తిలక్ గెలిపించాడు
తెలంగాణ క్రికెటర్ తిలక్ వర్మ (26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 51 నాటౌట్) మరోసారి తన తెగువ చూపెట్టాడు.
- రెండో టీ20లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ
- అర్ధ శతకంతో మెరిసిన హైదరాబాదీ వర్మ
- రాణించిన నితీశ్ రెడ్డి, నమన్
తెలంగాణ క్రికెటర్ తిలక్ వర్మ (26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 51 నాటౌట్) మరోసారి తన తెగువ చూపెట్టాడు. తీవ్ర ఒత్తిడిలో అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన చేసి న్యూజిలాండ్ గడ్డపై భారత్‌కు అద్భుత విజయం అందించాడు. 181 పరుగుల ఛేదనలో జట్టు 11 ఓవర్లకు 71/5తో కష్టాల్లో పడ్డ దశలో ఖతర్నాక్ షాట్లతో విరుచుకు పడ్డాడు. మరో తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి (13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 26 నాటౌట్) సహకారం అందించడంతో చారిత్రాత్మకమైన 300వ టీ20 మ్యాచ్‌లో పరాజయం అంచుల్లో నిలిచిన భారత్‌ను విజయతీరాలకు చేర్చి హీరో అయ్యాడు.
క్రైస్ట్‌చర్చ్: ‘మూడో నంబర్లో బ్యాటింగ్ చేసే నేను 5, 6వ స్థానాల్లో ఆడాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ జట్టు అవసరాల కోసం ఎక్కడైనా బ్యాటింగ్ చేసేందుకు నేను రెడీ. మ్యాచ్‌ను ముగించి.. దేశాన్ని గెలిపించడం అంటే నాకెంతో ఇష్టం’ వెస్టిండీస్‌తో ఐదో టీ20 తర్వాత తిలక్ వర్మ చేసిన వ్యాఖ్యలివి. చెప్పినట్టుగానే తనలోని ఫినిషర్‌ను నిద్రలేపిన హైదరాబాద్ కుర్రాడు న్యూజిలాండ్‌తో ఆఖరి ఓవర్ వరకూ అత్యంత ఉత్కంఠగా సాగిన రెండో టీ20లో టీమిండియాను గెలిపించాడు.
టాపార్డర్ విఫలమైన వేళ తిలక్ మెరుపు అర్ధ శతకంతో విజృంభించడంతో శనివారం జరిగిన ఈ పోరులో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యం అందుకుంది. నమన్ ధీర్ (17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 31) కూడా ఆకట్టుకోవడంతో 181 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలుండగా ఛేదించింది. శాంట్నర్ 4 వికెట్లు తీశాడు. తొలుత కివీస్ 20 ఓవర్లలో180/5 స్కోరు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 70), బెవాన్ జాకబ్స్ (46 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 58) అర్ధశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ (2/33) రెండు వికెట్లు పడగొట్టాడు. తిలక్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మూడో మ్యాచ్ మంగళవారం వెల్లింగ్టన్లో జరుగుతుంది.
తెలుగు కుర్రాళ్ల తడాఖా
క్లిష్టమైన పిచ్‌పై ఛేదనలో భారత్ ఆరంభంలో తడబడింది. హెన్రీ మెయిడిన్‌తో కివీస్ బౌలింగ్‌ను ఆరంభించాడు. డఫీ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన ఓపెనర్ అభిషేక్ (27) హెన్రీ తర్వాతి ఓవర్లో సిక్స్ కొట్టాడు. మరో ఎండ్‌లో తనదైన శైలిలో ఆడలేకపోయిన శాంసన్ (14) ఓ ఫోర్, సిక్స్ కొట్టి ఐదో ఓవర్లో డఫీకి వికెట్ ఇచ్చుకోగా పవర్‌ప్లేను భారత్ 44/1తో ముగించింది. స్పిన్నర్ల రంగప్రవేశం తర్వాత జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి.
నేథన్ స్మిత్ తన రెండో బంతికే వైభవ్ సూర్యవంశీ (4) ఔట్ చేశాడు. ఆ వెంటనే అభిని పెవిలియన్ చేర్చిన కివీస్ కెప్టెన్ శాంట్నర్ 11వ ఓవర్లో కెప్టెన్ శ్రేయస్ (7), అక్షర్ పటేల్ (11)ను ఔట్ చేసి డబుల్ షాకిచ్చాడు. దాంతో 70/5తో డీలా పడిన జట్టును ఒడ్డుకు చేర్చే బాధ్యత వైస్ కెప్టెన్ తిలక్‌పై పడింది. స్పిన్ బౌలింగ్‌లో తిలక్ వేగంగా ఆడలేకపోయినా ఈ దశలో నమన్ ధీర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫెర్గూసన్ ఓవర్లో భారీ సిక్స్‌తో టీమ్‌లో మళ్లీ జోష్ పెంచాడు.
