రోజుకో ఫ్యాషన్, పూటకో డిజైన్.. మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మాల్స్ చుట్టూ తిరిగే ఓపికలేక, టైలరింగ్ షాపులను వెతుక్కోలేక చాలామంది ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తున్నారు. కానీ ఇక్కడో ఇబ్బంది. ఒక్కో మహిళ ఆకృతి ఒక్కోలా ఉంటుంది. ఆన్లైన్లో దొరికే స్టాండర్డ్ సైజ్ వస్ర్తాలు నడుము పైభాగానికి సరిపోయినా.. కింది వైపు అతకవు. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించింది పట్లోళ్ల రమాదేవి.
గత ఏడాది సీ అండ్ ఎస్ టెక్నాలజీస్ సంస్థ ద్వారా ft.you అనే ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది కూడా ఒక రకంగా ఆన్లైన్ షాపింగ్ లాంటిదే కానీ, కొంత భిన్నంగా ఉంటుంది. యాప్‌లో ఎంటరైన తర్వాత, నచ్చిన వస్ర్తాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత కొలతలు ఇవ్వాలి. హ్యాండ్స్, నెక్ ఇలా.. ప్రతీది నచ్చినట్టు డిజైన్ చేయించుకోవచ్చు. కచ్చితమైన సైజులతో, పక్కా డిజైన్‌లో ఇంచు కూడా తేడా లేకుండా డ్రెస్ కుట్టిపెడతారు. లెహంగాలు, కుర్తీస్, ట్యూనీస్, సల్వార్ కమీజ్, బ్లౌజులు, ఎంబ్రాయిడరీ.. మనకు ఇష్టమైన డిజైన్ ఎంచుకోవచ్చు.
చెల్లింపులు యాప్‌లోనే చేయొచ్చు. పర్ఫెక్ట్గా సిద్ధమైన డ్రెస్‌ను సకాలంలో డెలివరీ చేస్తారు సంస్థ సిబ్బంది.
ఉపాధికి వేదిక క్షణక్షణానికి మారిపోయే ట్రెండ్స్‌కు అనుగుణంగా ఫ్యాషన్ సేవలు అందించాలన్నది రమాదేవి సంకల్పం. ఆ ప్రయత్నంలో నిష్ణాతులైన డిజైనర్లను ఒకే చోటికి చేర్చింది. చాలామంది ైస్టెలిస్ట్లు సొంతూళ్లలోనో, బొటిక్ చుట్టుపక్కలో సేవలు అందిస్తున్నారు. కొంతమందికి అసలు బొటిక్లే ఉండవు. వ్యాపారం చేయాలని ఉన్నా ఆర్థిక పరిస్థితులు, టెక్నాలజీ ప్రతిబంధకంగా మారతాయి. ఇలాంటి వారికి ఒక వేదిక ఇస్తున్నది రమాదేవి. ఇప్పటికే వరంగల్, నారాయణ్‌ఖేడ్ తదితర ప్రాంతాల్లో కొందరికి ఉపాధి కల్పించారు.
సినిమా రంగానికి చెందిన డిజైనర్స్ కూడా ఈ బృందంలో చేరారు. ఇక్కత్ చీరలకు ఉన్న డిమాండ్ కారణంగా.. భూదాన్ పోచంపల్లికి చెందిన పలువురు చేనేత కళాకారులు భాగస్వాములయ్యారు. నెలకు కనీసం వంద ఆర్డర్లు వస్తున్నాయి. కస్టమర్లు తమ ఫొటోలను పంపినా చాలు.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొలతలు తీసేసుకుంటుంది యాప్. ఆ వ్యక్తి ఆకృతికి ఏ తరహా డ్రెస్‌లు నప్పుతాయో కూడా విశ్లేషిస్తుంది. వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది రమాదేవి.
ఉద్యోగాన్ని వదులుకుని
రమాదేవి స్వస్థలం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని కొర్పోల్. వ్యవసాయ కుటుంబం. తను హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పీజీ చేసింది. ఇరవై ఏండ్ల పాటు ఓ కంపెనీలో ఉద్యోగం చేసింది. కానీ, ఎక్కడో అసంతృప్తి. తన కల వేరు. చేస్తున్న కొలువు వేరు. దీంతో కార్పొరేట్ రంగాన్ని వదులుకుని ఫ్యాషన్ వ్యాపారం వైపు అడుగులు వేసింది. తన చెల్లెలు సరస్వతికి బొటిక్స్ నిర్వహణలో నైపుణ్యం ఉండటమూ కలిసొచ్చింది. సీ అండ్ ఎస్ టెక్నాలజీస్‌కు సరస్వతి కో-ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నది.
‘కస్టమర్ల నుంచి రెస్పాన్స్ బాగుంది. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు వచ్చింది. నా వ్యాపార ప్రయాణాన్ని వీహబ్ గొప్ప మలుపు తిప్పింది. మార్కెటింగ్ స్కిల్స్ కోసం వీహబ్‌ను సంప్రదించాను. స్టార్టప్ ఇండియా
సర్టిఫికేషన్‌తో వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవచ్చో వీహబ్ బోధించింది. ఆమె జాన్‌లో సర్వర్ స్పేస్‌ను అందించి వ్యాపార వృద్ధికి తోడ్పడింది’ అంటూ విజయానికి మూలస్తంభమైన సంస్థను కొనియాడుతుంది రమాదేవి. నిజమే, కొన్ని మజిలీలు జీవితాన్నే మలుపు తిప్పుతాయి.
– గంజి ప్రదీప్‌కుమార్