సాకర్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్‌లో అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ స్పెయిన్ అ‘ద్వితీయ’ ప్రదర్శనతో అదరగొట్టింది. టైటిల్ ఫేవరేట్ అర్జెంటీనాను చిత్తుచేసిన యూరోపియన్ చాంపియన్లు.. ఈ టోర్నీలో రెండోసారి విశ్వవిజేతలుగా నిలిచారు. లీగ్, నాకౌట్ దశల్లో ప్రత్యర్థి జట్లపై తిరుగులేని ఎటాకింగ్‌తో రెచ్చిపోయిన అర్జెంటీనాను గోల్ కాదు కదా.. తమ గోల్ పోస్ట్ దరిదాపుల్లోకి కూడా రాకుండా నిలువరించి 1-0తో కప్పును ఎగురేసుకుపోయింది. మ్యాచ్ నిర్ణీత సమయంలో ఇరుజట్లూ గోల్స్ చేయకపోగా 62వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఫెరాన్ టోరెస్ అదనపు సమయం (106వ నిమిషం)లో గోల్‌కొట్టి మెస్సీ సేనతో పాటు అర్జెంటీనా అభిమానులకు ఇప్పట్లో మరిచిపోలేని పీడకలను మిగిల్చాడు.
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : ప్రపంచ ఫుట్‌బాల్‌లో సరికొత్త అధ్యాయం మొదలైంది. అర్జెంటీనాను మట్టికరిపిస్తూ రెండోసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో గెలిచిన స్పెయిన్ సాకర్‌లో అద్వితీయ శక్తిగా మారింది. స్పెయిన్ పేరు చెప్పగానే ఆ దేశంలోని అందమైన ప్రదేశాలతో పాటు శక్తికి, ధైర్యానికి, పోరాటానికి ప్రతీకగా నిలిచే స్పానిష్ బుల్ గుర్తొస్తుంది. ఫిఫా ప్రపంచకప్‌లో స్పెయిన్ జట్టులోని ప్రతీ ఆటగాడు ఒక్కో బుల్లా మారారు. ఎదురైన ప్రతీ ప్రత్యర్థిని ఢీకొంటూ, చివరకు ప్రపంచకప్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.
ఫైనల్లో ఆ జట్టు లియోనెల్ మెస్సీతో కూడిన అర్జెంటీనాతో తలపడటంతో అందరూ మరోసారి మెస్సీసేననే ఫేవరెట్‌గా భావించారు. కానీ మైదానంలో కనిపించింది మాత్రం భిన్నమైన దృశ్యం. 120 నిమిషాల పాటు అర్జెంటీనా ఒక్కసారి కూడా గోల్‌పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకుని షాట్ కొట్టలేకపోయింది. మెస్సీకి బంతి అందిన ప్రతిసారి ముగ్గురు, నలుగురు స్పానిష్ ప్లేయర్లు చుట్టుముట్టారు. ఫైనల్లో రోడ్రి కెప్టెన్సీలోని స్పెయిన్ ఆట చూశాక ఆ జట్టు అందుకున్నది కప్పు మాత్రమే కాదు.. ప్రపంచ ఫుట్‌బాల్‌నే తన గుప్పిట్లోకి తీసుకుందని చెప్పొచ్చు.
దశాబ్ద కాలంగా స్పెయిన్ ఫుట్‌బాల్ అంటే చిన్న పాస్‌లతో బంతిని ఆధీనంలో ఉంచుకునే ‘టికి-టాకా’ స్టయిల్ మాత్రమే గుర్తుకొచ్చేది. 2010లో ఈ వ్యూహంతోనే ఆ జట్టు ప్రపంచకప్ గెలిచింది. కానీ, ఇప్పుడు స్పెయిన్ టీమ్‌లో మరో కోణం చేరింది. ప్రస్తుత కోచ్ లూయిస్ డి లా ఫ్యూయెంటె సాంప్రదాయ పాసింగ్ గేమ్‌కు వేగం, దూకుడును జోడించాడు. అవకాశం దొరికితే నేరుగా దాడి చేయడం.. బంతి కోల్పోతే వెంటనే తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడం కొత్త స్పెయిన్ తీరు. వేగం, తెలివి, క్రమశిక్షణ.. ఈ మూడు కలిసి ‘లా రోజా’ టీమ్‌ను ప్రపంచంలోనే కంప్లీట్ టీమ్‌గా మార్చాయి.
యువ సంచలనం లామిన్ యమాల్ మెరుపు వేగంతో దూసుకెళ్తే… ఇంకో స్ట్రయికర్ నికో విలియమ్స్ ప్రత్యర్థి రక్షణను చీల్చాడు. పెడ్రి, రుయిజ్ ఆటకు అందాన్ని జోడించారు. కెప్టెన్ రోడ్రి వీటన్నింటికీ కేంద్రబిందువుగా నిలిచాడు. ఇక, ప్రత్యర్థి ఆడే విధానాన్ని మార్చేయడమే స్పెయిన్ అసలైన బలం. టెక్నికల్, టాక్టికల్ ప్లానింగ్‌తో ప్రతి క్షణాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న రోడ్రిసేన తుదిపోరులో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా ఎటాకింగ్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసింది. దాంతో టోర్నీలో ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం రెండేసి గోల్స్ చేసిన మెస్సీసేన.. ఫైనల్లో మాత్రం ఒక్కసారైనా స్పెయిన్ గోల్ పోస్ట్‌పైకి వెళ్లే సాహసం చేయలేకపోయింది.
