తస్మాత్ జాగృత జాగృత!
మాతంగుడు అవతలి ఒడ్డున చిక్కుబడిపోయాడు. అతని భార్య గుడిసెముందు దీపం పెట్టి మగని రాకకోసం ఎదురు చూస్తున్నది. అప్పటివరకూ చీకటిపడేలోపుగా భర్త తిరిగి వచ్చేస్తాడని ధైర్యంతో ఉన్న ఆమెలో.. అంతకంతకూ ఆదుర్దా పెరగసాగింది.
జరిగిన కథ : చింతామణి అనే వేశ్య.. లీలాశుకుని నుంచి దూరమైన తరువాత యోగినిలా బతుకుతుండేది. అగ్నిశిఖుడనే యోగిని ఆశ్రయించి, ఆత్మజ్ఞానం బోధించమని వేడుకుంది. కానీ, బాహ్యస్మృతి లేని ఆ యోగి ఆమె మాటలను ఆలకించలేదు. అది అవమానంగా భావించిన ఆమె.. ఆ యోగి ఒక మాతంగుని కడుపున పునర్జన్మించేలా కుట్ర పన్నింది. ఫలితంగా యోగి, మాతంగుడై పుట్టి, ఎనిమిదేళ్ల వయసు వాడయ్యాడు.
మాతంగుడు అవతలి ఒడ్డున చిక్కుబడిపోయాడు. అతని భార్య గుడిసెముందు దీపం పెట్టి మగని రాకకోసం ఎదురు చూస్తున్నది. అప్పటివరకూ చీకటిపడేలోపుగా భర్త తిరిగి వచ్చేస్తాడని ధైర్యంతో ఉన్న ఆమెలో.. అంతకంతకూ ఆదుర్దా పెరగసాగింది. వీధి చివరి వరకు వెళ్లి చూసి, మగడు కనిపించక నిరాశగా వెనుదిరిగి వచ్చింది.
బయటి అరుగుమీదనే కూర్చుని..
“మా ఇంటాయన కనిపించాడా?” అని
దారిన పోతున్న వాళ్లను అడగసాగింది.
ఆమె ఆరాటం చూసి, పిల్లవాడు బయటికి వచ్చాడు.
“అమ్మా! నాన్నకోసం ఇంత పరితపిస్తున్నావు దేనికి? నేడు కాకపోతే రేపు వస్తాడు కదా!” అని అడిగాడు.
తల్లి కొడుకుని ఎత్తుకుని ముద్దాడుతూ..
“నాయనా! మీ నాన్న ఈ రాత్రికి గస్తీ తిరగాల్సి ఉంది. ఏ కారణం చేతనో రాలేకపోయినాడు. మూడుతరాల నుంచి మనకు గస్తీ తిరుగుతున్నందుకు మాన్యం వస్తున్నది. ఈవేళ మానేస్తే మాన్యం లాగేసుకుంటారు. అందుకే విచారిస్తున్నాను” అన్నది.
“అమ్మా! గస్తీ అంటే ఏమిటి?” అని అడిగాడు.
“బాబూ! ప్రజలందరూ నిద్రపోతుండగా రాత్రి నాలుగు జాముల్లోనూ నాలుగు వీధులకూ పోవాలి. డప్పు వాయిస్తూ.. ‘ఇంటిలో దొంగలు దూరి వస్తువులు దొంగిలించుకుని పోగలరు. జాగ్రత్తగా మేలుకుని ఉండండి!’ అని కేక పెట్టాలి. దానికే గస్తీ అని పేరు”
అని చెప్పింది తల్లి.
వారిద్దరి మధ్య సంభాషణ ఇలా కొనసాగింది.
“ఆ మాత్రం పని నేను చేయలేనా?!
నన్నుపంపించరాదా!”.
“నాయనా! నువ్వు ఇదివరకు ఎన్నడూ ఇల్లు కదిలి ఎరగవు. చీకటిలో కొత్త వీధులకు ఎలా పోగలవు?! జడుసుకున్నావంటే భూతాలు సోకగలవు. మాన్యం పోతే పోయింది కానీ, నీకా పని వద్దులే తండ్రీ!”.
