గెట్ వెల్ సూన్
రేపు పండగ సెలవు కావడంతో.. రేపటి పనులు కూడా ఈరోజే పూర్తి చెయ్యాల్సి రావడం వల్ల ఆఫీసు పనిలోనే అర్ధరాత్రి అయిపోయింది. రాత్రి పడుకోబోతూ.. ‘ఫోన్లో ఆ రోజుకు మిస్సయిన కాల్స్, మెసేజులు ఏముండాయా!?’ అని చూసుకుంటూండగా.. “విష్ యూ హ్యాపీ ఉగాదీ” అని అపార్ట్మెంట్ వాట్సాప్ గ్రూపులో టింగుమంటూ మెసేజ్ అలర్ట్ వచ్చింది.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో ప్రత్యేక బహుమతి పొందిన కథ.
రేపు పండగ సెలవు కావడంతో.. రేపటి పనులు కూడా ఈరోజే పూర్తి చెయ్యాల్సి రావడం వల్ల ఆఫీసు పనిలోనే అర్ధరాత్రి అయిపోయింది. రాత్రి పడుకోబోతూ.. ‘ఫోన్లో ఆ రోజుకు మిస్సయిన కాల్స్, మెసేజులు ఏముండాయా!?’ అని చూసుకుంటూండగా.. “విష్ యూ హ్యాపీ ఉగాదీ” అని అపార్ట్మెంట్ వాట్సాప్ గ్రూపులో టింగుమంటూ మెసేజ్ అలర్ట్ వచ్చింది.‘వార్నీ! పండగ రేప్పొద్దునైతే.. వీళ్లు అర్ధరాత్రే మొదలుపెట్టేసినారు ఆత్రగాళ్లు!’ అనుకునింది. దాదాపు ఇన్నూరు కుటుంబాలు కలిసి ఉండే అపార్ట్మెంట్ కాంప్లెక్స్. ఏదైనా అవసరమైన సమాచారం అపార్ట్మెంట్లోని అన్ని కుటుంబాల వాళ్లకూ ఒకేసారి తెలపడానికి వీలుగా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. కొత్తగా అపార్ట్మెంట్లో దిగినవాళ్ల నెంబర్లు దాంట్లో చేర్చడమూ, ఖాళీ చేసి పోయేవాళ్ల నెంబర్లు తొలగించడమూ.. రహ్మాన్ అనే అతను బాధ్యతగా చేస్తుంటాడు. ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా ఉండారు కాబట్టి.. మెసేజులు చాలావరకూ ఇంగ్లీషులో, ఎప్పుడన్నా హిందీలో ఉంటాయి. మెసేజులూ, పర్సనల్ మెయిల్సూ చూసుకుని ఫోన్ పక్కన పెట్టేసేలోపు.. అదే గ్రూపులో ఇంకొక మెసేజ్.
“హ్యాపీ ఉగాది టు ఆల్. ఉగాది పచ్చడిలోకి వేపపూత ఎక్కడ దొరుకుతాదో చెప్పగలరా?”.
“పొద్దున్నే లేచి గేటుదాకా పోయి, బయటికి తొంగిచూస్తే.. బండ్ల మీద పెట్టుకుని అమ్ముతా ఉంటారు. ఉగాది రోజు మాత్రమే!”.. ఇంకెవరో బదులిచ్చినారు.‘ఎవరబ్బా ఈ 24*7 పరోపకార పరాయణులు?’ అనుకుని చూస్తే.. రహ్మాన్! గ్రూపులో చేర్చమని అడ్మిన్లకు ఏదైనా నంబరిస్తే.. ‘ఏ ఫ్లాటు?’ అని వెంటనే అడిగేది రహ్మానే. ఏదైనా ఫ్లాట్ నంబరు చెప్పగానే ఆ ఫ్లాటు నుంచి ఓనరు, టెనెంట్లలో ఎవరెవరు గ్రూపులో ఉన్నారో ఎవరెవరు లేరో గడగడా అప్పజెప్పగలిగేదీ రహ్మానే. స్థానికంగా గానీ నగరస్థాయిలో గానీ, అందరికీ వర్తించే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమాచారం గానీ అందరికంటే ముందు పోస్ట్ చేసేది రహ్మానే. దాదాపు ప్రతి గ్రూపులో గుడ్డిగా ఫార్వర్డులు చేసి తమ బాధ్యత తీరిపోయిందనుకునే ఎత్తిపోతల మోటార్లు చాలానే పనిచేస్తుంటాయి గానీ రహ్మాన్ అట్లా కాదు. ఆకుకూరల అంగడి దగ్గర్నుంచి ఆధార్ కార్డు సెంటర్ దాకా.. ఎప్పుడు ఎవరు ఏ సమాచారం అడిగినా వెంటనే రిప్లయిలిచ్చేది రహ్మాన్ ఒక్కడే! మరుసటిరోజు పొద్దున్నే ఇంట్లో ఎవరూ లేవకముందే స్నానం చేసి, ఉగాది పచ్చడి కోసం పచ్చి మామిడితో కుస్తీ పడుతుండగా, యోగా గ్రూపులో మెసేజ్.. “రావడం లేదా?” అంటూ.