2022 ప్రపంచకప్ తర్వాత లూయిస్ డి లా ఫ్యుయెంటెను స్పానిష్ టీమ్ హెడ్ కోచ్‌గా నియమించినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఫ్యుయెంటెకు పెద్ద క్లబ్‌లకు కోచ్‌గా పనిచేసిన అనుభవం లేదు. వరల్డ్ ఫుట్‌బాల్‌లో తనకు పెద్దగా పేరూ లేదు. కానీ స్పెయిన్ ఫుట్‌బాల్ వ్యవస్థపై అతనికి పూర్తి అవగాహన ఉంది. యూత్ జట్లతో పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుత జాతీయ జట్టులోని ఆటగాళ్లలో చాలామందిని చిన్నప్పటి నుంచే తీర్చిదిద్దాడు. అదే అతడి బలంగా మారింది. ‘మన ఆటను మార్చొద్దు… పరిస్థితులు ఎలా ఉన్నా ఆశలు కోల్పోవద్దు’ అనే బలమైన సందేశంతో జట్టును ప్రపంచ చాంపియన్‌గా నిలబెట్టాడు.
ఈ ప్రపంచకప్ విజయం ఒక్కసారిగా రాలేదు. గత కొన్నేళ్లుగా స్పెయిన్ పురుషుల ఆటలోనే కాకుండా. మహిళల ఫుట్‌బాల్‌లోనూ ప్రపంచాన్ని ఏలుతోంది. యూరోలు.. నేషన్స్ లీగ్‌లు.. ఒలింపిక్స్.. యూత్ ప్రపంచకప్‌లు ఇలా అన్నింటా స్పెయిన్ బుల్స్ ఆధిపత్యమే నడుస్తోంది. గత ఐదేండ్లలో అండర్-17 నుంచి సీనియర్ స్థాయి వరకు స్పానిష్ టీమ్ ఏకంగా 16 అంతర్జాతీయ టైటిళ్లను కైవసం చేసుకోవడం విశేషం. పురుషుల జట్టు వరుసగా 38 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగకుండా దూసుకెళ్తూ ఫుట్‌బాల్ చరిత్రలోనే సుదీర్ఘ అజేయ రికార్డును నెలకొల్పింది.
అర్జెంటీనాకు మెస్సీ.. ఫ్రాన్స్‌కు ఎంబాపె, ఇంగ్లండ్‌కు హ్యారీకేన్, బ్రెజిల్‌కు నెయ్మార్, నార్వేకు హాలండ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ జట్టులో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఓ సూపర్ స్టార్ ఉన్నాడు. కానీ, స్పెయిన్ టీమ్‌లో మాత్రం అలాంటి ఒకే ఒక్క సూపర్ స్టార్ లేడు. కానీ 11 మంది స్టార్లున్నారు. ఒక్కరు తప్పు చేస్తే ఇంకొకరు కప్పిపుచ్చారు. ఒక్కరు అలసిపోతే మరొకరు పరుగులు తీశారు. ఒక్కరు గోల్ చేస్తే అంతా సంబరపడ్డారు. వ్యక్తుల కంటే జట్టే గొప్పదని స్పెయిన్ ప్రపంచానికి నిరూపించింది.

ఫైనల్లో ఓడి తీవ్ర నిరాశకు గురైన అర్జెంటీనాకు మిడ్‌ఫీల్డర్ లియాండ్రొ పరెడెస్ దుందుడుకు ప్రవర్తన మరింత చెడ్డపేరు తీసుకొచ్చింది. ఆట ముగిసిన వెంటనే అతడు ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవకు దిగడమే ఇందుకు కారణం. ఆట ఆఖరి విజిల్ మోగాక సంబురాలు చేసుకుంటున్న స్పెయిన్ ప్లేయర్ల వద్దకు వెళ్లిన అతడు పలువురు ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని వారిపై దాడి చేశాడు. ముందు స్పెయిన్ డిఫెండర్ ఎరిక్ గార్సియా వద్దకు వెళ్లి అతడిని తోసేశాడు. అనంతరం గార్సియాకు మద్దతుగా వచ్చిన సహచరుడు గావిని సైతం రెండుసార్లు కిందపడేసి అతడిపై కోపంతో ఊగిపోయాడు. అర్జెంటీనా కోచ్ స్కలోని సహా ఇతర ఆటగాళ్లు పరెడెస్ను అడ్డుకున్నా వినకుండా స్పెయిన్ ప్లేయర్లపై మళ్లీ దాడి చేసేందుకు యత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.

గోల్స్ చేసినవారే హీరోలు అనుకునే ఫుట్‌బాల్‌లో స్పెయిన్ నాయకుడు రోడ్రి మరో నిర్వచనం ఇచ్చాడు. ఈ టోర్నీలో అతడు ఎక్కువగా గోల్స్ చేయకపోవచ్చు కానీ మ్యాచ్‌ను ఎలా ఆడాలో నిర్ణయించింది అతడే. ఎప్పుడు వేగం పెంచాలి..ఎప్పుడు ఆటను నెమ్మదించాలి..ఎప్పుడు ఒత్తిడి పెంచాలి ఇవన్నీ మిడ్‌ఫీల్డర్ రోడ్రి నిర్ణయాలే. అందుకే ఈ ప్రపంచకప్‌లో అతడు స్పెయిన్‌కు గుండెకాయగా మారాడు. అతని ప్రశాంతతే మొత్తం జట్టులో కనిపించింది.డిఫెన్స్‌కు, ఎటాకింగ్‌కు మధ్య వారధిలా ఉంటూ మ్యాచ్ లయను నిర్దేశించిన రోడ్రి అత్యుత్తమ ఆటగాడిగా గోల్డెన్ బాల్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
790 ఈ ప్రపంచకప్‌లో రోడ్రి అందించిన పాస్‌లు. 2022 ఎడిషన్‌లో అత్యధికంగా 638 పాస్‌లతో తన పేరిటే ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.