“అదుగో.. ఆ ఫొటో ఉందిగా మా నలుగురిదీ. నా మొదటి జీతం వచ్చాక నలుగురం స్టూడియోకి వెళ్లి తీయించుకున్నదది.ఇంతపెద్ద ఫ్రేమ్ చూసి మా అమ్మ అడిగింది. ‘ఇప్పుడెందుకు రా ఇది’ అని. ‘ఉండాలి’ అన్నాను. నాన్న నవ్వారు. అప్పటి నుంచి చివరి క్షణం వరకూ ఆ నవ్వు చెరిగిపోనివ్వకుండా చూసుకున్నాను”
నేడు కుర్చీ విరిగిపోయింది..! మనసే విరిగినట్లు బాధపడ్డాడు మూర్తి. “క్షమించండి సర్! ఇలా జరుగుతుందని అనుకోలేదు. అది మీకు ఎంత విలువైందో మాకు అర్థమవుతున్నది. మా పేమెంట్‌లో ఆ ఎమౌంట్ తగ్గించి ఇవ్వండి” అన్నాడు ప్యాకర్స్ అండ్ మూవర్స్ మేనేజర్.
“వస్తువు విలువ తెలుసు మీకు. జ్ఞాపకం విలువ తెలుస్తుందా..?” విచారంగా అడిగాడు మూర్తి.“ఏమయింది నాన్నా?” అంటూ లోపలిగదిలో నుంచి హాల్లోకి వచ్చిన రవీంద్ర.. హాల్ మధ్యలో విరిగిపడున్న కుర్చీని చూసాడు. ఒక కాలు, ఆర్మ్ రెస్ట్ విరిగి, మంచం పట్టిన ముదుసలిలా ఉందది. రవీంద్ర వెనుకే వచ్చిన అతని భార్య అనుపమ, ఆరేళ్ల పాప అభిజ్ఞకూడా విరిగిన కుర్చీని చూస్తూ దూరంగా నిల్చున్నారు.
“అయినా ఇది నీవల్ల కదా జరిగింది. నీకు ముందే చెప్పాను, ‘ఇది ఉండాలి’ అని. ఇల్లు మారినప్పుడు జాగ్రత్తగా తీసుకురావాలని తెలియలేదా..!” అంటూ రవీంద్రను కోపగించుకున్నాడు మూర్తి. కోపగించుకున్నాడే గానీ, అతని కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి.ఎప్పుడో పదేళ్ల క్రితం అమ్మ చనిపోయినప్పుడు నాన్న కళ్లల్లో నీళ్లు చూశాడు రవీంద్ర. మళ్లీ ఇప్పుడు తండ్రిని అలా చూసేసరికి ఏమనాలో అర్థం కాలేదతనికి. తను ఎప్పుడు ఏడ్చినా ఆడించి నవ్వించే తాతయ్య, ఇప్పుడు బాధపడుతూ కనిపించడంతో భయపడి చూస్తున్నది అభిజ్ఞ. విషయం అర్థమయిన అనుపమ..“మావయ్యా, రండి!” అంటూ మూర్తి చేయి పట్టుకుని, డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకువెళ్లి కూర్చోబెట్టి, తాగడానికి మంచి నీళ్లు ఇచ్చింది.
“వియ్ ఆర్ వెరీ సారీ సర్! ట్రక్‌లోకి ఎక్కించాక, కింద కుర్చీ ఉందని గమనించక, పైన బరువైన వస్తువేదో మోపినట్లున్నారు మా కుర్రాళ్లు” రవీంద్రకు చెబుతున్నాడు మేనేజర్.
వారం క్రితం పాలు పొంగించి వ్రతం చేశారు. ఈ రోజు షిఫ్టింగ్. నగరంలోని ప్రైమ్ లోకేషన్లో, పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ కట్టించిన అపార్ట్మెంట్ అది. మూడు పడకగదుల ఫ్లాట్. పెద్ద ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీకి మొత్తం వర్క్ కాంట్రాక్ట్‌కి అప్పగించాడు రవీంద్ర. అలంకరణలతోపాటు మంచాలు, సోఫాలు, డైనింగ్ టేబుల్, కబోర్డ్స్ వంటి ఫర్నీచర్ వర్క్ అంతా కూడా వాళ్లే చూసుకుంటున్నారు. పాత ఫర్నీచర్ ఆన్లైన్లో అమ్మేసారు. జ్ఞాపకాలుగా ఉన్న కొన్ని వస్తువులను మినహాయించి, మిగతావాటి విషయంలో పిల్లల ఇష్టానికి మూర్తి కూడా అడ్డు చెప్పలేదు.
