గిది గూడ చెన్నాల్రామలింగని కతనె! ఒక ఊళ్లే ఒక పూటకూళ్ల ముసలమ్మ ఉండేది. ఆమె అచ్చిపోయెటోళ్లకు బువ్వవెట్టి బతుకుతుండేది. ఒకపారి నల్గురు కొత్తోళ్లు అచ్చి.. “అవ్వా! మాది పొరుగూరు. గుళ్లె కతలు, భజనలు జేత్తం. మాకు అచ్చిన పైసలు నీతాన దాసిపెట్టుకుంటం. మీం నల్గురం అచ్చి.. యికట్టగ అడిగితెనే.. గా పైసలు ఇయ్యాలె. ఒక్కళ్లే అచ్చి అడిగితె అస్సలు ఇయ్యద్దు!” అన్నరు. రోజు దొంగతనం జేసుకుంట.. తీసుకచ్చిన పైసలను, తెల్లారి అవ్వకిచ్చి దాశిపెట్టుమని జెప్పేటోళ్లు. ఒకసారి నల్గురు బజారుకు వోయిండ్లు. ఆళ్లకు ఏదో తినాలనిపిచ్చింది. జేబుల్ల పైసలు లెవ్వు. అండ్లకెల్లి ఒకళ్లను అవ్వ దగ్గరికి వోయి.. కొన్ని పైసలు దెమ్మంట వంపిండ్లు. అవ్వకు ఆళ్లు జెప్పిన ముచ్చట యాదికిలేక.. ఒకడచ్చి అడుగంగనే పైసల కుండ ఇచ్చింది.
ఆడు.. దొరికిందే సందని ఆయిన్ని పైసలు దీస్కోని పారిపోయిండు. ఆడు ఎంతకు రాక వోయెటాళ్లకు.. మిగిల్న ముగ్గురు అవ్వ తానికి వోయిండ్లు. అసలు ముచ్చట ఇని.. అవ్వనే అవద్దం ఆడుతున్నదని రాజుకు పిర్యాదు అయ్యిండ్లు. చెన్నాల్రామలింగనికి అసలు ముచ్చట ఎరుకైంది. అవ్వ నడిమిట్ల ఇరికిందని తెల్సుకున్నడు. ఇకమతులోడాయె.. “సరే! మీరు నల్గురు కలిశి అత్తెనే పైసల కుండ ఇయ్యిమన్నరు గదా! గట్లనే.. మీరు నల్గురు కలిశి రాపోండి! అవ్వ మీ పైసల కుండ మీకిత్తది” అంట జెప్పిండు. ఆళ్లదాళ్లకే తిరగొట్టింది. లబోదిబో అని మొత్తుకుంట.. నాలుగోన్ని లెంకులాడుకుంట పోయిండ్లు.
– పత్తిపాక మోహన్