“అమ్మా! నాకేమీ భయం లేదు. డప్పు వాయించగలను. ఏ వీధులకు పోవాలో గుర్తులు చెప్పు. వెళ్తాను!”.
“ఒకపని చేద్దాం. నేను కూడా వస్తాను. కానీ నువ్వు బిగ్గరగా కేక వేయగలవా? అని సందేహంగా ఉంది”.
“మరేమీ పరవాలేదమ్మా. వెళదాం పద!” అన్నాడు పిల్లవాడు.
కోటలో పదిగంటలు కొట్టారు. తల్లీ కొడుకులిద్దరూ బయల్దేరారు. పిల్లవాడు చేతిలో డప్పు పట్టుకున్నాడు. తల్లి పిల్లవాణ్ని ఎత్తుకుని, ఒక చేతిలో కర్ర పట్టుకున్నది.
“అమ్మా! నన్ను కిందికి దింపు. నేను నడవగలను” అన్నాడు పిల్లవాడు.
కానీ తల్లి ఒప్పుకోలేదు.
“నాయనా! నువ్వు నాకు భారమవుతావా?! ఈ చీకటిలో నిన్నెలా నడిపించగలను?!” అన్నది.
కోటకు తూర్పున ఉన్న వీధికి తీసుకుపోయి, ఒకచోట కొడుకుని దించింది. తాను కొద్దిసేపు డప్పు వాయించి..
“నాయనా! ‘దొంగలున్నారు జాగ్రత్తండోయ్. పారాహుషార్!’ అని అరువు” అని చెప్పింది.
అప్పుడు ఆ కుర్రవాడు ఒక శ్లోకం చదివాడు.
“కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠంతి తస్కరాః
జ్ఞానరత్నా పహారేణ తస్మాత్ జాగృత జాగృత
..ఓ జనులారా! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరుగురు దొంగలు నీ దేహమనే ఇంటిముందు తిరుగుతున్నారు. ఆ దొంగలు నీ జ్ఞానమనే రత్నాన్ని దొంగిలించుకుని పోగలరు. జాగ్రత్తగా ఉండు. ఇకనైనా మేలుకో!”.. అని అరిచాడు.
“నాయనా! నేను చెప్పినట్లు కాకుండా వేరేదో చదువుతున్నావు. ఈ చదువు నీకెలా వచ్చింది?” అని ఆశ్చర్యపడిన తల్లి, అంతలోనే తనకుతానే సర్దిచెప్పుకుని..
“అయినా కొత్తమాటలు చెప్పకూడదు. ‘దొంగలు పడగలరు. మేల్కొని ఉండండి!’ అని కేకలు పెట్టు” అన్నది.
“అమ్మా! నువ్వు చెప్పిన మాటలే నేను మరోలా చెప్పాను!” అన్నాడు కుమారుడు.
తల్లి ఎలాగో సరిపుచ్చుకుని రెండోజాములో దక్షిణపు వీధికి తీసుకుపోయింది. ఒకచోట కొడుకుని కిందికి దించి, డప్పు వాయించింది. పిల్లవాణ్ని కేకపెట్టమన్నది.
అప్పుడతను మరో శ్లోకం చదివాడు.
“మాతానాస్తి పితానాస్తి నాస్తి బంధుః సహోదరః
అర్థంనాస్తి గృహంనాస్తి తస్మాత్ జాగృత జాగృత
..తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భార్యాపుత్రులు, ధనము, గృహము, పశువులు అన్నీ అస్థిరమైనవే! క్షణభంగురమైనవే! వాటిని నమ్మి, నిత్యమైన వస్తువును తెలుసుకోవడంలో ఏమరుపాటు వహించకు. జాగ్రత్తగా ఉండు. ఇకనైనా మేలుకో”..