కుర్చీ గురించి కూడా చర్చ జరిగింది.“ఇప్పుడు ఆర్డర్ ఇస్తే నాలుగు రోజుల్లో యాంటిక్ డిజైన్లోనే కొత్త కుర్చీ తయారు చేసి ఇస్తారు నాన్నా!” అన్నాడు రవీంద్ర.“లేదు లేదు. ఇది ఉండాల్సిందే!” అన్నాడు మూర్తి. అంతగా పట్టుబట్టిన ఆ కుర్చీ, మూర్తి వాళ్ల తాతది. వాళ్ల తాత మిగిల్చిన ఆస్తి అది.
మధ్యాహ్నానికి షిఫ్టింగ్ పూర్తయితే, క్లీనింగ్ కంపెనీ వాళ్లొచ్చి సాయంత్రానికల్లా సామాన్లన్నీ సర్ది, ఇల్లు శుభ్రం చేసి వెళ్లిపోయారు. యాప్‌లో భోజనం ఆర్డరిస్తే, పది నిమిషాలలో ఇంటికొచ్చేసింది. భోజనాలయ్యాక పాపను నిద్రపుచ్చడానికి అనుపమ తీసుకువెళ్తే.. రోజంతా ముభావంగానే ఉన్న మూర్తితో మాట్లాడడానికి రవీంద్ర అతని గదికి వెళ్లాడు.గోడకు తగిలించిన పెద్ద ఫొటో ఫ్రేమ్ వైపు చూస్తూ మంచం మీద కూర్చున్నాడు మూర్తి. తనకు ఉద్యోగమొచ్చిన కొత్తలో తన తల్లిదండ్రులు, చెల్లెలితో కలిసి మూర్తి తీయించుకున్న ఫొటో అది.ఎలా మాట కలపాలో అర్థం కాక, రవీంద్ర కూడా తండ్రి పక్కన వచ్చి మౌనంగా కూర్చున్నాడు.కాసేపటికి మూర్తే అడిగాడు..“అయిపోయాయా పనులన్నీ?” అని.‘హమ్మయ్యా!’ అని మనసులో అనుకుంటూ..“అయిపోయాయి నాన్న! అందరికీ పేమెంట్లు కూడా ఇచ్చేశాను” చెప్పాడు రవీంద్ర.“మా చిన్నప్పుడు ఇల్లు మారడమంటే ఎంత పెద్ద పని! అన్నీ సర్దుకుని మళ్లీ ‘ఇల్లు’ అన్న భావన రావడానికి కనీసం పది, పదిహేను రోజులు పట్టేది. మా అమ్మకి అయితే క్షణం కూర్చోవడానికి కూడా తీరిక లేనంత పనుండేది ఆ పది రోజులూ. ఇప్పుడన్నీ క్షణాల్లో అయిపోతున్నాయి” అన్నాడు మూర్తి.
“ఎక్కువసార్లు మారాల్సి వచ్చేదా?” అడిగాడు రవీంద్ర.“హా! సొంత ఇల్లు లేదుగా! మా నాన్నకు స్థిరమైన ఉద్యోగం లేదు. చిన్నచిన్న ఉద్యోగాలేవో చేస్తూ, మారుతూ, చేస్తూ, మారుతూ ఉండేవారు. మారినప్పుడల్లా ఇల్లు మారడం. అవి కూడా చాలా చిన్న ఇళ్లు. చాలావరకూ రెండు గదులకు మించి ఉండేవి కావు. ఈ గోడ చివరన ఒకరు పడుకుంటే, ఆ గోడ చివరన నాలుగో వ్యక్తి పడుకునే అంత విశాలం! మాకే చోటు సరిపోయేది కాదంటే, ఇంకా మా తాత సామాను కొంత! నేను పుట్టకముందే ఆయన కాలం చేశారు. అయినా మా నాన్న ఆయన సామాన్లు ఉంచారు. చిల్లులు పడ్డ ఖాదీ పంచెలు, పసుపు రంగులోకి మారిన కాగితాలుండే పుస్తకాలు, సగం చిరిగిన ఫొటోలూ, సిల్క్ శాలువా, ట్రంకు పెట్టె, చెక్క కుర్చీ, పాడయిపోయిన రేడియో.. ఇలాంటివి.