‘అప్పుడే టైమైందా?’ అనుకుంటూ బాల్కనీ మీదుగా తొంగిచూస్తే.. క్లబ్‌హౌస్‌లో యోగా బ్యాచ్‌లో కొందరు సూర్య నమస్కారాలు చేస్తూ కనబడినారు. “పండగ కదా! పని ఉంది. ఈరోజు రాలేను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు!” అని రిప్లయ్ ఇస్తుండగా.. కామన్ గ్రూపులో ఎవరో ఉర్దూ మాదిరి కనబడే లిపిలో ఏదో మెసేజ్ పెట్టినారు. దానితోబాటు మసీదు మినార్లు, నెలవంక, ఇతర బొమ్మలు ఉన్నాయి. ‘ఎవరబ్బా!?’ అని చూస్తే.. పంపినవాళ్ల నెంబరు ఎదురుగా షాదాబ్ అని ఉంది. ఈ పేరు ఇంతకు ముందెప్పుడూ వినలేదు. ఇతనెవరో కొత్తగా వచ్చినట్టున్నాడు. వెంటనే ఇంకొకరు.. “మతపరమైన పోస్టులు గ్రూపులో నిషిద్ధం” అని పోస్ట్ చేసినారు.‘ఏ మెసేజ్ వచ్చినా తక్షణమే రిప్లయ్‌లు ఇస్తా ఉంటారు. వేరే పనీ పాటా ఏమీ ఉండవేమో!’ అనుకుని ఫోన్ పక్కన పడేసి, తన పనిలో పడిపోయింది.
పూజ పూర్తిచేసుకుని ఫోన్ తీసి చూస్తే..
“ఆ మెసేజులో ఉన్నది ‘రంజాన్ ముబారక్’ అని మాత్రమే. గూగుల్ లెన్స్‌లో కూడా చూడొచ్చు. పండగ శుభాకాంక్షలు నిషిద్ధం కాదనుకుంటాను” అని షాదాబ్ రిప్లయ్ ఇచ్చి ఉన్నాడు.
ఆ వెంటే నలుగురైదుగురు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి ఉన్నారు. అది చూసి.. ‘ఓహో! రంజానూ, చైత్రమాసమూ ఒకటేనా? కానీ, వాళ్ల కేలండర్లో మొదటి నెల రంజాన్ కాదనుకుంటా. మరి వాళ్ల కొత్త సంవత్సరమెప్పుడో?’ అనుకున్నది. ‘నిషిద్ధం!’ అని పోస్ట్ చేసినతని నుంచి ఉలుకూ పలుకూ లేదు. మధ్యాహ్నం నుంచి పండగ మెసేజుల హోరు తీరాన్ని దాటి తగ్గుముఖం పట్టింది. సాయంత్రం పిల్లలు కరాటే క్లాసుకు పోయినారు. క్లాసులు క్లబ్ హౌసులోనే కాబట్టి ఫోన్ పట్టుకుని బాల్కనీలో కూర్చుంటే.. వాళ్ల ప్రాక్టీస్ కనబడతానే ఉంది. మొదట్లో ఈ కరాటే క్లాసులు బ్లాక్ వెనుక పక్కన ఉన్న ఖాళీ స్థలంలో నడిచేవి. తరచూ వానలు పడుతూ ఉండటం వల్ల అక్కడినుంచి క్లబ్ హౌస్‌కు మార్చినారు. ఆ టైమ్‌లో వచ్చిన ఇంకొక మెసేజు గ్రూపులో చిన్నపాటి కలకలాన్నే సృష్టించింది.
