IND vs SA | వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాజయం అనంతరం తొలిసారి భారత జట్టు ఈ ఫార్మాట్లో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. రోహిత్, కోహ్లీ, బుమ్రా గైర్హాజరీలో కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నాడు. సఫారీ టూర్లో టీ20 సిరీస్‌ను సమం చేసుకున్న టీమ్ఇండియా.. 50 ఓవర్ల ఫార్మాట్లో రాణించాలని చూస్తుంటే.. సొంతగడ్డపై సత్తాచాటాలని ప్రొటీస్ తహతహలాడుతున్నది. నయా ఫినిషర్ రింకూసింగ్ వన్డే అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమే!
జొహన్నెస్‌బర్గ్: సొంతగడ్డపై భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో పరాజయం పాలైన టీమ్ఇండియా.. ఆ ఓటమిని పక్కన పెట్టి 50 ఓవర్ల సమరాన్ని కొత్తగా ప్రారంభించేందుకు రెడీ అయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జరగనుంది. మెగాటోర్నీ తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ల్లో తలపడ్డ భారత్.. తొలిసారి వన్డే ఫార్మాట్లో ఆడనుంది. వరల్డ్‌కప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌కు భారత సారథిగా వ్యవహరించనుండగా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేరు. గతంలో దక్షిణాఫ్రికాలో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కగా.. ఈ సారి ఆధిపత్యం కనబర్చాలని టీమ్‌మేనేజ్‌మెంట్ యోచిస్తున్నది.
రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు, సాయి సుదర్శన్ ఓపెనింగ్ చేయనుండగా.. తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, రాహుల్ బరిలోకి దిగనుండగా.. సీనియర్ ప్లేయర్ సంజూ శాంసన్ స్థానంలో నయా ఫినిషర్ రింకూసింగ్‌ను ఆడించే అవకాశాలే ఎక్కువ. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్తో పాటు అక్షర్ జట్టులో చోటు దక్కించుకోనుండగా.. ముఖేశ్ కుమార్, అవేశ్‌ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ పేస్ భారాన్ని మోయనున్నారు. టీ20 సిరీస్‌లో ఆడిన పలువురు ఆటగాళ్లను ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. మరోవైపు సొంతగడ్డపై టీ20 సిరీస్ గెలువలేకపోయిన దక్షిణాఫ్రికా వన్డేల్లోనైనా సత్తాచాటాలని చూస్తున్నది. రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి నివ్వగా.. మార్క్మ్ జట్టును నడిపించనున్నాడు. అతడితో పాటు హెన్రిక్స్, డసెన్, క్లాసెన్, మిల్లర్, ఫెలుక్వాయోతో దక్షిణాఫ్రికా జట్టు పటిష్టంగా ఉంది.
భారత్: రాహుల్ (కెప్టెన్), రుతురాజ్, సాయి సుదర్శన్, తిలక్, శ్రేయస్, రింకూసింగ్/సంజూ శాంస న్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముఖేశ్.
దక్షిణాఫ్రికా: మార్క్మ్ (కెప్టెన్), హెన్రిక్స్, జోర్జీ, డసెన్, క్లాసెన్, మిల్లర్, ఫెలుక్వాయో, ముల్డర్, బర్గర్, కేశవ్ మహరాజ్, లిజాడ్ విలియమ్స్.
వాండరర్స్ పిచ్ బ్యాటింగ్ అనుకూలం. ఇక్కడ గతంలో జరిగిన మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడుసార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు మూడొందల పైచిలుకు స్కోరు చేసింది. మ్యాచ్‌కు వర్షం ముప్పులేదు.