జరిగిన కథ : కాశీమజిలీల్లో ప్రస్తుతం సప్తమిత్ర చరిత్రలో ఉన్నాం. కాళిదాస మహాకవి రచించిన మేఘసందేశంలోని యక్షుడు కూడా ఒక ప్రధాన పాత్రగా.. ఏడుగురు మిత్రుల మధ్య ఈ కథ నడుస్తుంది. కాళిదాసు, భోజరాజు కూడా ఇందులో ఉంటారు. ఏడుగురు మిత్రులలో ఇద్దరు తప్ప మిగిలినవారు భోజరాజు ఆస్థానానికి వచ్చారు.
భోజరాజుగారి కొలువుకూటంలో విద్వాంసుల సభ మొదలైంది. కాశీనుంచి వచ్చిన ఏడుగురు మిత్రులలో.. కుచుమార, గోనర్దీయ, చారాయణ, సువర్ణనాభ, గోణికాపుత్రులు అనే ఐదుగురూ ఒకవైపు కూర్చున్నారు. మరోపక్క కాళిదాసుతోపాటుగా దండి, భవభూతి, శంకరుడు మొదలైన వారందరూ ఆసీనులయ్యారు. కుచుమారుడు పైకిలేచి.. “మహారాజా! మేమంతా కాశీలో గురుకులవాసం చేసి వచ్చాం. మీ సంస్థాన పండితుల ప్రఖ్యాతిని విని వారితో ప్రసంగించడానికి వచ్చాం. మా ప్రతిభ చూసి, మాకు కూడా మీ కొలువులో తగిన స్థానాలు లభిస్తాయనే ఉద్దేశంతో ఉన్నాం. మాలో ఎవరితోనైనా సరే.. కాళిదాసుగారు వాదం చేస్తే బాగుండునని మా కోరిక” అన్నాడు.
అందుకు శంకరుడు..
“బాబూ! మీ మాటలు గర్వభూయిష్టంగా ఉన్నాయి. కాళిదాసుగారిని మించిన పండితుడు ఈ ఆస్థానంలో లేడు. ఆయనతో వాదించాలంటే మధ్యవర్తి ఉండాలి. దానికి బ్రహ్మయో, బ్రహ్మపత్ని అయిన సరస్వతియో దిగిరావాల్సి ఉంటుంది. మీకోసం అంతపని చేయడం సాధ్యం కాదు కనుక, వేరెవరితో అయినా వాదం కోరుకోండి” అని సలహా చెప్పాడు.
కుచుమారుడు మొదలైనవారంతా అందుకు ఒప్పుకొన్నారు. ఇతర పండితులతో చాలా ప్రసంగాలు జరిగాయి. వారిలో అనేకమందికి బిరుదులు, కానుకలు వేనవేలుగా లభించాయి. సభ ముగిసిన తరువాత భోజరాజు.. గోనర్దీయుడు, కుచుమారులను ఉద్దేశించి..
“ఆనాడు నేను మిమ్మల్ని పురందరపురంలో కలుసుకున్నాను. ఆనాడు సరస్వతి సమక్షంలో మీ ప్రతిభను ప్రత్యక్షంగా చూశాను” అని పలికాడు.
ఆ మాటలతో మిత్రులందరూ ఒక్కసారి ఆశ్చర్యంతో భోజరాజుకేసి తేరిపార చూశారు.
అప్పుడు సువర్ణనాభుడు పైకిలేచి, భోజరాజుతో..
“మహారాజా! దయచేసి మాకు మీతో ఏకాంత సమావేశానికి అవకాశం ఇప్పించండి. మేము మా గోడు కొంత చెప్పుకోవాల్సి ఉంది…” అని కోరాడు.
భోజరాజు అందుకు సమ్మతించాడు. ఐదుగురు మిత్రులతోపాటు, కాళిదాసు మాత్రమే అక్కడ ఉన్నారు. అప్పుడు చారాయణుడు ఇలా చెప్పాడు.