షాదాబ్ : డియర్ కోర్ కమిటీ! పనిదినాల్లో ఏయే సమయాల్లో క్లబ్‌హౌస్ బుక్ చేసుకోవచ్చో తెలుపగలరా? పిల్లలు అరబిక్/ఉర్దూ నేర్చుకోవడానికి రోజూ ఒక గంటసేపు బుక్ చేద్దామనుకుంటున్నాను. ప్రస్తుతం మౌలానా రోజూ ఇంటింటికీ తిరిగి ఒక్కొక్క ఇంట్లో విడివిడిగా నేర్పుతున్నారు. అందర్నీ ఒకేచోట చేర్చి ఒకేసారి నేర్పడం సౌకర్యంగా ఉంటాది. అందరికీ టైమ్ కలిసొస్తాది. ఇప్పుడు నేర్చుకుంటున్న పిల్లలే గాకుండా ఆసక్తి ఉన్నవాళ్లెవరైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్లతో కలిసి నేర్చుకోవచ్చు.వెంటనే మెసేజుల ప్రవాహం మొదలైంది.
నీలేశ్ : హలో షాదాబ్! తప్పుగా తీసుకోవద్దు. క్లబ్‌హౌస్, ఇతర ఫెసిలిటీస్ సొసైటీ మొత్తానికీ చెందుతాయి. ఈ క్లాసులు నాలుగైదు రోజులకు పరిమితమైతే ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉండదనుకుంటా! కానీ, అందరి మనోభావాలనూ మనం గౌరవించాలి కాబట్టి.. ఈ క్లాసులను ఎక్కువ రోజులు పొడిగించకుండా ముగిస్తే మంచిదని నా ఉద్దేశం.
‘మనోభావాలు’ అని చూడగానే చివుక్కుమంది. అంత సులభంగా ఎట్లా అనేస్తారో మనోభావాలు దెబ్బతింటాయని! వాళ్లేదో భాష నేర్చుకుంటే వీళ్ల మనోభావాలకు ఏమైంది? అయినా వాళ్లు అడుగుతున్నది క్లబ్‌హౌస్ బుక్ చేసుకోవడం గురించి. ‘గంటా, అరగంటా బుక్ చేసుకునే వీలు లేదు. కావాలంటే రోజుకు 1500 రూపాయలు కట్టి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు బుక్ చేసుకోండి’ అని ఉన్న విషయం చెప్పేస్తే పోదా? ఈ రచ్చ దేనికి?
షాదాబ్ : ఇది ఎవరికీ వ్యతిరేకమూ కాదు, ఏ కొందరికో పరిమితమైందీ కాదు. ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరైనా నిరభ్యంతరంగా చేరవచ్చు. నేను అడుగుతున్నది పిల్లలకు కనీసం నాలుగు ముక్కలు వంటబట్టే వరకే!
నీలేశ్ : తప్పకుండా! నేను కాదనడం లేదు. నేను దానికి వ్యతిరేకమూ కాదు. నేననేదల్లా క్లాసులు ఎక్కువ రోజులు పొడిగించవద్దని మాత్రమే. రేపు ఇంకెవరో వచ్చి రోజూ కొంతసేపు వాడుకుంటామని అంటారు. ఫెసిలిటీస్ ఉన్నది ఏవైనా ఈవెంట్స్ నిర్వహించుకోవడానికే!
షాదాబ్ : మీరనేది నాకు పూర్తిగా అర్థమైంది. ఏ ఈవెంట్సూ లేని రోజుల్లో పార్టీ హాలు ఖాళీగానే ఉంటాది కాబట్టి.. పాఠాలు చెప్పుకొంటే నష్టమేమీ లేదు కదా?
