సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) వీరంగం సృష్టించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటములతో ఒత్తిడిలో ఉన్న హైదరాబాద్.. సొంత ఇలాఖాలో తమ సత్తా ఏంటో చూపెట్టింది. లక్నో సూపర్‌జెయింట్స్‌కు చుక్కలు చూపిస్తూ ప్లేఆఫ్స్ రేసులో మరింత ముందంజ వేసింది. టాప్-4లో నిలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శనతో కదంతొక్కింది. తొలుత లక్నోకు స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన హైదరాబాద్.. ట్రావిస్ హెడ్,అభిషేక్‌శర్మ.. వీరవిహారంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.ఎస్ఆర్హెచ్ గెలుపుతో ప్లేఆఫ్స్ రేసు నుంచి ముంబై తప్పుకుంది.
SRH | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐపీఎల్లో మరో పోరు అభిమానులకు ఫుల్ బిర్యానీ విందు అందించింది. రసవత్తరంగా సాగుతున్న కీలకమైన ప్లేఆఫ్స్ రేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమదైన రీతిలో లక్నో సూపర్‌జెయింట్స్‌ను చిత్తుచేస్తూ గెలుపు ఢంకా మోగించింది. బుధవారం పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో లక్నోపై భారీ విజయం సాధించింది. తొలుత లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 165-4 స్కోరుకు పరిమితమైంది.
ఆయూశ్ బదోని(30 బంతుల్లో 55 నాటౌట్, 9ఫోర్లు), నికోలస్ పూరన్ (26 బంతుల్లో 48 నాటౌట్, 6ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. భువనేశ్వర్(2/12) రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రైజర్స్ 9.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 167 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89 నాటౌట్. 8ఫోర్లు, 8సిక్స్‌లు), అభిషేక్‌శర్మ(28 బంతుల్లో 75 నాటౌట్, 8ఫోర్లు, 6సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీలతో కదంతొక్కారు. లక్నో బౌలర్లు కనీసం ఒక వికెట్ తీయలేకపోయారు. సూపర్ అర్ధసెంచరీతో అదరగొట్టిన హెడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
హెడ్, అభిషేక్ వీరవిహారం:
ఆగ్నికి ఆజ్యం తోడైనట్లు ట్రావిస్ హెడ్‌కు అభిషేక్‌శర్మ తోడవ్వడం హైదరాబాద్ భారీ విజయానికి కారణమైంది. లక్నో నిర్దేశించిన స్వల్ప లక్ష్యఛేదనలో ఆది నుంచే రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరు కలిసి బౌండరీలు అలవోకగా బాదుతూ ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారించారు. యశ్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే వీరి విధ్వంసానికి తెరలేచింది. ఈ ఓవర్లో అభిషేక నాలుగు ఫోర్లతో 17 పరుగులు వచ్చి పడ్డాయి.
ఇక తన వంతు అన్నట్లు హెడ్..గౌతమ్‌ను లక్ష్యంగా చేసుకుంటూ మూడు భారీ సిక్స్‌లు, ఫోర్‌తో గేర్ ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకొచ్చాడు. రవి బిష్ణోయ్ 4వ ఓవర్లో అభిషేక్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. బౌలింగ్ మార్పుగా వచ్చిన నవీనుల్ హక్ ఈసారి రైజర్స్ ఓపెనర్ల బ్యాటింగ్‌కు బలయ్యాడు. ఈ క్రమంలో 16 బంతుల్లో మెరుపు అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. వీరి దూకుడును అడ్డుకునేందుకు లక్నో కెప్టెన్ రాహుల్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది.
మరోమారు బౌలింగ్‌కు వచ్చిన యశ్ ఠాకూర్‌ను అభిషేక్ రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో అరుసుకోవడంతో 20 పరుగులు వచ్చి పడ్డాయి. ఇలా ప్రతీ ఓవర్‌కు 15 పరుగులకు తగ్గకుండా హైదరాబాద్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఈ క్రమంలో పవర్‌ప్లే ముగిసే సరికి రైజర్స్ 107 పరుగులు చేసింది.
