అప్పుల అప్పలమ్మ పాత్ర నా జీవితంలో ఇప్పటిదాకా కొనసాగుతున్నది. స్కూల్లో మా సీనియర్ ఖాజా అని ఒక అతి మంచాయన ఆ తరువాత రోజుల్లో పెద్ద బట్టల షాపు పెట్టాడు. అది చిన్న రూములో ఓపెన్ అయినప్పటి నుంచీ ఇవాళ్టి దాకా నేనూ, అక్కా ఆ దుకాణం కస్టమర్స్మి. ఆయన గురించి కనీసం రెండు ఎపిసోడ్లు రాయొచ్చు.
ఇంతకూ మేము స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నాక, అంటే మా డబ్బులు మేము సంపాదించుకుని కొంచెం ఆర్థిక స్వాతంత్య్రం వచ్చాకన్నమాట… చీరలు, డ్రెస్సులు ఇలా ఏది కావాలన్నా ఖాజా షాపుకి వెళ్లి తెచ్చుకునేవాళ్లం. ఇంటికొచ్చాక వాటిని భుజం మీద వేసుకుని ఇటు తిప్పి అటు తిప్పి చూసుకుని ఎండలోకి వెళ్లి రంగులు చెక్ చేసుకుని అప్పుడు ఒకవేళ నచ్చకపోతే తెల్లారి మళ్లీ వెళ్లి తిరిగి ఇచ్చేసి వేరేవి తెచ్చుకునే వాళ్లం. ఇంతకూ ఇదంతా ఉద్దెరే. రెండు మూడు నెలల్లో ఆ అప్పు వాయిదాల్లో తీరుస్తూ ఉండేవాళ్లం. ఆ అప్పు ఖాతా ఎప్పటికీ తీరకుండా వుండేలా ఖాజా చూసుకుంటూ వుండేవాడు.
ఇంతకూ ఈ విషయం ఆ నోటా ఈ నోటా నోటా మా ఫ్రెండ్స్ కం చుట్టాలకు పాకింది. దానికి తోడు ‘గీ చీర బాగుందే! ఎక్కడ కొన్నవు?’ అనో ‘గీ డ్రెస్సు సూపర్ ఉంది. ఎంతకు కొన్నవు?’ అని అడగంగానే మేము రెచ్చిపోయి మా కాళ్ల కిందికి నీళ్లు వస్తున్న విషయం చూసుకోకుండా వివరాలు వర్ణించి మరీ చెప్పేవాళ్లం. అలా మా ఇంటికి వచ్చిన వాళ్లందరికీ ఖాజా షాపు ఓ దర్శనీయ స్థలం అయింది.
ఇంకేముందీ.. ఓ సాయంత్రం పూట అందరమూ అలా అలా నడుచుకుంటూ దుకాణానికి వెళ్లేవాళ్లం. అదేమైనా మ్యూజియమా ఊరికే చూసి రావడానికి! బట్టల షాపు కదా, మా వాళ్లు ‘చూసీ చూడంగానే నచ్చేసావే’ అని ఓ సినీ కవి పాటలో రాసినట్టు కొన్నిటిని నచ్చేవారు. ‘అయ్యో! ఎట్లనే? నేను పైసలు తెచ్చుకోలేదు. ఏదో మిమ్ములను చూసి రెండ్రోజులుండి పోదామని వొచ్చిన. మీరు ఇక్కడికి పట్టుకొస్తిరి (?), వొద్దులే , మళ్ల ఎప్పుడన్న చూద్దాం’ అని ఎంతో నిరాశ చెందేవారు.
నా ప్రాణం విలవిల్లాడిపోయేది. నాకెందుకులే అని ఊరుకునేదాన్ని కాదు. ‘అయ్యో! వాళ్లు మనసుపడ్డారు కదా, ఇప్పిస్తే సంతోషపడతారు, కొంచెం ఆలస్యంగా డబ్బులు కడతారు కదా!’ అనిపించేది. నా ఫీలింగ్స్ గమనించేవాడో ఏమో.. ఖాజా వెంటనే రంగంలోకి దూకి ‘ఎందుకమ్మా, రమమ్మ ఖాతాల రాస్త, తీసుకోండి, నచ్చినప్పుడు అట్ల ఒదిలిపెట్టొద్దు. మళ్ల ఇట్లాటి పీస్ రాదు’ అని వాళ్లలో ఆశలు రేకెత్తించేవాడు.
ఇంకేముంది, వాళ్లు నాలుగైదు వేల రూపాయల బిల్లు చేసి వెళ్లేవారు. తిరిగి వెంటనే ఇచ్చేవాళ్లు కొందరు, వాయిదాల పద్ధతిలో మూడు నాలుగేళ్లపాటు వాళ్లకు తోచినంత పంపేవాళ్లు కొందరు. సగం కట్టి వదిలేవాళ్ళు కొందరు. ‘పంపిస్తనే.. ఏదో అర్జెంటు అవసరం ఒచ్చింది’ అని దాటవేసేవారు కొందరు, మొత్తానికే ఎగ్గొట్టే వారు కొందరూ… ఇలా ఆ షాపులో నా అప్పు రావణ సభలో హనుమంతుడి తోకలా పెరిగిపోయేది. ఇంత కాకపోయినా అక్కకు కూడా ఇలాంటివే తగిలేవి.