“మహారాజా! నేను ఇక్కడికి సమీప అరణ్యంలో ఒక సిద్ధుణ్ని చూశాను. ఆయనకు వన్యమృగాలను ఐకమత్యంగా కలిసిమెలిసి బతికేలా చేయడం వచ్చు. ఇంకా అనేక విద్యలు వచ్చు. ఆయన నాకు గురూపదేశం చేసే సమయంలో కుట్రపన్ని భైరవుడనే దుర్మార్గుడు ఆయన తల పగులకొట్టాడు. నా నెత్తిమీద ఆకుపసరు పూసి నన్ను ముందుగా గాడిదను, తరువాత మేకను చేశాడు!”.
“ఆ.. భైరవుడా! వాడే మా మహారాణిని ఎత్తుకుపోయాడు” అని భోజరాజు ఆవేశపడ్డాడు.
“ఆ సంగతి కూడా వస్తుంది ప్రభూ! చనిపోయిన సిద్ధుని విద్యలన్నీ మా కుచుమారునికి దైవవశాన పట్టుబడ్డాయి. ఇక మా గోనర్దీయుడు ఒక బ్రహ్మరాక్షసుని కారణంగా విద్యలు సాధించి, చిన్న రాజ్యానికి రాజయ్యాడు” అని చెప్పి కూర్చున్నాడు చారాయణుడు.
అప్పుడు సువర్ణనాభుడు పైకి లేచాడు.
“నిజానికి మేం ఏడుగురం మిత్రులం ప్రభూ! కాశీలో చదువు ముగించుకుని, వేర్వేరు ప్రాంతాలనుంచి ధారానగరానికి వస్తున్నాం. దారిమధ్యలో నాకొక యక్షకాంత పరిచయమైంది. ఆమెను వివాహం చేసుకుని, సంగీతసభలు నిర్వహించి.. నేను పొట్ట పోషించుకుంటున్నాను. నా భార్యకు అక్క బావలున్నారు. నా తోడల్లుడైన యక్షుడు మరెవరో కాదు.. మన కాళిదాసుగారి మేఘసందేశంలోని యక్షుడే!” అని చెప్పి కూర్చున్నాడు.
భోజరాజు ఒకసారి తలతిప్పి కాళిదాసువైపు గౌరవ పురస్సరంగా చూశాడు.
అప్పుడు గోణికాపుత్రుడు..
“ఆ యక్షుణ్ని మొదటిసారి చూసింది మా దత్తకుడు ప్రభూ! వాడే మొట్టమొదటగా ఈ ధారానగరానికి వచ్చాడు. అతని తరువాత నేను వచ్చాను. తమ కుమారుడైన చిత్రసేనుడికి చారుమతిని కూర్చినవాణ్ని నేనే. ఇంతకూ మా దత్తకుడు ఏమైపోయాడో తెలియలేదు. యక్షుని శాపం వల్లనే అతని రూపం మారిందని తరువాత తెలియవచ్చింది. ప్రస్తుతం చారుమతిగా మీ చిత్రసేనుల వారి భోగకాంతగా ఉన్నది మా దత్తకుడు అవునో కాదో.. తమరే తేల్చాలి. ముందుగా యక్షుణ్ని రక్షించాల్సి ఉంది. అలాగే మా దత్తకుడికి కాబోయే ఇల్లాలిని, నేను పెళ్లాడాలనుకున్న అమ్మాయిని వెంటపెట్టుకుని, ఈ నగరానికి వచ్చాను. వాళ్లిద్దరూ ఏమయ్యారో కూడా తెలియరావడం లేదు. దీనిని మీరే కనిపెట్టాలి” అని వేడుకున్నాడు.
తరువాతి విన్నపం గోనర్దీయుడు వినిపించాడు.
