Trisha Pujitha | జాతీయ స్థాయిలో మరో తెలంగాణ యువ క్రికెటర్ రివ్వున దూసుకొచ్చింది. ప్రతిభను నమ్ముకుంటూ, అవకాశాలను అందిపుచ్చుకుంటూ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నది. సోదరున్ని స్ఫూర్తిగా తీసుకుంటూ ఎనిమిదేండ్ల ప్రాయంలోనే క్రికెట్ బ్యాట్ పట్టిన త్రిషా పూజిత భళా అనిపిస్తున్నది. 12 ఏండ్లకు హైదరాబాద్ టీమ్‌కు ఎంపికైన ఈ భద్రాచలం అమ్మాయి మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహాం, కోచ్‌ల విలువైన సలహాలు, సూచనలు పాటిస్తూ కీలక ప్లేయర్‌గా ఎదిగింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ టీమ్‌కు ఎంపికైన త్రిషతో.. నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ.
పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్లు పసిప్రాయంలోనే క్రికెట్‌ను అమితంగా ప్రేమించిన త్రిష అనతికాలంలోనే అత్యున్నత స్థాయికి చేరింది. తన సోదరున్ని స్ఫూర్తిగా తీసుకుంటూ క్రికెట్‌ను ఇష్టపడ్డ ఈ యువ ప్లేయర్ దేశవాళీ క్రికెట్లో తనదైన మార్క్‌తో దూసుకెళుతున్నది. హైదరాబాద్ మహిళల టీమ్‌లో కీలక ప్లేయర్‌గా ఎదిగిన త్రిష..భవిష్యత్‌లో భారత సీనియర్ జట్టుకు ఆడాలన్న పట్టుదలతో ముందుకెళుతున్నది. త్వరలో మొదలుకాబోతున్న డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్‌కు ఎంపికైన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ క్రికెటర్ ఆమె మాటల్లోనే..
డబ్ల్యూపీఎల్‌కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. భారత స్టార్ క్రికెటర్లతో పాటు పలువురు విదేశీ ప్లేయర్లతో కలిసి ఆడేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. ఈ నెల 23 నుంచి బెంగళూరు వేదికగా డబ్ల్యూపీఎల్ మొదలవుతున్నది. డబ్ల్యూపీఎల్‌లో సత్తాచాటడం ద్వారా మరింత వెలుగులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తాను.
భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టమైన విజన్‌తో ఉన్నాను. డబ్ల్యూపీఎల్‌లో సీనియర్ క్రికెటర్లతో కలిసి ఆడటం ద్వారా మరింత పరిణతి సాధించేందుకు ఆస్కారం లభిస్తుంది. రానున్న రోజుల్లో ఎలాగైనా జాతీయ జట్టుకు ఆడాలన్న పట్టుదలతో ఉన్నాను. ఇందుకోసం ఎంతైనా కష్టపడేందుకు సిద్ధంగా ఉన్నాను.
ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉండటానికి కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహమే ప్రధాన కారణం. ఊహ తెలియని వయసులో అన్నయ్య క్రికెట్ ఆడటం చూసి ఆట పట్ల ఆకర్షణ పొందాను. అన్నయ్య ఆడగా లేనిది నేను ఎందుకు ఆడొద్దంటూ వచ్చిన ఆలోచనే ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టింది. చిన్నతనం నుంచి నాన్న కృష్ణారావు, అన్యయ్య రుత్విక్ ఇచ్చిన మద్దతు మరువలేనిది. వీరికి తోడు ఓవైపు ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న అమ్మ ఎప్పుడు అండగా ఉంటూనే వస్తుంది.
నేను పుట్టింది భద్రాచలంలో. కెరీర్ కోసం మేము హైదరాబాద్‌కు మకాం మార్చాం. తార్నాకలో ఉంటూ తొలుత కోచ్ శ్రీనివాస్ దగ్గర ఓనమాలు దిద్దాను. ఎనిమిదేండ్లకే కెరీర్ మొదలుపెట్టి 12 ఏండ్లకు హైదరాబాద్ టీమ్‌కు ఎంపికయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అండర్-16, 19, 23 వయసు విభాగాల్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను. ప్రస్తుతం లింగంపల్లిలో కోచ్ సలాం బయాష్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాను. టెక్నిక్ పరంగా మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నాను. దీనికి తోడు భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ దగ్గర ఫిట్నెస్ పరంగా శిక్షణ తీసుకుంటున్నాను. మొత్తంగా రోజుకు ఏడు, ఎనిమిది గంటలు ప్రాక్టీస్‌లో నిమగ్నమవుతాను. ప్రస్తుతమున్న పోటీ వాతావారణాన్ని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా ముందుండాలి. అప్పుడే మరో స్థాయికి ఎదుగుతామన్నది నా నమ్మకం.
జట్టులో చోటు నిలుపుకోవాలంటే నిలకడ అనేది ముఖ్యం. నేను అండర్-16 ఆడినప్పటి నుంచి ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాను. గత ఐదేండ్ల కాలంలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణిస్తున్నాను. ఓపెనింగ్ బ్యాటింగ్‌తో పాటు ఉపయుక్తమైన స్పిన్ బౌలింగ్‌తో జట్టు విజయాల్లో భాగమవుతున్నాను. ఇదే ఒరవడి రానున్న రోజుల్లోనూ కొనసాగిస్తాను. ఈ క్రమంలో హెచ్‌సీఏ అందిస్తున్న సహకారం మరులేనిది. ముఖ్యంగా జగన్మోహన్రావు చాలా ప్రోత్సహిస్తున్నారు.