నీలేశ్ : నేను నిర్ణయం కోర్ కమిటీకే వదిలేస్తున్నాను. ఒక్క ఉదాహరణ మాత్రం చెప్తాను.. నేను ట్యూషన్లు చెప్పాలనుకుంటే రోజూ క్లబ్‌హౌస్‌లో పిల్లలకు క్లాసులు చెప్పుకోవచ్చా? దానికి అందరూ సమ్మతిస్తారా?
షాదాబ్ : అపార్ట్మెంట్ వాసుల ప్రయోజనార్థం మీరేవైనా క్లాసులు నడపదలచుకుంటే అదీ మేలే కదా? అట్లా కాకుండా మీరు ఆదాయం కోసం అపార్ట్మెంట్ ఫెసిలిటీస్ వాడుకోవడం గురించి అడుగుతున్నట్లయితే.. అది వేరే టాపిక్. ఖాళీగా ఉన్న ఫెసిలిటీస్ ఎవరికి ఏ రూపంలో ఉపయోగపడినా మేలే అన్నది నా అభిప్రాయం.
మనోజ్ : క్లబ్‌హౌస్ ఉండేది ఫంక్షన్స్ చేసుకోవడానికి. దాన్నొక స్కూల్ వెన్యూగా మార్చకండి.
సంతోష్ : మంచిమాట చెప్పారు. క్లబ్‌హౌస్ ఉండేది కల్చరల్ ఈవెంట్స్ లేదా సోషల్ ఈవెంట్స్ జరుపుకోవడానికి మాత్రమే! అది కూడా నిర్ణీత దినాల్లోనే. మిగతా రోజుల్లో ఫ్యామిలీ ఫంక్షన్ల కోసం ఎవరికి కావాలంటే వాళ్లు బుక్ చేసుకుంటారు. కామన్ ఫెసిలిటీస్‌ను సెంటిమెంట్స్‌తో ముడిపడిన, నిరవధికంగా నడిచే మతపరమైన బోధనలకు వేదికగా వాడనేకూడదు.
ఆ మెసేజ్ చూడగానే ఒళ్లు మండింది.
వాళ్లు భాష నేర్పడానికి అంటుంటే.. మతాన్నెందుకు మధ్యలోకి లాగుతారు? నిరవధికంగా క్లాసులు నడపడానికి వాడొద్దంటారు. ఒకపక్క అదే క్లబ్‌హౌస్‌లో సాయంత్రాలు పిల్లలకు నిరవధికంగా కరాటే క్లాసులు జరుగుతున్నాయి. ఇంకొక పక్క అదే క్లబ్‌హౌస్‌లో పొద్దున పూట మహిళలకు నిరవధికంగా యోగా క్లాసులూ నడుస్తున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు డ్యాన్సు, స్కిట్ ప్రాక్టీసులూ అక్కడే జరుగుతాయి.. వారాల తరబడి.
తెలుగు రాకపోవడం వల్ల పనిమనుషులు, ఇతర స్థానికులతో మాట్లాడ్డానికి కష్టపడుతున్న నార్త్ ఇండియన్స్‌కు ‘30 రోజుల్లో తెలుగు’ తరహాలో ఔత్సాహికులైన తెలుగు సోదరులు తీసుకున్న స్పోకెన్ తెలుగు ఇన్ఫార్మల్ క్లాసులైతే ఏకంగా జిమ్‌లోనే జరిగినాయి. గట్టిగా మాట్లాడితే అక్కడ వ్యాయామం తప్ప ఏ ఇతర కార్యక్రమాలూ చెయ్యకూడదు. అయినా అప్పుడెవరూ అడ్డు చెప్పలేదు. క్లబ్‌హౌస్‌లో నలుగురు కలిసి చేసుకునే పని దేనికైనా అభ్యంతరం ఉండకూడదు. అట్లాటిచోట ఇప్పుడీ అభ్యంతరాలేంది కొత్తగా? “మతపరమైన బోధనలకు అభ్యంతరం అంటున్నవాళ్లు రేపు ఏ స్వామీజీ ప్రవచనాలో అదే క్లబ్‌హౌస్‌లో రోజూ కాసేపు పెడితే నిజంగా అభ్యంతరపెడతారా? లేక కరాటే క్లాసులు, యోగా క్లాసులు నడుస్తూ ఉండటాన్ని సాకుగా చూపి అనుమతిస్తారా?”.. అని రాయబోతూ ఉండగా ఇంకో మెసేజ్ వచ్చింది.