‘ఎందుకీ పాత సామాను అంతా.. విసిరేయకుండా!’ అని విసుక్కునేవాడిని నాన్న మీద. ఆయన నవ్వి.. ‘ఉండాలివి’ అనేవారు”
“ఇప్పుడు మేము అంటున్నట్లే కదా!” నవ్వుతూ అడిగాడు రవీంద్ర.“హా! అలాగే. కానీ, ఒకసారి ఎప్పుడో మేము ఖాళీ చేసిన ఇంటికి మరుసటి రోజు ఓనర్‌కి తాళాలు ఇవ్వడానికి వెళ్లాను. ఇచ్చేముందు ఇంట్లో ఏమయినా మర్చిపోయామేమో అని తాళాలు తీసి మరోసారి చూడమంది అమ్మ. తలుపు తీసి ఆ ఇల్లు చూస్తే, ఇదేనా నిన్నటి వరకూ మేమున్న ఇల్లు? అనిపించింది. ఆ రోజు అనిపించింది.. అమ్మ, నాన్న ఎక్కడుంటే, మన వస్తువులు ఎక్కడుంటే.. అదే మన ఇల్లు అని. వస్తువులతోనూ అనుబంధం ఉంటుందని నాకు ఆ రోజే తెలిసింది.ఆ తర్వాత, తాత పాత సామాన్లు చూసి చిరాకు రావడం పూర్తిగా పోయింది. రోజంతా కష్టపడి పనిచేసి వచ్చే నాన్న, సాయంత్రాలు తాత కుర్చీలోనే సేదదీరేవారు. నేను కొద్దిగా చిన్నోడిగా ఉన్నప్పుడు, నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని సరదాగా కథలు చెప్పేవారు. కొన్నిసార్లు మౌనంగా ఏదో ఆలోచిస్తూ కూర్చునేవారు. ఏమైనా ఇబ్బందులుండేవేమో! కానీ, చిన్న పిల్లలమని మాతో చెప్పేవారు కాదు. అయితే, నాన్నను అలా చూసినప్పుడల్లా, రోజంతా ఎంత కష్టపడినా.. ఈ ఇంటికి, మాకూ ఆయన మహరాజే కదా! అది ఆయన సింహాసనం కదా అని అనిపించేది.కాలం తుఫానులో అన్నీ కొట్టుకుపోయినట్లు, తాత పాత వస్తువులన్నీ ఒక్కొక్కటిగా పోయాయి. పంచెలు, పుస్తకాలు ఏమయిపోయాయో గుర్తు కూడా లేదిప్పుడు. స్పష్టంగా తాత ముఖం కనిపించే ఒక్క ఫొటోనూ ఎలుకలు కొరికేసాయని తెలిసిన రోజు.. నాన్న కళ్లల్లో మొదటిసారి నీళ్లు చూశాను. జ్ఞాపకాన్ని కూడా దాచుకోలేని దౌర్భాగ్యంలో మేమున్నామని నాకర్థమయిన రోజది”.. మూర్తి మాటలలోని గంభీరత్వం గది అంతా అలుముకుంది. అది మౌనంగా రవీంద్రనూ తాకింది.
“కష్టపడి చదువుకున్నాం” మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు మూర్తి.