ఈ సీజన్లో రెండో అత్యుత్తమ పవర్‌ప్లే స్కోరు నమోదు చేసుకుంది. ఏడో ఓవర్‌కు వచ్చిన బదోనిని హెడ్, అభిషేక్ ఇద్దరు కలిసి దడేల్మనిపించారు. అభిషేక్ 19 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. వీరి బౌండరీల జోరుతో లక్ష్యం అంతకంతకు కరిగిపోగా..యశ్ ఠాకూర్ 10వ ఓవర్ నాలుగో బంతిని అభిషేక్ సిక్స్ కొట్టి మ్యాచ్‌కు ఘనమైన ముగింపు ఇచ్చాడు. 62 బంతులు మిగిలి ఉండగానే హైదరాబాద్ రికార్డు విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.
లక్నో పడుతూ లేస్తూ:
టాస్ గెలిచిన లక్నో మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తాము తప్పు చేసిన సంగతి తెలుసుకునేందుకు లక్నోకు పెద్ద సమయం పట్టలేదు. పిచ్ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఆది నుంచే సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు ఆది నుంచే లక్నో బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. భువనేశ్వర్ మూడో ఓవర్ తొలి బంతికి భారీ షాట్ ఆడబోయిన క్వింటన్ డికాక్(2) నితీశ్‌రెడ్డి క్యాచ్ పట్టడంతో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.
అతడే వేసిన ఐదో ఓవర్లో స్టోయినిస్(3) సన్విర్సింగ్ సూపర్ క్యాచ్‌తో రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. నాలుగో వికెట్‌గా వచ్చిన కృనాల్ పాండ్యా..రాహుల్‌కు జతకలిశాడు. వీరిద్దరు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. పది ఓవర్లు ముగిసే సరికి లక్నో 57 పరుగులకు 3 కీలక వికెట్లు కోల్పోయింది.
ఇన్నింగ్స్ కుదురుకుంటున్న తరుణంలో కృనాల్ పాండ్యా(24) రనౌట్‌గా వెనుదిరుగడంతో లక్నో కష్టాలు మరింత రెట్టింపు అయ్యాయి. అయితే ఇక్కణ్నుంచి నికోలస్ పూరన్, ఆయూశ్ బదోనీ బ్యాటింగ్‌తో లక్నో గాడిలో పడింది. టాపార్డర్ తడబడ్డ చోట..బదోని, పూరన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది ఆఖర్లో ధాటిగా ఆడటంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
సంక్షిప్త స్కోర్లు
లక్నో: 20 ఓవర్లలో 165/4 (బదోని 55 నాటౌట్, పూరన్ 48 నాటౌట్, భువనేశ్వర్ 2/12, కమిన్స్ 1/47), హైదరాబాద్: 9.4 ఓవర్లలో 167/0 (హెడ్ 89 నాటౌట్, అభిషేక్ 75 నాటౌట్)
రికార్డుల హోరు
12 హైదరాబాద్ చేసిన 167 పరుగులలో ఓపెనర్లు తీసిన సింగిల్స్. మిగిలిన పరుగులన్నీ 4, 6 రూపంలో వచ్చినవే. హెడ్, అభిషేక్ కలిసి 16 ఫోర్లు, 14 సిక్సర్లు(ఇవే 148) బాదారు.
ఛేదనను హైదరాబాద్
రాత్రి 9:23 గంటలకు మొదలు పెట్టి 10:15 గంటలకు పూర్తిచేసింది. 42 నిమిషాల్లో ఛేదన పూర్తైంది.
ఐపీఎల్ చరిత్రలో మొదటి 10 ఓవర్ల ఆట తర్వాత అత్యధిక స్కోరు ఇదే (167/0). గతంలో ఈ రికార్డు హైదరాబాద్ పేరిటే (ఢిల్లీపై 158) ఉంది.
62 వంద పరుగులు, అంతకంటే ఎక్కువ టార్గెట్ ఉండి ఎక్కువ బంతులు మిగిలుండగానే విజయం సాధించడం ఐపీఎల్ చరిత్రలో ఇదే ప్రథమం. లక్నోతో మ్యాచ్‌లో హైదరాబాద్ 62 బంతులుండగానే లక్ష్యాన్ని పూర్తిచేసింది.
34 ఐపీఎల్లో అతి తక్కువ బంతుల్లోనే వంద పరుగులు జతచేసిన జోడీలో హెడ్-అభిషేక్ రెండో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో మొదటి స్థానం (30 బంతులు) కూడా వాళ్లదే.
హైదరాబాద్ తరఫున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీలు చేసినవారిలో తొలి నాలుగు స్థానాలు హెడ్-అభిషేక్వే. హెడ్ ఈ సీజన్లో మూడు సార్లు ఆ ఘనత సాధించగా అభిషేక్ ఓసారి ఆ రికార్డు అందుకున్నాడు.