శా॥ కాంతారక్షితి మంజులాంగల సదుత్కర్షం బునన్, భూమి భృ
త్కాంతుండంతమహా విహారమలరం గన్యాగమాకాంక్షన
త్యంతంబాపగ దోచె నమ్మహిళ సద్గర్భంబునన్ భృంగ సం
క్రాంతాభోజమనంగ మంద సముదగ్రచ్ఛాయ లింపారగన్
ఈ పద్యం సర్వతంత్ర స్వతంత్ర, శ్లేష యమక చక్రవర్తి బిరుదాంకిత, గద్వాల సంస్థాన ఆస్థాన కవి శ్రీమాన్ తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు రచించిన అచలాత్మజా పరిణయం అనే ద్వ్యర్థి కావ్యం లోనిది. అచలాత్మజ అంటే భూమి పుత్రిక సీతమ్మ, పర్వత పుత్రిక పార్వతి. ఈ ఇరువురి పరిణయ గాథ ద్వ్యర్థి కావ్యంగా ఆవిష్కరించిన కావ్యరాజం ఇది. ప్రబంధ క్షీణ యుగంలో వెలువడిన ఈ కావ్యం వర్ణనలలో, అద్భుత పద శబ్ద ప్రయోగాలలో అలరారుతున్నది. అద్వితీయ శ్లేషాలంకార విచిత్ర ప్రతి పద్య రసస్ఫోటనంతో విశేషంగా విరాజిల్లుతున్నది.
పార్వతి పరంగా, సీత పరంగా ఈ పద్యం రెండు రకాల భావార్థాలను ఎలా వర్ణిస్తుందో చూద్దాం. ఈ పద్యం ఇరువురి జననానికి సంబంధించినది.
కాంతార క్షితి= అరణ్యభూమి యందు; మంజులాంగ+లసత్+ఉత్కర్షము= అతిశయించిన మృదువైన శరీర అవయవాల యొక్క; భూమి భృత్కాంతుడు= పర్వతరాజు(హిమవంతుడు)
మహా విహారములో; కన్యాగమాకాంక్ష నత్యంతం బాపగ= స్త్రీ సంభోగ కాంక్షను ఆపుజేయగా; అమ్మహిళ= ఆ మహిళ (హిమవంతుని భార్య మేనక); సద్గర్భంబునన్= ఆమె గర్భము; భృంగ సంక్రాంతాభోజము= తుమ్మెదలు చేరిన పద్మము; మంద సముదగ్రచ్ఛాయలు= మెల్లగా ఉన్నతములైతున్న ఛాయలు కనబడుతున్నాయి. పార్వతి కడుపులో ఉండగా (గర్భవతి యైన) మేనక పరిస్థితి ఇది.
మంజు+లాంగల+ సదుత్కర్షము… లాంగలము అంటే నాగలి, ఉత్=ఉన్నతమగు, కర్షము=దున్నడం; భూ భృత్కాంతుడు= రాజు (జనకుడు); మహా విహారమలరంగన్= గొప్ప యజ్ఞ ప్రయత్నమొప్పగా; కన్య ఆగమ కాంక్ష= బిడ్డ కావాలనే కోరిక ఉన్న అతనికి; అమ్మహిళ సద్గర్భంబునన్ అనే సమాసం ఎంత చిత్రం గా మారిందో చూడండి; అమ్మహి+లసద్గర్భంబునన్ = భూమి గర్భంలో; భృంగ సంక్రాంతాభోజమనంగ= తుమ్మెదలు చేరిన పద్మము లాగ; మందసముదగ్రచ్ఛాయ లింపారగన్… మందసము=పెట్టె; ఉదగ్రచ్ఛాయ లింపారగన్= ఉన్నతమైన కాంతులతో ప్రకాశించింది. చూశారా పదాలు విరుస్తూ శ్లేషార్థాలతో ఒకే పద్యానికి రెండు భావాలు వచ్చేలా ఎంత గొప్పగా రాశారో కవి. ఇది తెలుగు భాషలో మాత్రమే సాధ్యం. తెలుగు కవులకు మాత్రమే సుసాధ్యం. జయహో తెలుగు!
-చేపూరి శ్రీరాం, హన్మకొండ