“దేశం వృద్ధి, నైపుణ్యాల వైపు అడుగులు వేస్తున్న సమయానికి మా చదువులు పూర్తవ్వడం మా అదృష్టం. సమయానికి వచ్చిన ఉద్యోగం వేతనమిచ్చి, వేదన తీర్చింది”“అదుగో.. ఆ ఫొటో ఉందిగా మా నలుగురిదీ. నా మొదటి జీతం వచ్చాక నలుగురం స్టూడియోకి వెళ్లి తీయించుకున్నదది. ఇంతపెద్ద ఫ్రేమ్ చూసి మా అమ్మ అడిగింది. ‘ఇప్పుడెందుకు రా ఇది’ అని. ‘ఉండాలి’ అన్నాను. నాన్న నవ్వారు. అప్పటి నుంచి చివరి క్షణం వరకూ ఆ నవ్వు చెరిగిపోనివ్వకుండా చూసుకున్నాను” చిన్న నవ్వుతో గర్వంగా చెప్పాడు మూర్తి.ఏదో ఆలోచన మనసులో మెదిలింది రవీంద్రకు. సమాధానపూర్వకంగా నవ్వాడు.“ఉద్యోగమొచ్చి నేను సిటీకి వచ్చేసాక అమ్మ, నాన్నలను, నా దగ్గరికి వచ్చేయమంటే.. ‘నీకు వీలైనప్పుడల్లా, వచ్చి చూసుకుని వెళ్తూ ఉండు. ఊరు వదిలి మేము రాలేం!’ అన్నారు. నాకు తప్పక రావాల్సిన పరిస్థితి. అలా నేను వచ్చేసినప్పుడు.. ‘నా బదులు నా జ్ఞాపకంగా ఈ కుర్చీని తీసుకువెళ్లు’ అన్నారు నాన్న. ‘ఇది మీకు తాతయ్య జ్ఞాపకం కదా!’ అని నేనంటే… ‘అందుకే! అందులో నా జ్ఞాపకాలను కూడా కలిపి నీకు అప్పగిస్తున్నాను’ అన్నారు. అలా సిటీకి వచ్చి, నాకంటూ నేనో ఇల్లు తీసుకున్నాక.. ఆ ఇంటిలో మొదటి వస్తువు ఈ కుర్చీ. ఎప్పుడైనా సాయంత్రాలు ఖాళీ సమయం దొరికితే కాఫీ గ్లాసు చేతిలో పట్టుకొని, కిటికీ పక్కన కుర్చీ వేసుకొని, వీధిలోకి చూస్తూ కూర్చునేవాడిని. టీవీ, మొబైల్ ఫోన్లు మా వరకూ ఇంకా రాని ఆ రోజుల్లో.. అదో మంచి వ్యాపకం.
పెళ్లయ్యాక మీ అమ్మ, నేను మా అభిరుచికి తగ్గట్లు, చాలా వస్తువులు కొనుక్కున్నాం. కానీ, ఈ కుర్చీని మాత్రం ఓ ప్రత్యేకమైన వస్తువుగా, అలానే దాచుకున్నాం. పెళ్లయిన కొత్తలో ఈ కుర్చీలో కూర్చోని, ఏ పుస్తకమో, నవలో చదువుతూ, అలానే నిద్రపోయేది మీ అమ్మ. తనను అలా చూస్తూ ఎదురుగా కూర్చునే వాడిని నేను. ‘ఇలాంటి కుర్చీ ఇంకొకటి చేయించనా?’ అని ఓసారి అడిగితే.. ‘ఎందుకూ మన ఇద్దరికీ ఇది సరిపోతుందిగా!’ అంది”.. ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు మూర్తి.
“నువ్వు పుట్టాక మా నాన్న ఎలా అయితే, నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని కథలు చెప్పేవాడో.. నేనూ నిన్ను అలానే ఒడిలో కూర్చోబెట్టుకుని కథలు చెప్పేవాడిని. అలా, నా బాల్యపు జ్ఞాపకాలను నీ బాల్యానికి అందివ్వడానికి పనికొచ్చిందీ కుర్చీ.ఓ రోజు ఊరినుంచి ఫోన్ వచ్చింది. నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారని. నా ప్రపంచమంతా కూలిపోయిన భావన. గదిలో కూర్చోని, దుఃఖంతో ఏడుస్తున్నాను. నన్ను ఓదార్చలేక మీ అమ్మా కన్నీళ్లు పెట్టుకుంది. ఒక్కసారిగా బయట కుర్చీ చప్పుడైతే, నాన్నే వచ్చారా అన్నంత భ్రమతో.. ‘నాన్నా!’ అనుకుంటూ బయటకొచ్చాను. చూస్తే నువ్వు. నాలుగేళ్ల పిల్లాడివి. అమాయకంగా కుర్చీలో కూర్చోని ఆడుకుంటున్నావు. ఇకపై మాకంటూ మిగిలిన ప్రపంచం నువ్వే కదా! అనిపించింది”
మౌనం మరోసారి ఇద్దరినీ హత్తుకుంది.. బయటికి రాని కళ్ల నీళ్లకు మనసు తడిస్తే, తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు రవీంద్ర.