“ప్రభూ! మీకు మార్గమధ్యంలో సాయం చేసిన ఘోటకముఖుడు మా మిత్రుడే. అతను ఏమయ్యాడో తెలియకుండా ఉంది. అతణ్ని కూడా మీరు రక్షించాలి. భైరవుణ్ని పట్టుకుని, యక్షుడేమయ్యాడో ఆరాతీస్తే తప్ప అసలు విషయం బయటపడదు!”.
..వారి విన్నపాలు విన్న తరువాత భోజమహారాజు..
“ఇదంతా తేలికగా జరిగే వ్యవహారం కాదు. మరో రెండుమూడు రోజులలో భైరవుడి ప్రదర్శన జరగనున్నది. ఆనాటికి వాడిపని చెబుతాం. అప్పటివరకు మీరు విశ్రాంతి తీసుకోండి” అని చెప్పి ఆనాటికి సభ చాలించాడు.
మరునాడు పొద్దుటిపూట..
ఐదుగురు మిత్రులూ ఒక ఇంటి చావడిలో కూర్చుని ఉన్నారు. అక్కడికొక ఎడ్లబండి వచ్చి ఆగింది. దానిలోంచి ఒక పురుషుడు, ఇద్దరు స్త్రీలు దిగారు. మిత్రులందరూ వెళ్లి ఆ వచ్చినవాణ్ని కౌగిలించుకున్నారు. అతనే ఘోటకముఖుడు. ఆ స్త్రీలు లోనికి వెళ్లారు.
కుశల ప్రశ్నలు పూర్తయ్యాక ఘోటకముఖుడు తన కథనిలా చెప్పాడు.
“ఆనాడు నేను భోజరాజుగారికి తన ఇల్లాలిని చెరబట్టినవాణ్ని చూపించడానికి ఏకశిలానగరం వెళుతుంటే, దారిమధ్యలో వాడే ఎదురుపడ్డాడు. భోజరాజుగారిని ఒక మేకగా మార్చివేశాడు. నా మీదికి కుక్కలను ఉసిగొల్పాడు. నేను వాటినుంచి తప్పించుకోవడానికి పరుగుపెట్టాను. కొంతదూరం నన్ను తరిమిన తరువాత ఆ కుక్కలు ఏమయ్యాయో తెలియదు. నేను మళ్లీ అడవి మధ్యలో దిక్కుతోచక నిలబడ్డాను.
అటువంటి సమయంలో నాకొక ఆడగుర్రం కనిపించింది. నాకు గుర్రపు స్వారీ వచ్చు కనుక, నేను దానిపై ఎక్కి పశ్చిమోత్తర దిశగా వెళ్లడానికి ప్రయత్నించాను. కానీ దారితప్పాను.
ఆ గుర్రం నన్ను అడవిలో ఒక విచిత్రమైన ప్రదేశానికి తీసుకుపోయింది.
అక్కడొక కుటీరం కనిపించింది. అందులో మనుషులు ఉంటారని తలచి తలుపు తట్టాను. అది దగ్గరికి వేసి ఉంది. ఎవరి అలికిడి కనిపించలేదు. లోపలికి ప్రవేశించాను. స్వల్పంగా సామగ్రి ఉంది. తిన్నగా పెరటిలోకి పోయాను. అక్కడొక నుయ్యి ఉంది. నీళ్లు తోడుకుని, కడుపునిండా తాగాను.
మళ్లీ లోపలికి వచ్చి పరిశీలించగా ఆ గుడిసెలో ఒక గదిమాత్రం తాళం వేసి ఉండటాన్ని గమనించాను. ఈవలికి వచ్చాను.
నేను ఎక్కి వచ్చిన గుర్రం అక్కడే ఉంది. నేను దానికి కృతజ్ఞతా సూచకంగా మెడ నిమురుతూ లక్షణాలు పరిశీలించసాగాను. దాని మెడలో ఏదో తాయెత్తు కట్టి ఉండటం చూసి, దానిని లాగి వేశాను.