తల్లికి ఆ శ్లోకం ఏమిటో బోధపడలేదు.
“నాయనా! నువ్వేదో కొత్తగా మాట్లాడుతున్నావు. రాజుగారి నుంచి మాటవస్తుంది సుమా! ఇంక నువ్విలా మాట్లాడవద్దు” అని ముందుకు సాగిపోయింది.
కానీ, ఆమెకు తెలియని సంగతి ఏమిటంటే.. తొలిజాములో పిల్లవాడు చదివిన శ్లోకాన్ని రాజుగారు విన్నారు. ఆశ్చర్యంతోనూ, ఆ శ్లోకంలోని భావాన్నే పదేపదే తలపోస్తూ కూచోవడం వల్లనూ రాజుగారికి నిద్ర పట్టలేదు. ‘రెండోశ్లోకం ఏం వినిపిస్తుందో!?’ అని వేచి చూస్తూ నిద్రపోకుండా ఉన్నాడు.
రెండో శ్లోకం కూడా రాజును ఆకర్షించింది.
మూడోజాముకు పడమర వీధిలో గస్తీ తిరగసాగారు తల్లీకొడుకులు. తల్లి డప్పు వాయించిన వెంటనే కుమారుడు తదుపరి శ్లోకాన్ని ఇలా చదివాడు.
“జన్మదుఃఖం జరాదుఃఖం జాయా దుఃఖం పునః పునః
సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత
..ఓ మానవుడా! ఈ జన్మ దుఃఖభూయిష్ఠమైనది. దీనికి వృద్ధాప్యం ఒక దుఃఖం. భార్యా సంగమం, వియోగం ఒక దుఃఖం. సంసార సాగరమే దుఃఖాలకు నెలవు. దీనిలో సంతోషాలకు వెనుకనే దుఃఖాలు ఉంటూనే ఉంటాయి. ఈ సంసారాన్ని దాటివెళ్లే మార్గాన్ని ఆలోచించకుండా మాయలో పడకు. జాగ్రత్తగా ఉండు. ఇకనైనా మేలుకో”..
కొడుకుకు తానేమి చెప్పినా వినడని తల్లి మాట్లాడలేదు. అయినా అతనికింత చదువు ఎలా వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు.
కోటలో రాజుగారికి నిద్రపట్టలేదు. మూడు శ్లోకాలనూ పదేపదే నెమరువేసుకుంటున్నాడు. తదుపరి శ్లోకం కోసం వేచి ఉన్నాడు.
నాలుగో జాములో ఉత్తరపు వీధినుంచి ఆ శ్లోకం వినిపించింది.
“ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా
ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగృత జాగృత
..జంతువులా ఆశచేత బంధితుడైన మానవుడా! ఏవేవో గొప్పగొప్ప పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నావా?! మృత్యుదేవత ఎప్పుడో వచ్చి నిన్ను గుటుక్కున మింగేయగలదు. అది వచ్చేముందే అమృతత్వం కోసం ప్రయత్నించు. అప్రమత్తుడివై ఉండు. మేలుకో”..
మాతంగుని పుత్రుడు చదివిన శ్లోకాలు విన్న మహారాజు ఆ రాత్రికి ఇక నిద్రించలేదు. తెల్లవారుతూనే..
“నిన్నరాత్రి గస్తీ తిరిగిన మాతంగుడైన పుల్కసుడిని తీసుకురండి” అని రాజభటులను పంపాడు.
అప్పటికే ఇల్లు చేరిన పుల్కసుడు రాజభటుల పిలుపు మేరకు దర్బారుకు వెళ్లాడు.
“ఏరా! నిన్నరాత్రి గస్తీ తిరిగింది నువ్వేనా?! నిజం చెప్పు. తప్పు చెబితే దండిస్తాను!” అన్నాడు రాజు.
పుల్కసుడు భయపడుతూ..
