Quinton De Kock | వన్డే ప్రపంచకప్‌లో అడ్డూ అదుపూ లేకుండా దూసుకెళ్తున్న దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్.. భారత స్టార్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టాడు. తాజా మెగాటోర్నీలో బంగ్లాదేశ్‌పై మూడో సెంచరీ నమోదు చేసుకున్న డికాక్.. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన అనంతరం డికాక్ 407 పరుగులతో టాప్కు దూసుకెళ్లగా.. భారత స్టార్లు విరాట్ కోహ్లీ (354), రోహిత్ శర్మ (311) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు.
2015, 2019 వన్డే ప్రపంచకప్‌లలోనూ దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన డికాక్ ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోగా.. తాజా మెగాటోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ మూడు శతకాలు బాదడం గమనార్హం. దక్షిణాఫ్రికా నుంచి ఒకే ప్రపంచకప్‌లో మూడు సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గానూ డికాక్ రికార్డుల్లోకెక్కాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో సెంచరీ (100) చేసిన డికాక్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాపై కూడా శతకం (109) నమోదు చేసుకున్నాడు. ఇక తాజాగా బంగ్లాతో పోరులో డికాక్ (140 బంతుల్లో 174; 15 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ సెంచరీతో కదంతొక్కాడు.
ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన డికాక్ 101 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గత రెండు పర్యాయాలు శతకం అనంతరం వెనుదిరిగిన డికాక్ ఈ సారి బంగ్లా బౌలర్లను చీల్చి చెండాడుతూ అంతకుమించిన విధ్వంసాన్ని మిగిల్చాడు. కేవలం 39 బంతుల్లోనే 74 పరుగులతో అదరగొట్టాడు. ఇందులో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం గమనార్హం. ఒక దశలో డికాక్ డబుల్ సెంచరీ చేయడం ఖాయమే అనిపించినా.. హసన్ మసూద్ బౌలింగ్‌లో నసుమ్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.