నా కళ్లెదురుగానే ఆ గుర్రం ఒక వృద్ధ స్త్రీగా మారిపోయింది.
నేను ఆశ్చర్యపడుతూ..
“అవ్వా! ఎవరు నువ్వు? ఎందుకిలా గుర్రంలా మారిపోయావు?” అని ప్రశ్నించాను.
అప్పుడామె ఇలా చెప్పింది.
“బాబూ! ఈ కుటీరం నాదే. మేము సారస్వత బ్రాహ్మణులం. నా భర్తతో కలిసి ఇక్కడ చాలాకాలం కాపురం చేశాను. నా పేరు రాధ. నా పుత్రిక పేరు మిత్రవింద. నా భర్త మరణానంతరం నేను ఆ బాలికను ప్రాణంలా చూసుకుంటూ వచ్చాను”.
అని అంతవరకూ చెప్పి..
“రా నాయనా! లోపలికి వెళదాం. నీకు వంట చేస్తాను. ఎన్నాళ్లయిందో కమ్మని భోజనం చేసి. ఈలోపుగా నువ్వు స్నానం చెయ్యి. భోజనం చేస్తుండగా మిగిలిన కథ చెబుతాను” అన్నది.
నేను అలాగే చేశాను. ఆమె వంట చేస్తుండగా ఆమెతో కొంత సంభాషించాను. ఇందాకా తాళంపెట్టిన గదిలోంచి ఆమె కావాల్సిన వస్తువులన్నీ తీసుకువచ్చి.. అరగంట వ్యవధిలో అనేక రుచులతో భోజనం తయారుచేసింది. నాకు పెరటిలో భోజనం వడ్డించింది. కథ వినేటప్పుడు నా ఏకాగ్రతకు భంగం రాకుండా.. ఆమె వడ్డన చేసేటప్పుడు నా ఆకలికి ఏ మాత్రమూ అడ్డంకి లేకుండా తరువాతి కథ ఇలా చెప్పింది.
“నా కూతురికి పన్నెండేళ్ల వయస్సున్నప్పుడు.. ఒకనాటి రాత్రి పెద్ద వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. మెరుపులు మెరుస్తున్నాయి.
ఆ మెరుపుల వెలుగులో గుర్రమెక్కి ఒక రాజపురుషుడు మా తలుపు తట్టాడు. ‘అమ్మా! ఈ రాత్రి మీ ఇంట ఉండవచ్చా? బయట చలితీవ్రత ఎక్కువగా ఉంది. వాన పడేలా ఉంది’ అని కోరాడు. నేను అంగీకరించి లోనికి ఆహ్వానించాను. అతనికి వంటచేసి పెట్టాను. నిద్రించడానికి మంచమిచ్చాను.
తెల్లవారిన తరువాత అరుగుమీద కూర్చుని..
‘అమ్మా! నిన్ను మరువను. నువ్వు ఒంటరిగా ఈ అరణ్యంలో ఉండటానికి కారణం ఏమిటి? నీకు పిల్లలెందరు?’ అని ప్రశ్నించాడు.
అప్పుడు నా కూతురిని లోపలినుంచి పిలిచాను. కొద్దిసేపు దాని అందాన్ని చూసి, అతను మైమరిచిపోయినట్లు కనిపించాడు.
‘ఉన్న ఊరు, కన్నతల్లి ఒక్కలాంటివి అని చెబుతారు కదా బాబూ! అయినా మాకిక్కడ ఏ లోటూ లేదు. మాకు చాలా పశువులున్నాయి. కావాల్సినంత పచ్చిక ఉంది. మాకు సరిపడేంత ధాన్యం ఫలిస్తుంది. ఇంక ఇది నా కూతురు.. పేరు మిత్రవింద. దీనికి త్వరలో పెళ్లిచేయాలి’ అని చెప్పాను.
ఇంతలో గుర్రాలమీద పలువురు రాజభటులు వచ్చారు.
