కోల్‌కతా: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యఛేదనలో కోల్‌కతా 16 ఓవర్లలో 161 పరుగులకు కుప్పకూలింది. జైదేవ్ ఉనద్కత్(3/21), ఇషాన్ మలింగ(2/14), నితీశ్‌కుమార్(2/17) ధాటికి నిలదొక్కుకోలేకపోయింది. రఘువంశీ(52) మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. హెన్రిచ్ క్లాసెన్ (35 బంతుల్లో 52, 4 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 48, 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ట్రావిస్ హెడ్ (21 బంతుల్లో 46, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 రన్స్ చేసింది.
పవర్ ప్లేలో ఓపెనర్ల మెరుపులు.. మిడిల్ ఓవర్లలో నిలకడ.. ఆఖర్లో మళ్లీ ధనాధన్.. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ సాగిన తీరిది! మ్యాచ్ ఆరంభం నుంచే ప్రత్యర్థుల మీదకు దండెత్తే ఓపెనింగ్ జోడీ ట్రావిషేక్.. రెండో ఓవర్ నుంచి బాదుడు మంత్రాన్ని జపించింది. ముజరబాని ఓవర్లో హెడ్ రెండు బౌండరీలు బాదగా అభిషేక్ సిక్స్‌తో వీరి దంచుడు మొదలైంది. వైభవ్ మూడో ఓవర్లో అయితే హెడ్ 4, 6, 6, 4తో 21 పరుగులు పిండుకున్నాడు. వరుణ్ నాలుగో ఓవర్లో అభిషేక్ 6, 4, 4, 4తో 25 రన్స్ రాబట్టాడు. త్యాగి ఐదో ఓవర్లో ఫోర్, సిక్స్‌తో హాఫ్ సెంచరీకి చేరువైన హెడ్.. నాలుగో బంతికి గ్రీన్ చేతికి క్యాచ్ ఇవ్వడంతో 82 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
ఇషాన్.. (14) కూడా వస్తూనే హ్యాట్రిక్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కానీ ముజరబాని 9వ ఓవర్లో ఇషాన్‌తో పాటు అభిషేక్ ఔట్ అవడంతో స్కోరువేగం తగ్గింది. ఈ క్రమంలో క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి (39) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపారు. 13-17 ఓవర్లలో కోల్‌కతా బౌలర్లు కట్టడి చేయడంతో సన్‌రైజర్స్ స్కోరువేగం తగ్గినా.. ఆఖర్లో క్లాసెన్, హర్ష్ దూబే (9*) అండతో స్కోరును 220 మార్కును దాటించాడు.
రికార్డు ఛేదనలో ఫిన్ అలెన్ (7 బంతుల్లో 28, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులతో కోల్‌కతా కూడా ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించింది. 4, 4, 6, 6, 4తో మొదటి ఓవర్లోనే 24 రన్స్ రాబట్టిన అతడిని రెండో ఓవర్లో దూబె బోల్తా కొట్టించడంతో హైదరాబాద్ ఊపిరి పీల్చుకుంది. రహానే (8)ను ఉనద్కత్, మలింగ బౌలింగ్‌లో గ్రీన్ (2) రనౌట్ అయినా రఘువంశి పోరాడాడు. పరిణితితో కూడిన ఆటతో జట్టును ముందుకు నడిపిన అతడు.. 27 బంతుల్లో వరుసగా రెండో అర్ధశతకాన్ని నమోదుచేశాడు. అయితే రింకూతో సమన్వయం లోపం కారణంగా అతడు రనౌట్ అయ్యాడు.
ఆ తర్వాత నితీశ్ వరుస ఓవర్లలో అనుకుల్, రింకూ (35)ను ఔట్ చేయడంతో ఆ జట్టు ఓటమి దాదాపుగా ఖాయమైంది. ఒక దశలో విజయం వైపు సాఫీగా నడిచిన కోల్‌కతా..హైదరాబాద్ బౌలర్ల సమష్టి ప్రదర్శనతో వికెట్లు కోల్పోయి ఓటమి వైపు నిలిచింది. సునీల్ నరైన్(12), రమణ్‌దీప్‌సింగ్(10)ను మలింగ ఒకే ఓవర్లో ఔట్ చేయగా, చక్రవర్తిని క్లీన్‌బౌల్డ్ చేసి కోల్‌కతా ఇన్నింగ్స్‌కు జైదేవ్ ముగింపు పలికాడు.
హైదరాబాద్: 20 ఓవర్లకు 226/8 (క్లాసెన్ 52, అభిషేక్ 48, ముజరబాని 4/41, వైభవ్ 2/47);
కోల్‌కతా: 16 ఓవర్లలో 161 ఆలౌట్(రఘువంశి 52, రింకూసింగ్ 35, జైదేవ్ 3/21, మలింగ 2/14)

