Startup Story | నాన్ స్టాప్ ఉపాధి.. నైపుణ్యం సాధిస్తే బతుకు బండి సునాయాసంగా..
నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. సామాజిక అంశాల్లోఅమ్మ ఎంతో చురుగ్గా ఉండేది. ఆమె ప్రభావం నాపై ఉంది. ఇంటి వ్యవహారాలను చక్కబెడుతూనే సమాజానికి మేలు చేయాలని పరితపించే అమ్మ జీవితం నాకు స్ఫూర్తి.
పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యం సాధిస్తే బతుకు బండిని సునాయాసంగా లాగవచ్చు అని చెప్పడానికి ఈ మహిళే చక్కటి ఉదాహరణ. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో ఇల్లు, ఆఫీసు తప్ప మరో ప్రపంచం చూడని ఈమె.. అనుకోకుండా ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అటు తర్వాత చుట్టుముట్టిన ఆర్థిక కష్టాలు ఆమెను సర్వీస్ సెక్టార్ బిజినెస్ వైపు అడుగులు వేసేలా చేశాయి.. వన్ స్టాప్ సొల్యూషన్ కంపెనీ స్థాపించడానికి పురిగొల్పాయి. ఇన్సూరెన్స్, టెలి మార్కెటింగ్, స్కిల్ డెవలప్మెంట్ సేవల ద్వారా గృహిణుల ఆదాయానికి బాటలు వేస్తున్న కరాటి అనురాధ స్టార్టప్ స్టోరీ ఆమె మాటల్లోనే..
Startup Story | నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. సామాజిక అంశాల్లోఅమ్మ ఎంతో చురుగ్గా ఉండేది. ఆమె ప్రభావం నాపై ఉంది. ఇంటి వ్యవహారాలను చక్కబెడుతూనే సమాజానికి మేలు చేయాలని పరితపించే అమ్మ జీవితం నాకు స్ఫూర్తి. చిన్నప్పటినుంచి అమ్మ కొంగు పట్టుకు తిరిగిన కారణంగా విద్యాభ్యాసం, పెండ్లి తర్వాత చాలా మంది మహిళల్లా నేను ఇంటికే పరిమితం కాలేదు. ఓ ప్రైవేటు సంస్థలో సాధారణ ఉద్యోగిగా చేరి సీనియర్ అకౌంటెంట్ స్థాయికి ఎదిగాను. ఈ క్రమంలో ఇల్లు, ఆఫీసే ప్రపంచంగా బతికాను. అనుకోకుండా తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన అత్తమ్మను చూసుకునేందుకు ఉద్యోగాన్ని మానుకోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఏడాదిన్నర తిరక్కుండానే ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో ఇల్లు, ఆఫీసు విడిచి బయటి ప్రపంచంలోకి వచ్చేశాను. అకౌంటింగ్ రంగంలో నాకున్న పరిజ్ఞానం, కంపెనీల అవసరాలెలా ఉంటాయో తెలిసినదాన్ని కావడంతో కంపెనీలకు అడ్వయిజరీ తరహా సేవలను అందిస్తూ ఆదాయం పొందవచ్చన్న ఆలోచన కలిగింది. అలా సాధారణ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా ప్రారంభమైన నా పయనం ‘వన్ స్టాప్ సొల్యూషన్’ను స్థాపించేదాకా సాగింది. కేవలం జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్‌ల వద్దే ఆగిపోకుండా కార్పొరేట్ సంస్థలకు నా సేవలు విస్తరించడంపై దృష్టి పెట్టాను. అలా కంపెనీలకు అవసరమయ్యే ఇన్సూరెన్స్, ఫైనాన్స్, అకౌంటింగ్ సేవలు అందిస్తున్నాను.
ఒకప్పుడు ఇన్సూరెన్స్ అంటే ఎల్ఐసీ ఏజెంట్లు మాత్రమే గుర్తొచ్చేవారు. కానీ అందులో ఎన్నో రకాలున్నాయి. బడా కంపెనీలు భారీ మొత్తంలో చార్జ్ చేసి సేవలు అందిస్తాయి. ఇదే వన్ స్టాప్ సొల్యూషన్కు వ్యాపార మార్గం అయింది. కంపెనీలకు అవసరమైన పాలసీలు, ఆర్థిక అవసరాలు, ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా అడ్వయిజరీ ఆధారిత సేవలను మొదలుపెట్టాను. కొన్నాళ్లలోనే ఒకేసారి గంపగుత్తగా కంపెనీ పాలసీలు చేసే స్థాయికి చేరుకున్నాను. ఈ సేవలను పర్యవేక్షించే బీమా సేవల సంఘం వ్యవస్థాపక సభ్యురాలినయ్యాను. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులు రూపొందించేలా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) సహకారంతో శిక్షణ తరగతులు, అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాం. ఈ రంగంలో ఎదురవుతున్న ఇబ్బందులకు పరిష్కార మార్గాలు చూపించగలుగుతున్నాం.
శిక్షణ.. ఉపాధి…
మహిళలు, యువతులకు నా వంతుగా సాయం చేయాలన్న ఉద్దేశంతో వృత్తి నైపుణ్యాలను పెంపొందించే సంస్థలతో జతకట్టాను. నగరంలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లతో అనుసంధానమై మహిళలకు వర్క్ ఫ్రం హోమ్ తరహా ఉపాధినిచ్చే కోర్సుల్లో శిక్షణనివ్వడం మొదలుపెట్టాను. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, క్రాఫ్ట్, జువెలరీ.. ఇలా ఎన్నో రంగాల్లో ఉపాధి, ఉద్యోగం పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను. ఇప్పటివరకు సుమారు 600 మందికి శిక్షణ ఇచ్చాం.
ఇంటి పట్టున ఉండే మహిళలు ఏదైనా కొత్తగా చేయాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అటుంచితే సమాజపు సూటిపోటి మాటలే అడుగు ముందుకు వేయకుండా అడ్డుపడుతుంటాయి. ఈ ఒడుదొడుకులకు ఎదురొడ్డి నిలబడి తానేంటో నిరూపించుకుంటే వ్యతిరేకించినవాళ్లే చేయూతనిస్తూ విజయాలకు కారణమవుతారు. ఇలాంటి సవాళ్లను దాటుకుంటూ సాగిన జీవిత ప్రయాణంలో నాకు ఎన్నో అవార్డులు, మరెన్నో గుర్తింపులు దక్కడం సంతోషాన్నిస్తుంది.
ఇంటి నుంచే పని..
మా ప్రయత్నంలో భాగంగా గృహిణులతో ఒక బృందాన్ని ఏర్పాటుచేసి, ప్రత్యేక శిక్షణనిచ్చాం. ఉపాధి మార్గం చూపాం. కొంతకాలం తర్వాత వారితోనే ఒక వేదిక ప్రారంభించాం. అదే వన్ స్టాప్ సొల్యూషన్. ఐదారుగురితో మొదలైన సంస్థ కార్యకలాపాలను క్రమంగా విస్తరించాం. రెండు మూడేండ్లలోనే 100 మందికి ఫైనాన్స్, ఇన్సూరెన్స్ అంశాల్లో శిక్షణ ఇచ్చాను. మా దగ్గర శిక్షణ పొందిన మహిళలు గడప దాటకుండా ఇంటినుంచే పని చేసుకునే వెసులుబాటును వన్ స్టాప్ సొల్యూషన్ కల్పించింది. ప్రస్తుతం 300 మంది మహిళలు, యువతులు నాతోపాటు కలిసి పనిచేస్తున్నారు.
– కడార్ల కిరణ్
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