“ప్రభూ! నన్ను మన్నించండి. నిన్నరాత్రి అవతలి ఒడ్డున చిక్కుబడిపోయాను. మాన్యం పోతుందని భయపడి మా ఆవిడ, నా కొడుకుతో కలిసి గస్తీ తిరిగిందట. ఈసారికి తప్పు కాయండి” అన్నాడు దండం పెడుతూ.
రాజు నవ్వుతూ..
“అయితే రాత్రి గస్తీ తిరిగినవాడు నీ కొడుకా?! వాడికి ఎన్నేళ్లుంటాయి?” అని ప్రశ్నించాడు.
“ఇంకా ఎనిమిదేళ్లు వెళ్లలేదు ప్రభూ!”.
“సరే.. నువ్వు పోయి వాణ్ని తీసుకురా”.
“తండ్రీ! మీ దాసుణ్ని. ఏదైనా శిక్ష వేయదలుచుకుంటే వానికి మారుగా నన్ను శిక్షించండి” అని కన్నీరు పెట్టుకున్నాడు పుల్కసుడు.
రాజు వాణ్ని వారించి..
“నీ కొడుకును శిక్షించను. నిజానికి వాడే మాకు నిన్న రాత్రంతా శిక్ష విధించాడు. నువ్వు పోయి, వాణ్ని తీసుకురా!” అని మరోవైపునకు తిరిగాడు రాజు.
ఒక భటుడు దండం చేతబట్టుకుని పుల్కసుడిని, ‘పద పద’ అంటూ తోసుకుంటూ పోయాడు. వాడు దిగులు మొగంతో ఇంటికి పోయాడు. భర్త తెచ్చిన కబురు విని మాలిని తల్లడిల్లిపోయింది.
“నేను చెప్పినట్లు కేకవేయకుండా ఏదేదో చదివావు. రాజుగారికి కోపం వచ్చిందట. నాన్నతోపాటు వెళ్లి, ఆయన పాదాలమీద పడు” అన్నది.
“భయపడకమ్మా! రాజుగారు నన్నేమీ చేయరు” అన్నాడు బాలుడు.
“వేగిరం రావాలి!” అని భటుడు కేకవేశాడు.
బాలునికి దర్బారుకు తగినట్లుగా వెండి మురుగులు, కంటె, గజ్జెలు పెట్టింది తల్లి. గోచీ కట్టి, తలదువ్వింది. వాణ్ని చంకనెత్తుకుని బయల్దేరాడు పుల్కసుడు. ఏం జరుగుతుందో అనే ఆదుర్దాతో తల్లి కూడా వెంట నడిచింది. బాలుణ్ని చూడగానే రాజుకు ఆశ్చర్యం వేసింది.
‘ఇతను తప్పనిసరిగా కారణజన్ముడే. పాపం ఏ తపోనిధియో విధివశాత్తూ ఇలా పుట్టి ఉంటాడు’ అనుకున్నాడు. అప్రయత్నంగా సింహాసనం దిగి వచ్చాడు.
బాలుని చెంతకు వచ్చి ఆదరంగా..
“ఓయీ! నిన్నరాత్రి గస్తీ తిరిగినవాడివి నువ్వే కదా!” అని ప్రశ్నించాడు.
బాలుడు తలవూపి అంగీకారం తెలిపాడు.
“నువ్వేం చదువుకున్నావు? నీ ఉపాధ్యాయుడెవరు?” అని ప్రశ్నించాడు రాజు.
బాలుడు దానికి సమాధానమేమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు.
“మావాడు ఏ బళ్లోనూ చదవలేదండీ!” అని పుల్కసుడు చెప్పాడు.
“మాతంగా! నీకు పిల్లలెందరు?” అని మళ్లీ రాజు ప్రశ్నించాడు.
“దేవా! వీడొక్కడే నాకు సంతానం. చింతామణి కృపచేత కలిగాడు”.
“చింతామణి ఎవరు?”.
“కులానికి భోగమావిడ ప్రభూ! కానీ, గొప్ప యోగిని అని పేరు. ఆవిడ చెప్పబట్టే నాకీ కొడుకు కలిగాడు”.