ఇక ఇంకో రకం అప్పులు మరీ విచిత్రంగా వుండేవి. నేను బ్యాంకులో పని చేసేటప్పుడు కొందరు పొద్దున్నే ఇంటికి వచ్చేవారు. పిల్ల పెండ్లి చేస్తున్నామనో, అప్పులు బాగా అయ్యాయి.. ఒక లోన్ ఇప్పిస్తే అవన్నీ తీర్చి ఇది మెల్లగా కడతామనీ, ఎవరో బంగారం అమ్మేస్తున్నారు… అప్పిస్తే అది కొని మళ్లీ గోల్డ్ లోన్ పెట్టి మీ అప్పు తీరుస్తామనీ, పిల్లాడు చదువబ్బక అల్లరి చిల్లరిగా తిరుగుతున్నాడు ఏ పనీ చేయనంటున్నాడు… లోన్ ఇస్తే కారు కొనుక్కుని టాక్సీలా నడుపుతాడనీ, అమ్మాయికి సారీ ఫంక్షన్ చేయడానికి అప్పిస్తే వాయిదాల్లో కడతామనీ.. ఇలా రకరకాల కారణాలతో అప్పుల కోసం వచ్చేవారు.
ఈ కారణాలకు ఏ బ్యాంకూ లోను ఇవ్వదని చెబితే వాళ్లకు అర్థం అయ్యేది కాదు. ‘మీకిస్తరు గద, మీరు తీస్కోని మాకు ఇయ్యుండి. గప్పుడింత గిప్పుడింత కట్టుకుంటం’ అనేవారు. ‘మాక్కూడా అట్లాంటి కారణాలకు ఇయ్యరు’ అంటే వినేవారు కారు. వాళ్లకు నచ్చచెప్పలేక నా తలప్రాణం తోకకొచ్చేది.
అయితే, కొందరికి ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం చెయ్యాల్సే వచ్చేది. ముఖ్యంగా కొడుక్కు ఫీజు కట్టాలనీ, లేకపోతే అతణ్ని పరీక్షలు రాయనివ్వరనీ నన్ను ఓ పోయెట్ రెండేళ్ల క్రితం ఫోన్లో అడిగింది. నాకు ఆమెతో పెద్దగా పరిచయం లేకపోయినా ఎంతో దీనంగా తను అడిగిన విధానానికి నాకు చాలా బాధేసింది. పైగా పిల్లవాడి చదువు అనేసరికి ‘అయ్యో, ఎంత కష్టముందో.. ఏమిటో’ అని మనసు కొట్టుకుంది. నిజానికి నా దగ్గర అప్పుడు అంత డబ్బు లేదు. అప్పుడే కాదు, ఎప్పుడూ అంతంత డబ్బు నా దగ్గర వుండదు. ‘సారీ, నా దగ్గర ఇప్పుడు అంత లేదు’ అని తప్పించుకోవచ్చు. కానీ, ఎందుకో నేనట్లా అనలేకపోతాను. ఏం చేయాలా అని ఆలోచించాను. అప్పుడే మా అమ్మకు వడ్లు అమ్మిన డబ్బులు వస్తే అకౌంట్లో వెయ్యమని ఇచ్చింది.
ఇక ఎక్కువ ఆలోచించకుండా అమ్మను అప్పడిగాను. ‘మళ్లెవరికే?’ అడిగింది అమ్మ. చెప్పాను. నీ ఇష్టం… మునుగుతవు చూడు అంది. అమ్మ డబ్బులు అమ్మకు ఆరు నెలల్లో ఇచ్చేసానుగానీ, రెండేళ్లు దాటినా నా డబ్బులు ఇప్పటికీ వెనుకకు రాలేదు. అయినా నేను ఎవరైనా అడిగినపుడు ఒక్క మాట కాదని చెప్పలేను. అది నా బలహీనతే. అప్పట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ నన్ను బాగా ఆకర్షించేది. అదేంటంటే ‘చక్కనిది.. అప్పు చేసైనా కొనాలనిపించేది’. అంటే బాగా నచ్చితే అప్పు చేసి మరీ దాన్ని కొనాలన్నమాట. అప్పులిచ్చేవాళ్లు ఏమంత గొప్పవాళ్లు అయినట్టు పురాణాల్లోగానీ, చరిత్రలోగానీ చెప్పలేదు. కానీ, అప్పులు తీసుకున్న చాలామంది గొప్ప గొప్పవాళ్లు, కోటీశ్వరులు అయిపోతుంటారు.
ఆ వేంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర అప్పు తీసుకుని గ్రాండ్గా పెళ్లి చేసుకోలేదా? కృష్ణుడు.. కుచేలుడి వద్ద అటుకులు అప్పు తీసుకుని ఎంతో రిచ్ అయ్యాక కుచేలుణ్ని ఆదుకోలేదా? రామదాసు ప్రభుత్వ సొమ్ము వాడేసుకుని రాముడికి గుడి కట్టి , నగలు చేయించి, బకాయి పడ్డాకే ఫేమస్ అయిపోలేదా? దేశాలు వరల్డ్ బ్యాంకు దగ్గర ఎన్నో అప్పులు తీసుకుని ప్రాజెక్టులు చేపడతాయి. ఆ అప్పులు ఎన్నటికీ తీరనే తీరవు. ఉద్యోగంలో చేరాక నాకిది బాగా తెలిసింది. అప్పులు చేసి ఎగ్గొట్టిన వాళ్లు కూడా ఘరానాగా, దర్జాగా తిరుగుతుంటారు. అప్పులే లేకపోతే ఈ ప్రపంచం ఇంతగా అభివృద్ధి చెందేదా చెప్పండి!
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి