IPL | న్యూఢిల్లీ: బధిరులకూ ఐపీఎల్ మజాను అందించేందుకు గాను ఈ లీగ్ టెలివిజన్ పార్ట్నర్ స్టార్ స్పోర్ట్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజా ఎడిషన్ను ఇండియన్ సైన్ లాంగ్వేజ్ (చేతి సైగల భాష) సాయంతో బధిరులు, పూర్తిగా వినికిడి కోల్పోయిన వ్యక్తులు, పాక్షిక దృష్టి లోపం కలిగిన క్రికెట్ అభిమానులకు ఈ లీగ్లో బాల్ బై బాల్ అప్డేట్స్ను కామెంట్రీ రూపంలో అందించనుంది.
ఇండియన్ సైనింగ్ హ్యాండ్స్ (ఐఎస్హెచ్ న్యూస్) సాయంతో పాటు బీసీసీఐ అండతో స్టార్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఐపీఎల్లో సైన్ లాంగ్వేజ్ ద్వారా కామెంట్రీ అందించడం ఇదే ప్రథమం కావడం విశేషం. ఈ నిర్ణయంపై భారత బధిరుల టీమ్ కెప్టెన్ వీరేందర్ సింగ్ హర్షం వ్యక్తం చేశాడు.