“ఆవిడ నీకేమని చెప్పింది?”.
“ఎవరో రుషిగారు గంగలో జపం చేసుకుంటుండగా ఆయన వెళ్లే దారిలో చెప్పులు ఉంచమని చెప్పింది. నేను అలా చేసిన తరువాతనే వీడు పుట్టాడు”.
“వీడు మాంసం తింటాడా?”.
“దేవా! మాంసమే కాదు.. అన్నం కూడా తినడు. తల్లిపాలు తాగలేదు. చింతామణిగారే రోజూ పాలు, పళ్లు తెచ్చిపెడుతుంటారు” అని చెప్పాడు పుల్కసుడు.
అతను చెప్పిన మాటలు విన్న రాజు కొద్దిసేపు విచారంగా అటూ ఇటూ తిరిగాడు. మరికొద్దిసేపు బాలుని వంక తేరిపార చూశాడు. తదుపరి ఒక బంగారు పళ్లెంలో వెయ్యివరహాలు పోసి..
“బాలకా! నిన్నరాత్రి గస్తీ తిరిగినందుకు వీటిని నీకు పారితోషికంగా ఇస్తున్నాను. తీసుకో!” అన్నాడు.
బాలుడు ఆ పళ్లేన్ని రెండుచేతులతో తీసుకుని..
“అమ్మా! నేను మొయ్యలేను” అంటుండగానే తల్లి తీసుకుని, వరహాలు మూటగట్టింది.
దంపతులిద్దరూ పరమానందంతో ఇంటికి తిరిగి వచ్చారు. బాలునికి దిష్టితీసి పడుకోబెట్టారు. ఇంతలో చింతామణి అక్కడికి వచ్చింది. పుల్కసుడు జరిగిన సంగతి యావత్తూ ఆమెకు చెప్పాడు.
ఆమె ముక్కుపై వేలుంచుకుని..
“మాతంగా! ఎంత పని చేశావురా?! ఇప్పుడు కుర్రవాడు ఎక్కడున్నాడు?” అని ప్రశ్నించింది.
“రాజుగారి దగ్గరనుంచి రాగానే మావాళ్లందరూ చుట్టూ మూగారు. బాలునికి దిష్టిసోకి ఒళ్లు వెచ్చబడింది. లోపల పడుకోబెట్టాం” అన్నాడు.
చింతామణి ఒక్క ఉదుటున లోపలికి వెళ్లింది. పిల్లవాణ్ని కదిలించి చూసింది. కానీ, అప్పటికే వాని ఒళ్లు చల్లబడిపోయింది.
“మహాత్మా! నీ స్వస్వరూపంలో కలిసిపోయావా?! అయ్యయ్యో! నీవల్ల జ్ఞానం పొందాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. మహానుభావా! ఇంక నాతో మాటాడవా?” అన్నది చింతామణి కళ్ల వెంట నీరుకారుస్తూ.
తల్లిదండ్రులిద్దరూ ఒక్కసారిగా గొల్లుమన్నారు. వారిని ఊరడించి, అప్పటివరకూ చెప్పని బాలకుని జన్మరహస్యాన్ని తల్లిదండ్రులకు చెప్పింది చింతామణి.
“మీ రుణం తీర్చుకుని, ఆ యోగిపుంగవుడు ముక్తి పొందాడు” అని వివరించింది.
ఆమె ఉపదేశాల వల్ల వారిద్దరూ వైరాగ్యాన్ని పొంది, తీర్థయాత్రలు చేస్తూ మనశ్శాంతితో శేషజీవితం గడిపారు. చింతామణి కూడా ఆ మహాత్ముడు చెప్పిన నాలుగు శ్లోకాలనే జన్మసాధనలుగా గ్రహించి.. మహాయోగిని అయింది. అంత్యదశను దేశపర్యటనలోనే గడిపి ముక్తురాలైంది.
(వచ్చేవారం.. స్త్రీగా మారిన పురుషుడు)
-అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

