ప్లే ఆఫ్స్ రేసులో నిలువాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడేందుకు సన్‌రైజర్స్ సిద్ధమైంది. తాజా సీజన్లో తొలి రెండు పరాజయాల అనంతరం ఉవ్వెత్తున ఎగిసిన రైజర్స్ వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి భళా అనిపించుకుంది. ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో వరుసగా ఐదు పరాజయాలు ఖాతాలో వేసుకొని ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గినా.. హైదరాబాద్ ముందంజ వేస్తుందని పక్కాగా చెప్పలేని పరిస్థితుల్లో.. విలియమ్సన్ సేన ఏ మేరకు పోరాడుతుందో చూడాలి!
ముంబై: ఐపీఎల్ 15వ సీజన్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక విజయం సాధించాల్సిన పోరులో ముంబైతో తలపడేందుకు హైదరాబాద్ రెడీ అయింది. ఇప్పటి వరకు లీగ్‌లో 12 మ్యాచ్‌లాడి 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న రైజర్స్.. మరోసారి బౌలింగ్‌నే నమ్ముకొని బరిలోకి దిగుతున్నది. తాజా సీజన్లో తక్కిన రెండు మ్యాచ్‌ల్లోనూ రైజర్స్ నెగ్గితే 14 పాయింట్లతో ఇతర జట్ల ఫలితాల ఆధారంగా.. ముందంజ వేసే అవకాశాలు స్వల్పంగా ఉన్నాయి. ఒకవేళ ముంబై చేతిలో ఓడితే రైజర్స్ రేసు నుంచి తప్పుకోనుంది. ఎప్పట్లాగే బౌలింగ్‌లో సత్తాచాటుతున్న రైజర్స్.. బ్యాటింగ్‌లో కనీస పోరాటం కనబర్చలేక పోతున్నది.
ముఖ్యంగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆటతీరు.. వీరాభిమానులకు సైతం విసుగు తెప్పిస్తున్నది. టెస్టు మ్యాచ్ తరహా బ్యాటింగ్‌తో కేన్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో.. 18.91 సగటుతో 208 పరుగులు చేశాడు. కొత్త కుర్రాళ్లు విజృంభిస్తున్న లీగ్‌లో విలియమ్సన్ 92.85 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు రాబట్టడం ఫలితాలపై ప్రభావం చూపుతున్నది. అయితే ఫామ్‌లో లేని విలియమ్సన్‌ను ఓపెనింగ్ నుంచి తప్పించి మిడిలార్డర్లో బరిలో దింపడంపై స్పందించిన రైజర్స్ హెడ్ కోచ్ టామ్ మూడీ ఆ అవసరం లేదని స్పష్టం చేశాడు. మరి కోచ్ నమ్మకాన్ని కేన్ ఏ మేరకు నిలబెట్టుకుంటాడో చూడాలి. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. మిడిలార్డర్లో రాహుల్ త్రిపాఠి, మార్క్మ్,్ర పూరన్ నిలకడ కొనసాగించాల్సిన అవసరముంది. వాషింగ్టన్ సుందర్, శశాంక్ సింగ్ ఫినిషింగ్ బాధ్యతలు మోయనున్నారు.
తాజా సీజన్లో తన వేగంతో అందరి దృష్టిని ఆకర్శిస్తున్న ఉమ్రాన్ మాలిక్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. 12 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టిన ఉమ్రాన్ రోజు రోజుకు మెరుగవుతున్నాడు. మాలిక్ మెరుపు వేగంతో ముంబై టాపార్డర్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. భువనేశ్వర్ కుమార్, నటరాజన్, జాన్సెన్ కూడా తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తుండటంతో బౌలింగ్‌లో రైజర్స్ ఫర్వాలేదనిపిస్తున్నది. మరోవైపు వరుస పరాజయాలతో డీలాపడ్డ ముంబై ఇండియన్స్.. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటాలని భావిస్తున్నది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ ఆ జట్టును కలవరపెడుతున్నది. వేలంలో అత్యధిక ధర పలికిన ఇషాన్ కిషన్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు. గాయం కారణంగా సూర్యకుమార్ యాదవ్ లీగ్‌కు దూరమవడంతో జట్టుపై ప్రభావం చూపగా.. తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ నిలకడ కనబరుస్తున్నాడు. మిడిలార్డర్లో డానియల్ సామ్స్, టిమ్ డేవిడ్, స్టబ్స్ కీలకం కానున్నారు. పేస్ గుర్రం బుమ్రాతో పాటు మెరిడిత్, సామ్స్, కార్తికేయ బౌలింగ్ భారం మోయనున్నారు.
హైదరాబాద్: విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్, త్రిపాఠి, మార్క్మ్,్ర పూరన్, సుందర్, శశాంక్, జాన్సెన్, భువనేశ్వర్, ఉమ్రాన్, నటరాజన్.
ముంబై: రోహిత్ (కెప్టెన్), ఇషాన్, సమ్స్, తిలక్ వర్మ, స్టబ్స్, హృతిక్, డేవిడ్, రమణ్‌దీప్ సింగ్, బుమ్రా, మెరిడిత్, కార్తికేయ.