షాదాబ్ : ఈ క్లాసుల వల్ల ఏ రకమైన సమస్య వస్తాదో అర్థం కాకపోయినా.. కొందరికి అసౌకర్యంగా ఉందని మాత్రం అర్థమైంది. కాబట్టి ఆ ప్రతిపాదన విరమించుకుంటున్నాను. ఈ చర్చ ఇంతటితో ముగిద్దాం.
ప్రతి మెసేజుకూ ప్రతిస్పందించే రహ్మాన్ లాంటివాళ్లు ఈ చర్చలో కలగజేసుకోక పోవడం రవంత ఆశ్చర్యమనిపించింది. ఇట్లాంటి విషయాలకు గ్రూపులో ఎవరు ఏ విధంగా స్పందిస్తారో, చివరికి ఏమైతాదో ముందే తెలుసు కాబట్టా?.. ఏమైనా చర్చ ఆ రకంగా ముగియడం అసంతృప్తిగా అనిపించింది. వాడుకోనిస్తే ఏం పోయేదనే భావన కంటే.. ‘అన్ని రకాల క్లాసులూ నడుస్తున్నప్పుడు ఆ ఒక్క క్లాసులకే కుంటిసాకులు చెప్పి అడ్డుపుల్లలు వెయ్యడం’ అన్యాయం అనిపించింది. ఆర్నెల్ల కిందట ఏం జరిగిందీ!? గుర్తొచ్చి డిస్టర్బ్డ్గా అనిపించింది. ఇప్పుడు జరుగుతున్నది ఏమైనా వేరుగా ఉందా!? అన్న సందేహమూ కలిగింది.
* * *
“ఈసారి మన సొసైటీలో వినాయక చవితి సంబరాలు ఫలానా రోజున జరపాలనుకుంటున్నాం. అందరం మనస్ఫూర్తిగా పాల్గొని జయప్రదం చేద్దాం. ఏమేం చెయ్యాల, ఎట్లా చెయ్యాల? అనే విషయంలో అందరి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నాం”..
అని నిరుడు వినాయక చవితి ఇంకా నెల రోజులు ఉందనగా, ఒక శుభ ముహూర్తాన అదే గ్రూపులో మెసేజ్ వచ్చింది.నాటి నుంచి సాంస్కృతిక కార్యక్రమాల షెడ్యూల్ నిర్ణయించడం, దేంట్లో ఎవరెవరు పాల్గొంటున్నారో, పాల్గొనని వాళ్లను దేంట్లో ఎట్లా ఇన్వాల్వ్ చెయ్యాలో.. అనే ప్లాన్లతో, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంతో హడావుడి మొదలైంది. ‘అంతా బాగానే ఉందిగానీ.. ఇంతకూ విగ్రహాన్ని ఎక్కడ పెడతారో!? అసలే వానలు పిలవకపోయినా అనుకోని అతిథిలా వచ్చి తిష్ఠవేసే రోజులు. వానకు తడవని కామన్ ప్లేస్ ఏదైనా ఉందీ అంటే.. అది క్లబ్హౌసే!’ అనుకుంటూ ఉండగా, నాలుగు రోజుల తర్వాత ఊహించని కోణంలో వివాదం మొదలైంది.
రహ్మాన్ : చందాలు ఇచ్చేవాళ్ల మతాన్ని కొంతమంది పట్టిపట్టి చూస్తున్నారు. అట్లాటివాళ్ల పొడ నేను సహించలేను. ఇకమీదట ఇలాంటి ఏ ఈవెంట్స్‌లోనూ నేను పాల్గొనను. థ్యాంక్యూ!
వికాస్ : ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. మన సొసైటీలో ఇలాంటివి ఎంకరేజ్ చెయ్యకూడదు..
కులశ్రేష్ఠ : ఇట్లాటి చర్చలు జరగడం బాధాకరం. ఇట్లాటి కంట్రిబ్యూషన్లన్నీ కులం, మతం, ప్రాంతం, మత విశ్వాసాలకు అతీతంగా, స్వచ్ఛందంగా చేసేవి. మన సొసైటీలో ఇట్లాటి ఈవెంట్స్‌ను ఘనంగా సెలెబ్రేట్ చెయ్యడానికి ఏ ఈవెంట్‌కైనా, ఎవరైనా సహకారం అందించవచ్చు. వివక్ష చూపే వాళ్లకు నేను చెప్పేదల్లా.. గెట్ వెల్ సూన్.
