రెప్ప పాటులో ప్రత్యర్థిని ఏమార్చి బంతిని ఆధీనంలోకి తెచ్చుకునే మంత్రగాడు..మైదానంలో పాదరసాన్ని తలపిస్తూ అభిమానులను వశం చేసుకునే ఇంద్రజాలికుడు..కండ్లు చెదిరే ఫీల్డ్ గోల్స్‌తో ప్రపంచ రికార్డులు నెలకొల్పిన ఘనుడు..పెనాల్టీల్లో అడ్డుగోడలను ఛేదిస్తూ మెరుపు వేగంతో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపే ధీరుడు.. యావత్ క్రీడాలోకాన్ని తన ఆటతీరుతో ఉర్రూతలూగించిన సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
మాటల్లో సౌమ్యుడిగా.. చేతల్లో ఘనాపాటిగా గుర్తింపు సాధించిన మెస్సీ 36 ఏండ్ల తర్వాత అర్జెంటీనాకు ఫిఫా ప్రపంచకప్ అందించి సగర్వంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. పిట్ట కొంచం కూత ఘనంలా.. ఉద్దండపిండాలతోనే శభాష్ అనిపించుకున్న ఈ 35 ఏండ్ల అర్జెంటీనా యోధుడు.. కెరీర్లో లెక్కకు మిక్కిలి ఘనతలు తన పేరిట రాసుకున్నాడు. రికార్డు స్థాయిలో ఆరుసార్లు బాలన్ ‘డి’ ఓర్ అవార్డు గెలుచుకున్న మెస్సీ.. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టేశాడు. తమ దేశ దిగ్గజం మారడోనాకు నివాళిగా ప్రపంచకప్ సాధిస్తామని టోర్నీకి ముందే మాటిచ్చిన మెస్సీ.. అందుకు తగ్గట్లే సారథిగా దేశానికి మూడో కప్పు అందించాడు. కెరీర్ ఆరంభంలోనే మరో మారడోనాగా గుర్తింపు సాధించిన మెస్సీ.. ఆటతోనే కాకుండా తన వ్యవహార శైలితో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. వివాదాలకు దూరంగా ఉండే మెస్సీ.. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఆటుపోట్లతో పాటు అవమానాలు ఎదుర్కొన్నాడు. 2014లో ఒంటిచేత్తో జట్టును ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చిన మెస్సీ.. దేశానికి కప్పు అందించలేకపోయినా.. తన అసమాన ప్రతిభతో గోల్డెన్ బూట్ అవార్డు కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత రాటుదేలిన మెస్సీ.. తాజా మెగాటోర్నీలో నాయకుడిగా స్ట్రయికర్‌గా జట్టును ముందుండి నడిపించాడు.
టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓటమి తర్వాత అర్జెంటీనా వెనుదిరిగి చూసుకోలేదంటే అందుకు ప్రధాన కారణం మెస్సీ పోరాట పటిమే. తొలి మ్యాచ్‌లోనే ఓడటం తమకు మంచే చేస్తుందని.. సహచరుల్లో స్ఫూర్తి నింపిన మెస్సీ.. అద్వితీయమైన గోల్స్‌తో నాయకుడిగా జట్టును గెలిపించాడు. గ్రూప్ దశలో మెక్సీకో, పోలాండ్‌పై నెగ్గిన అర్జెంటీనా.. ప్రిక్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాపై, క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌పై, సెమీఫైనల్లో క్రొయేషియాపై అద్భుత విజయాలు సాధించింది. తాజా మెగాటోర్నీలో 7 గోల్స్ కొట్టిన మెస్సీ.. మరో నాలుగు గోల్స్‌కు సహాయకారిగా ఉపకరించాడు. గత ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్స్‌లో తమను ఓడించిన ఫ్రాన్స్‌పై ప్రతికారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఫైనల్లో అడుగుపెట్టిన అర్జెంటీనాకు.. తుదిపోరులో మెస్సీ అదిరే అరంభాన్నిచ్చాడు. తొలి అరగంటలోపే అందివచ్చిన పెనాల్టీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ గోల్ కొట్టాడు. దీంతో దోహా లుసైల్ స్టేడియం హోరెత్తిపోగా ఆ తర్వాత మరో గోల్‌తో జట్టును విజయానికి చేరువ చేశాడు. ఫ్రాన్స్ పోరాటంతో మ్యాచ్ షూటౌట్‌కు దారి తీయగా.. కెరీర్లో తన చివరి కిక్‌తో గోల్ కొట్టి ఘనంగా ఆటకు అల్విదా చెప్పాడు. అతడు అడుగేస్తే చాలు హోరెత్తిపోయే మైదానాలు.. అతడు మ్యాచ్ ఆడుతున్నాడంటే చాలు జనసంద్రాలయ్యే
ప్రపంచకప్‌లో అత్యధిక విజయాల్లో పాలుపంచుకున్న ఆటగాడిగా మెస్సీ.. జర్మనీ దిగ్గజం మిరొస్లావ్ క్లోజ్ (17) సరసన చేరాడు.
వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు (26) ఆడిన ఆటగాడిగా మెస్సీ రికార్డుల్లోకెక్కాడు. లోథార్ (జర్మనీ; 25) రెండో స్థానంలో ఉన్నాడు.
ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సమయ మైదనాంలో ఉన్న ఆటగాడిగా మెస్సీ రికార్డు సృష్టించాడు. తాజా ఫైనల్‌తో మెస్సీ 2,314 నిమిషాలు మైదానంలో గడిపి, పాలొ మాల్డినిని (2,217ని) రెండో స్థానానికి నెట్టివేశాడు.
ఒకే ప్రపంచకప్‌లో గ్రూప్ స్టేజ్, రౌండ్-16, క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్లో గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా మెస్సీ రికార్డు సృష్టించాడు.
స్టేడియంలు ఇక ముందు చూడలేమనే తలంపే క్రీడాభిమానులను కలచి వేస్తున్నది.