9 పరుగులు వద్ద ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను జాకబ్స్ డ్రాప్ చేయడంతో దక్కిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకుంటూ శాంట్నర్ బౌలింగ్‌లో స్ట్రెయిట్ సిక్స్.. బ్రేస్‌వెల్ వేసిన 13వ ఓవర్లో 4,6తో జట్టుపై ఒత్తిడి తగ్గించాడు. కానీ, 15వ ఓవర్లో అతడిని శాంట్నర్ పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్ మళ్లీ కివీస్ చేతుల్లోకి వెళ్లింది. చివరి 30 బంతుల్లో భారత్‌కు 68 పరుగులు అవసరం అయ్యాయి. అప్పటికి 9 బంతుల్లో 10 రన్స్ మాత్రమే చేసిన తిలక్‌కు నితీశ్ జతయ్యాడు. ఒత్తిడి అమాంతం పెరిగిన వేళ ఈ ఇద్దరూ వికెట్ల మధ్య అద్భుతంగా రన్నింగ్ చేస్తూనే అద్భుతమైన షాట్లు ఆడారు.
డఫీ వేసిన 18వ ఓవర్లో నితీశ్ లాంగాఫ్ మీదుగా భారీ సిక్స్ కొడితే.. తిలక్ రెండు ఫోర్లు రాబట్టాడు.నేథన్ స్మిత్ వేసిన తర్వాతి ఓవర్లో తిలక్ మరింత రెచ్చిపోయాడు. ఖతర్నాక్ షాట్లతో మూడు ఫోర్లతో పాటు ఆఖరి బంతికి మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచే షాట్‌తో లాంగాఫ్ మీదుగా సిక్స్ కొట్టడంతో సమీకరణం 6 బంతుల్లో 11 పరుగులుగా మారింది. చివరి ఓవర్లో మరో ఫోర్ కొట్టి డబుల్ తీసిన తిలక్ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. ఐదో బంతికి నితీశ్ రెండు పరుగులు రాబట్టడంతో భారత్ విజయ సంబురాలు మొదలయ్యాయి.
టాప్ ఢమాల్.. ఫిలిప్స్-జాకబ్స్ కమాల్
తొలి మ్యాచ్‌లో తేలిపోయిన భారత బౌలర్లు ఈ పోరులో ప్రారంభంలోనే వరుస వికెట్లు పడగొట్టినా ఫిలిప్స్, జాకబ్ మెరుపులతో కివీస్ ంచి స్కోరు చేసిందది. రెండో ఓవర్లోనే ఓపెనర్ టిమ్ సిఫర్ట్ (7)ను అర్ష్‌దీప్ పెవిలియన్‌కు పంపగా.. భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్లో డారిల్ మిచెల్ (6) తిలక్‌కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత బౌలింగ్‌కు వచ్చిన ప్రిన్స్ యాదవ్ ప్రమాదకరమైన అలెన్ (16)ను పెవిలియన్ చేర్చడంతో పవర్‌ప్లేను కివీస్ 41/3తో ముగించింది. ఈ దశలో జతకూడిన ఫిలిప్స్, జాకబ్స్ ఓపికగా ఇన్నింగ్స్‌ను నిర్మించారు.
స్పిన్నర్లు నమన్, అక్షర్ కూడా పొదుపుగా బౌలింగ్ చేయడంతో కివీస్ సగం ఓవర్లకు 66/3 స్కోరు మాత్రమే చేసింది. కానీ, చివరి పది ఓవర్లలో ఫిలిప్స్, జాకబ్స్ అసలు ఆట చూపెట్టారు. అక్షర్, అర్ష్‌దీప్ ఓవర్లలో రెండు సిక్సర్లు కొట్టి మళ్లీ జోష్ పెంచిన ఫిలిప్స్ భువీ బౌలింగ్‌లో 6, 4తో టాప్ గేర్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో అతను 33 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. ప్రిన్స్ వేసిన 17వ ఓవర్లో రెండు ఫోర్లతో జాకబ్స్ కూడా అర్ధ శతకం దాటాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్‌పై ఊరించే ఫుల్ లెంగ్త్ బాల్‌తో ఫిలిప్స్‌ను అర్ష్‌దీప్ ఔట్ చేసి నాలుగో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. నితీశ్ వేసిన 19వ ఓవర్లో సిక్స్ కొట్టిన జాకబ్స్ కూడా వెనుదిరిగాడు. అదే ఓవర్లో ఓ సిక్స్ బాదిన బ్రేస్‌వెల్ (10 నాటౌట్) ఆఖరి బాల్‌కు ఫోర్ కొట్టి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

