా వచ్చేవారికి వసతి, ఉపాధి ఏర్పాట్లు చూస్తారు.
డింగుచాతో పాటు చుట్టుపక్కల అబ్బాయిలకు పెండ్లి కావాలంటే, కచ్చితంగా విదేశాల్లో స్థిరపడాల్సిందే. కనీసం అబ్బాయి కుటుంబంలో ఎవరో ఒకరైనా విదేశాల్లో ఉండాలి. అప్పుడే భారీ కట్న కానుకలతో పెండ్లి చేస్తారు. నిజానికి అబ్బాయిలు విదేశాలకు వెళ్తున్న కారణాల్లో పెండ్లి కూడా ఒకటి. పెండ్లి చేసుకొని త్వరగా స్థిరపడాలనే కోరికతోనే విమానం ఎక్కుతున్నారు. ఆ ఆరాటంలో కొన్ని విషాద సంఘటనలూ జరుగుతుంటాయి. దొడ్డిదారి ప్రయత్నాలూ సాగుతుంటాయి. కెనడా సరిహద్దును దాటి అమెరికా చేరుకోవడంలో విఫలమై ఓ కుటుంబం.. మంచులో కూరుకుపోయి ప్రాణాలు పోగొట్టుకుంది.