‘జయము జయము మహారాజా!’ అని అతనికి వందనం చేశారు.
అప్పుడు విచారించగా ఆయన వరాహ ద్వీపాధిపతి అని తెలిసింది. అతను తన పరివారం వెనుక వెళ్లడానికి ఇష్టంలేక నాలుగురోజులపాటు ఇక్కడే ఉండిపోయాడు. ఐదోరోజున నా కూతురిని గాంధర్వవిధిని వివాహమాడాడు.
నన్నుకూడా తనతోపాటు తమ ద్వీపానికి రమ్మని కోరాడు. కానీ నేను అంగీకరించలేదు. అప్పుడతను..
‘ఏ అవసరం వచ్చినా మమ్మల్ని మరిచిపోవద్దు’ అని చెప్పి నా కూతురిని తీసుకుని వెళ్లిపోయాడు.
అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్నాను.
ఒకనాడు ఇక్కడికో తాంత్రికుడు వచ్చాడు. అతని దగ్గర చాలా పశువులున్నాయి. వాటితోపాటు క్రూరమృగాలు ఉన్నాయి.
నేనతనికి అడ్డం వెళ్లాను.
‘బాబూ! నీ మృగాలు మా పశువులను బెదిరిస్తున్నాయి. కాస్త దూరంగా తోలుకువెళ్లు’ అని కోరాను.
అందుకతడు కన్నెర్ర చేస్తూ..
‘ఈ అడవిపై నాకు అధికారం ఉంది. నా ఇష్టం వచ్చినచోట నా మృగాలను తిప్పుకొంటాను’ అన్నాడు.
‘ఈ అడవిపై నీకు అధికారం ఉందని నువ్వు చెబితే.. నీ పశువులపై, మృగాలపై నాకు అధికారం ఉందని నేను చెబితే నీకు కోపం వస్తుందేమో! భగవంతుడి సృష్టి అందరికీ సమానం కదా!’ అని నేను చెప్పేసరికి అతనికి పెద్ద కోపం వచ్చింది.
నా నెత్తిపై ఏదో పసరుపూసి నన్నొక గుర్రంగా చేశాడు. ఆ తరువాత జరిగినవన్నీ స్వప్నప్రాయంగా ఉన్నాయి. ఇంతకాలానికి నువ్వు నాకు శాపవిమోచనం కలిగించావు. నా ఇంటికి మళ్లీ నేను నేనుగా తిరిగివచ్చాను. నీకు ఏం కోరినా ఇవ్వాలని ఉంది”..
అని ముసలమ్మ పలికిన మాటలు విని నాకు ఆశ్చర్యం కలిగించాయి.
“అవ్వా! పేదదానివి. ఈ కీకారణ్యంలో ఉన్నదానివి. నువ్వు నాకేం ఇవ్వగలవు?” అని అడిగాను.
అందుకామె..
“బాబూ! నా దగ్గిర కుబేరుని వద్దకూడా లేని ధనరాశులు ఉన్నాయి. ఇందాక మా కొట్టుగదిలోంచి వంటసామాన్లు తీసుకొచ్చాను కదా.. అలాగే నువ్వేం కోరినా తేగలను!” అని చెప్పింది.
నాకు ఆశ్చర్యం వేసింది.
“అవ్వా! ఈ సంగతి మరెవ్వరికీ చెప్పబోకు. నిన్ను దోచుకోగలరు” అన్నాను.
“బాబూ! నువ్వు ప్రాణదాతవు కనుక నీకు, అల్లుడు కనుక ఆ మహారాజుకు చెప్పాను. ఈ సంగతులు నా కూతురికి కూడా సరిగా తెలియవు” అన్నది అవ్వ.
..ఘోటకముఖుడు తన కథను ఇంకా కొనసాగించాడు.
(వచ్చేవారం.. అవ్వకుటీరం – వరాహపురం)
అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