హైటెక్ సిటీలోని ‘ది వెస్టిన్ హైదరాబాద్’ హోటల్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇరవై నాలుగు గంటలూ విందులు అందించే రెస్టారెంట్, అంతర్జాతీయ స్థాయి కాక్టెయిల్ సెక్షన్, సకల సౌకర్యాలకు నెలవైన నూట అరవై ఎనిమిది గదులు.. ఇవేవీ కాదు. ఈ హోటల్‌ను పూర్తిగా మహిళా ఉద్యోగులే నిర్వహిస్తారు. అవును. రిసెప్షన్ నుంచి కిచెన్ వరకూ ప్రతి విభాగానికీ స్త్రీలే నాయకత్వం వహిస్తున్నారు.
రిసెప్షన్లో అవే చిరునవ్వులు.రెస్టారెంట్లోనూ అవే పలకరింపులు. ఆ ఆత్మీయతల మధ్య ఏ చుట్టాలింటికో వెళ్లిన అనుభూతి కలుగుతుందే తప్పించి.. హోటల్లో ఉన్నామనిపించదు. ఆతిథ్య రంగంలో ఇదో ప్రయోగమని చెబుతారు మార్కెట్ నిపుణులు. స్త్రీని ప్రకృతితో పోలుస్తారు. ఆమె కృత్రిమత్వాన్ని ఇష్టపడదు. నేలకు, గాలికి హానికలిగితే సహించదు. అందుకేనేమో, వెస్టిన్‌లో సంప్రదాయేతర ఇంధన వనరులనే ఉపయోగిస్తారు.
హైదరాబాద్ నగరంలో మొట్ట మొదటి ‘ఆల్ ఉమెన్- మేనేజ్డ్’ హోటల్ తమదేనని చెబుతున్నారు నిర్వాహకులు. ‘ఆతిథ్య రంగంలో మహిళా సాధికారత వైపుగా ఇది తొలి అడుగు’ అని ఘనంగా ప్రకటించారు సంస్థ వైస్ ప్రెసిడెంట్ రజ్ను అలెక్స్.