“కాలంతోపాటూ ఒక వస్తువు పాడయిపోవడమో, పాతదైపోవడమో కాదు రవీ.. మనలో భాగమైపోతుంది.
మన ఇంటిలో మరో మనిషి అయిపోతుంది. ఆనందాలకూ, దుఃఖాలకు మౌనంగా సాక్ష్యం వహిస్తూ, సమయానుకూలంగా ఓదార్పునో, ఉత్సాహాన్నో ఇస్తూ ఉంటుంది. తాత ఆ కుర్చీ వాడేటప్పుడు దానితో నాన్నకు ఏఏ జ్ఞాపకాలు ఉండేవో నాకు తెలీదు. కానీ నాకు మాత్రం చాలానే ఉన్నాయి. కుర్చీతో నాకున్న జ్ఞాపకాల విలువ ఎంత అంటే.. నా జీవితమంత! ఆ కుర్చీ మౌనంగా నా జీవితమంతా చూసింది. నాకు ఊహ తెలిసినప్పటినుంచీ నేటి వరకూ, నాకు అది రోజూ కనిపించే వస్తువు. అందుకే అది విరిగిందని తెలియగానే తట్టుకోలేకపోయాను”తన చేతిలో ఉన్న తండ్రి చేతిని నుదిటికి అద్దుకుంటూ..“క్షమించు నాన్నా! ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించానా? అనిపిస్తుందిప్పుడు! ఇంకొంచెం బాధ్యతగా ఉండాల్సింది” అన్నాడు రవీంద్ర.
క్షణమాగి..“సరేలే.. కాలం తుఫానులో అదీ పోయిందనుకుందాం” అని తేలికగా అన్నాడు మూర్తి, కొడుకు భుజం తడుతూ. తర్వాత చెప్పాడు..
“మనం చాలా సాధారణ మనుషులం రవీ! ఆర్డినరీ మనుషులకు తాతలు, తండ్రుల సంపదో, పూర్వికుల లెగసీలో ఉండవు. తమతోపాటూ ముందుకు తీసుకువెళ్లడానికి. ఒక ఫొటోనో, ఒక గుర్తో, జ్ఞాపకమో ఉంటాయి. మనతోపాటూ దాచుకోవడానికి. గ్లోబలైజేషన్లో ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయాక.. ఏ మనిషికీ ఓ కుగ్రామంలో జీవితమంతా బతికే పరిస్థితి లేదిప్పుడు. ఇంత వేగంగా నడిచే ప్రపంచంలో మన ఉనికిని మనం కాపాడుకోవడానికి పనికొచ్చే గుర్తులే ఇలాంటివి. అలాంటివి కొన్నయినా దాచుకోగలగాలి”“వస్తు వినియోగం అవసరానికి మించి వాడుతున్న తరం నాన్నా మాది. ఏదైనా కొనగలిగే సామర్థ్యం వచ్చింది. కానీ, జ్ఞాపకాలతో బంధాలను పొదుపు చేసుకోవచ్చని, వస్తువులతో అనుబంధాలను పెనవేసుకోవచ్చని గుర్తించలేకపోతున్నాం” అన్నాడు రవీంద్ర.
“మార్కెట్ ఎకానమీ మాయాజాలం అది” అన్నాడు మూర్తి.“దేశంలో వచ్చిన ఆర్థిక సంస్కరణలు, సంపదను సృష్టించడమేకాదు, వినియోగ సంస్కృతినీ మార్చేశాయి. వస్తువుల జీవితకాలాన్ని తగ్గించేసాయి. నువ్వే ఆలోచించు.. గడిచిన ముప్పై ఏళ్లలో ఎన్ని కుర్చీలు మన ఇంట్లోకి వచ్చి కాలంచేసి పోయాయి. అసలు కుర్చీకే విఫణిలో ఎన్ని ప్రత్యామ్నాయాలు వచ్చాయి. కొనాలి, మళ్లీమళ్లీ కొనాలి. కొత్త కొత్తవి కొనాలి, అదే సూత్రం అన్నింటా! వస్తువు వాడకానికి, దాచుకోవడానికీ విలువ లేకుండా, కేవలం కొనడానికి మాత్రమే ప్రాధాన్యత ఉన్నప్పుడు. మనం ఆ మాయలో బతుకుతున్నట్లే!”ఆ రోజు, ఆ మాటల తర్వాత కుర్చీ గురించి ప్రస్తావన మరెప్పుడూ తీసుకురాలేదు మూర్తి. జీవితమంతా జ్ఞాపకంగా దాచుకొని, ఓ రోజంతా బాధపడిన వ్యక్తి, మరుసటి రోజు నుంచి మళ్లీ ఏమీ జరగనట్లుండటం వింతగా అనిపించింది అనుపమకు.