మనోజ్ : పూర్తిగా అంగీకరిస్తాను. ఆ రకమైన ఆలోచనలేవైనా ఉంటే మన అద్భుతమైన సొసైటీకి బయటే ఉంచుదాం. సెలెబ్రేషన్స్‌లో అందరూ కలుస్తారని ఆశిస్తున్నాను. ‘ఆ షేక్ హ్యాండ్ ఎవరికి? షేక్ రహ్మానుకా?’ అర్థం కాలేదు.
వికాస్ : అసలు ఈ ఈవెంట్స్ జరుపుకోవడానికి మూల కారణమే.. అందరూ కలిసి సంతోషంగా గడపాలని. దానికి బదులు ఇటువంటి చర్చలకు దారి తీసేటట్లయితే అసలు ఈవెంట్సే క్యాన్సిల్ చెయ్యడం మేలు.‘ఇతను ఎవరోగానీ మంచిమాట చెప్పారు’ అనిపించింది.ఆది : కొందరు ఇంకా అటువంటి దృష్టితో ఆలోచించడం బాధాకరం. ఆ పని చేస్తున్నవాళ్ల పేర్లు బహిరంగంగా వెల్లడి చెయ్యండి. వాళ్లకు సిగ్గురావడమే గాక భవిష్యత్తులో అందరికీ ఒక హెచ్చరికగా ఉంటాది. వాళ్ల కోసం మనం సంబరాలు ఆపుకోవలసిన పనిలేదు.
ప్రణయ్ : మనమందరం ఇక్కడొక కుటుంబంలాగ నివసిస్తున్నాం. అదే డిగ్నిటీని మెయిన్‌టెయిన్ చేద్దాం. మళ్లొక్కసారి #గెట్ వెల్ సూన్ ఆ ఎమోజీ ఉద్దేశం అసలు అర్థం కాలేదు. చిరునవ్వుతో పరిష్కారమయ్యే సమస్యా అది? పర్యవసనాల కోసం ఎదురుచూసింది. కానీ, ఆ తర్వాతెవరూ దాని గురించి ప్రస్తావించనే లేదు.ఎట్టకేలకు వినాయక చవితి రానే వచ్చింది. పండగ హడావుడి ముందురోజు రాత్రి నుంచే మొదలైంది. ఆడా – మగా, పిల్లా – జెల్లా కలిసి తలా ఒక పని అందుకుని, క్లబ్‌హౌస్‌ను శుభ్రం చేసి.. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించి, పూలల్లి, ఒక పక్కన విగ్రహానికి వేదిక ఏర్పాటుచేసి, నేలంతా రంగురంగుల ముగ్గులేసి ముచ్చటపడ్డారు. తెల్లవారగానే విగ్రహం తెచ్చిపెట్టి పూజ చేసినారు. ఇంట్లోకి కూడా చిన్న మట్టిబొమ్మ తెచ్చి నవకాయ పిండివంటలు సిద్ధం చేసి వినాయక వ్రతం చేసి.. బింగుళ్లు పెట్టి అక్షితలు చల్లుకునేసరికి ఎప్పటిలాగే మధ్యాహ్నమైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది తొలి వినాయక చవితి. మట్టిబొమ్మను ఎక్కడ నిమజ్జనం చెయ్యాలో తెలియలేదు. గ్రూపులో అడిగీ అడగ్గానే సమాధానం వచ్చింది.
కార్పొరేషన్ వాళ్లు దానికోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ ట్యాంకులు ఏ సమయంలో ఎక్కడెక్కడ ఉంటాయో.. ‘ఇచ్చిందెవరా!?’ అని చూసింది. రహ్మాన్! థ్యాంక్స్ చెప్పి, మత వివక్ష సమస్య సమసి పోయిందనుకుని సంతోషించింది.సాయంత్రం హారతికి రమ్మని వాట్సాప్‌లో పిలుపు. ఇక అప్పట్నుంచి పది రోజులు.. పొద్దునా, సాయంత్రం పూజలు, మంత్రాలు, ప్రసాదాలు జోరుగా సాగినాయి.
