పొట్టి ఫార్మాట్లో భారత్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ప్రపంచకప్ ఓటమి నుంచి త్వరగానే తేరుకున్న టీమ్ఇండియా..ఆస్ట్రేలియాను చిత్తుచేస్తూ ముందుకు సాగుతున్నది. విశాఖపట్నం, తిరువనంతపురంలో అద్భుత విజయాలు సొంతం చేసుకున్న సూర్యకుమార్ సేన..గువాహటిలో పోరుకు సిద్ధమైంది. నేడు జరిగే మూడో టీ20లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నది. యువకులతో కళకళలాడుతన్న టీమ్ఇండియా.. ఇదే జోరు కొనసాగిస్తూ కంగారూలకు షాక్ ఇవ్వాలన్న తలంపుతో ఉంది. గెలిస్తే గానీ నిలువని పరిస్థితుల్లో ఉన్న ఆసీస్.. దీటైన పోటీనిచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. ఇద్దరి మధ్య పోరు మరోమారు అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తున్నది.
గువాహటి: వచ్చే ఏడాది జరిగే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత్ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. మెగాటోర్నీ నాటికి మిగిలిన మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకుని కుర్రాళ్లకు అవకాశమిస్తూ పోతున్నది. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో సూర్యకుమార్‌యాదవ్ నేతృత్వంలో బరిలోకి దిగిన భారత్..ఆస్ట్రేలియాను దీటుగా ఎదుర్కొంటున్నది. వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ కుర్రాళ్లు వీరవిహారం చేస్తున్నారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, రింకూసింగ్ దుమ్మురేపుతున్నారు. ఆసీస్ బౌలింగ్ దాడిని తిప్పికొడుతూ పరుగుల వరద పారిస్తున్నారు.
బౌలర్ ఎవరన్నది లెక్కచేయని నైజంతో బ్యాట్లు ఝుళిపిస్తున్నారు. ఇదిలా ఉంటే యువ బ్యాటర్ తిలక్‌వర్మ ఫామ్ ఒకింత ఆందోళన కల్గిస్తున్నది. గత రెండు మ్యాచ్‌ల్లో తిలక్ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయాడు. చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయాస్ అయ్యర్ రానుండటంతో తిలక్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. బౌలర్లు సమిష్టిగా రాణిస్తుండటం భారత్‌కు కలిసి వస్తున్నది.
పుంజుకునేందుకు:
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆసీస్ పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నది. మ్యాక్స్‌వెల్, స్మిత్, జంపా, స్టొయినిస్ లాంటి సీనియర్ క్రికెటర్లు ఉన్నా..ఆసీస్ గెలుపు బాట పట్టలేకపోతున్నది. సిరీస్‌లో నిలువాలంటే కంగారూలు తప్పక గెలువాల్సిన పరిస్థితిని ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు.
60 అంతర్జాతీయ టీ20ల్లో రెండు వేల పరుగుల మార్క్ అందుకోవడానికి సూర్యకుమార్ మరో 60 పరుగుల దూరంలో ఉన్నాడు.
జట్ల అంచనా
భారత్: యశస్వి, రుతురాజ్, ఇషాన్‌కిషన్, సూర్యకుమార్(కెప్టెన్), తిలక్‌వర్మ, రింకూసింగ్, అక్షర్‌పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, ముకేశ్ కుమార్
ఆస్ట్రేలియా: స్మిత్, షార్ట్, ఇంగ్లిస్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, డేవిడ్, వేడ్(కెప్టెన్), జంపా, ఎలిస్, బెహెన్‌డార్ఫ్/అబాట్, తన్వీర్