పారిస్: అలెగ్జాండర్ జ్వెరెవ్. జర్మనీ స్టార్ ప్లేయర్. పురుషుల టెన్నిస్‌లో మేటి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. 2020లోనే ఒలింపిక్ స్వర్ణం పట్టేశాడు. అత్యంత కఠిన పోటీ ఉండే ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో రెండుసార్లు విజేతగా నిలిచాడు. కానీ, గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ మాత్రం అతడిని ఊరిస్తూనే ఉంది. ఇది వరకూ మూడుసార్లు చిక్కినట్టే చిక్కి చేజారిన ట్రోఫీని జ్వెరెవ్ పారిస్ గడ్డపై ఎట్టకేలకు అందుకున్నాడు. ఓవైపు పరిస్థితులు.. మరోవైపు ప్రత్యర్థి.. ఇంకోవైపు శరీరం విసిరిన సవాల్‌ను నెగ్గి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో నయా చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం రాత్రి ఐదుసెట్ల పాటు అత్యంత ఉత్కంఠగా సాగిన తుదిపోరులో రెండో సీడ్ జ్వెరెవ్ 6-1, 4-6, 6-4, 6-7 (5/7), 6-1తో పదో సీడ్ ఇటలీ స్టార్ ఫ్లావియో కొబోలిపై అద్భుత విజయం సాధించాడు.
2020లో యూఎస్ ఓపెన్, 2024లో ఫ్రెంచ్ ఓపెన్, గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్‌లో ఓడిన 29 ఏండ్ల జ్వెరెవ్ తన కెరీర్లో లోటుగా ఉన్న గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని రోలాండ్ గారోస్‌లో అందుకున్నాడు. టెన్నిస్ చరిత్రలో ‘గ్రాండ్‌స్లామ్ సాధించని అత్యుత్తమ ఆటగాడు’ అనే అపవాదును ఈ విజయంతో జ్వెరెవ్ చెరిపేసుకున్నాడు. మూడు దశాబ్దాల క్రితం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బోరిస్ బెకర్ టైటిల్ గెలిచిన తర్వాత, పురుషుల సింగిల్స్ మేజర్ టైటిల్ సాధించిన జర్మనీ ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
గ్రాండ్‌స్లామ్ కెరీర్లో తన 125వ మ్యాచ్ విజయాన్ని సాధించిన తరుణంలో జ్వెరెవ్‌కు ఈ తొలి టైటిల్ దక్కడం గమనార్హం. టెన్నిస్ చరిత్రలో ఒక ఆటగాడు తన మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడానికి ముందు ఇన్ని విజయాలు నమోదు చేయడం ఇదే తొలిసారి. నాలుగు గంటల 16 నిమిషాల పాటు నువ్వానేనా అన్నట్టు సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆరు ఏస్‌లు కొట్టిన జ్వెరెవ్.. 9 డబుల్ ఫాల్ట్స్, 54 అనవసర తప్పిదాలు చేసినప్పటికీ 9 బ్రేక్ పాయింట్లు, 50 విన్నర్లతో సత్తా చాటాడు. 6 ఏస్‌లు కొట్టిన కొబోలి మూడు బ్రేక్ పాయింట్లు, 42 విన్నర్లకే పరిమితం అయ్యాడు.