కొందరున్నారు.. ఫేస్బుక్ సహా ఎక్కడైనా సరే, ఏ దేవుని బొమ్మైనా కనబడటం ఆలస్యం.. పడిపడి పొర్లుదండాలు పెట్టేస్తుంటారు. వాళ్లు వాట్సాప్ గ్రూపులో రోజూ పొద్దున లేచిన దగ్గర్నుంచీ..
“గణపతి బప్పా మోరియా” అని నినాదాలు, శ్లోకాలు, స్తోత్రాలు, అష్టోత్తరాలు, దండకాలు మొదలు పెట్టేశారు. ఇక ఆ పది రోజులూ ఆడియోలు, వీడియోలు, జిఫ్ఫులు, టెక్ట్స్ మెసేజులతో హోరెత్తిపోయిన వాట్సాప్ గ్రూపు కాస్తా.. వర్చువల్ వినాయక మండపం అయిపోయింది.
ఆ పది రోజులూ గ్రూపులో ‘మతపరమైన మెసేజులు నిషిద్ధం’ అని ఎవరూ గుర్తుచెయ్యలేదు.ఎదుటివాళ్లు తమ మతానికి సంబంధించిన మెసేజులు పోస్ట్ చేసినప్పుడల్లా అడ్డుచెప్పేవాళ్లే.. ఇప్పుడు మరింత ఉత్సాహంగా అదే రకమైన పోస్టులు గంటకొకసారి పోస్టు చెయ్యడం విస్తుపోయి చూస్తూ ఉండిపోయింది.ఇక నిమజ్జనం రోజైతే కోలాహలం మిన్ను ముట్టింది. ఆగస్టు పదైదు నాడు అదేచోట ముందుండి జెండా పండగ ఏర్పాట్లు చేసిన రహ్మాన్.. ఈ సెప్టెంబర్ సందడిలో జాడ లేకపోవడం గురించి ఎవరిని అడగాలో తెలియలేదు. విరిగింది వినాయకుడి దంతం మాత్రమే కానట్టు, వినాయకుడి పొట్టమీద పాము కుట్లు సరిగా అతుక్కోనట్టు.. చవితి రోజు చూడొద్దన్న నెలవంకకు వేరే అర్థమున్నట్టు అనిపించి, మనసు అదోలా అయిపోయింది.
త్రివిక్రమ్
ఇంటర్నెట్లో యూనికోడ్ తెలుగు వ్యాప్తికి విశేషంగా కృషిచేసిన తొలితరం తెలుగు బ్లాగర్లలో త్రివిక్రమ్ ఒకరు. స్వస్థలం కడప సమీపంలోని పడిగెలపల్లె. ఎంసీఏ చేసి, సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. 2007లో ఏర్పడిన ఈ-తెలుగు సంస్థకు తొలి ఏడాది వ్యవస్థాపక ఉపాధ్యక్షుడిగా, 2006 – 2014 మధ్య తెలుగు వికీపీడియా నిర్వాహకుడిగా పనిచేశారు. 2006లో ప్రారంభమైన ‘పొద్దు’ తెలుగు వెబ్ మ్యాగజైన్ వ్యవస్థాపక సంపాదకుడిగా నాలుగేళ్లు, 2016 – 2019 మధ్య ‘ఈమాట’ సహ సంపాదకుడిగా మూడేళ్లు వ్యవహరించారు. చందమామలో ‘శాస్త్రజ్ఞానం – లోకజ్ఞానం’, చతురలో ‘మినీ కథలు’ ప్రచురితం అయ్యాయి. ‘అద్దంలో మూట’ కథ.. ‘నమస్తే – ముల్కనూరు’ కథల పోటీల్లో ప్రత్యేక బహుమతి పొందింది. వాస్తవ ఘటనల ఆధారంగా రాసిన ఈ ‘గెట్ వెల్ సూన్’ కథను ‘కేతు విశ్వనాథరెడ్డి’కి అంకితమిస్తున్నట్లు రచయిత ప్రకటించారు.
-త్రివిక్రమ్
g.trivikram@gmail.com
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