రవీంద్రకు మాత్రం అలా అనిపించలేదు. ఇంత జీవితం చూసిన వ్యక్తికి, దాచుకోవల్సిన అవసరం తెలిసిన మనిషికి, వదులుకోవల్సిన సమయమూ తెలుసునని అనిపించింది.అయితే, రవీంద్ర మాత్రం ఆ విషయాన్ని అక్కడితో వదిలేయలేదు. వారం రోజుల తర్వాత, ఓ సాయంత్రం పాపను పార్క్‌లో ఆడించి, మూర్తి ఇంటికి తిరిగివచ్చేసరికి.. ఎదురుగా కుర్చీ కనిపించింది. తాత కుర్చీయే! విరిగిన పొడుగుకి కుర్చీ ఎత్తు తగ్గించి, కొంచెం చిన్నఆర్మ్ రెస్ట్‌లను జోడించి.. పాపకోసం రీ మోడిఫై చేసినట్లుంది.“మన కాలానికి చెందిన ఓ రెండు ముక్కలు కలిసినట్లయింది నాన్న. మార్పుకీ, జ్ఞాపకానికీ, రెండింటికీ ప్రతీకలా ఉందిప్పుడు” అన్నాడు రవీంద్ర.అభిజ్ఞను కుర్చీలో కుర్చోబెడుతూ ఉత్సాహంగా నవ్వాడు మూర్తి. తన ‘కొత్త’ కుర్చీని అపురూపంగా చూసుకుంటూ, కేరింతలు కొట్టింది అభిజ్ఞ. వాళ్లిద్దరి ఆనందం, జీవిత కాలానికి సరిపడే జ్ఞాపకంలా దాచుకోవచ్చు అనిపించింది రవీంద్రకు.
పొన్నాడ వెంకట అన్నాజీరావు.
నేటితరం.. అవసరానికి మించి వస్తువులను వాడుతున్నది. కంటికి నచ్చిన ప్రతిదాన్నీ కొనగలిగే సామర్థ్యం వచ్చింది. కానీ, జ్ఞాపకాలతో బంధాలను పొదుపు చేసుకోవచ్చని, వస్తువులతో అనుబంధాలను పెనవేసుకోవచ్చని గుర్తించలేకపోతున్నదని చెప్పే కథ.. జ్ఞాపకం విలువ. రచయిత పొన్నాడ వెంకట అన్నాజీరావు. ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో వస్తువినియోగంలో వచ్చిన మార్పుల గురించి ఈ కథ రాశారు. రచయిత స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల గ్రామం. బీటెక్ చదివారు. ప్రస్తుతం కేంద్ర కస్టమ్స్ పన్నుల శాఖలో సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాహిత్యాభిలాషతో రచనా వ్యాసంగం చేస్తున్నారు. ఈయన రాసిన మొదటి కథ శూన్యం. 2016లో ఏజీ కార్యాలయం వారి రంజని – నందివాడ భీమారావు కథానికల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకుంది. ఆ తర్వాత రాసిన సంకెళ్లు, వ్యవస్థ, ఎర్ర ధోవతి కథలు.. వివిధ పత్రికల్లో/పోటీలలో ప్రచురితమయ్యాయి. ఉద్యోగ బాధ్యతల రీత్యా కథా రచనలకు కొంత విరామం తీసుకున్నారు. నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీ పీఠం కథల పోటీలతోనే మళ్లీ కథా ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించారు. గతేడాది ఈయన రాసిన ‘జాతర’ కథ.. రూ.2000 బహుమతికి ఎంపికైంది.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రోత్సాహక బహుమతి రూ.3 వేలు పొందిన కథ.
-పొన్నాడ వెంకట అన్నాజీరావు
94411 21556