వామ్మో.. అదేం కొట్టుడు రా బాబు! ఒకరి తర్వాత ఒకరు వంతులు వేసుకున్నట్లు.. వాటాలు పంచుకున్నట్లు.. వచ్చినవాళ్లు వచ్చినట్లు విధ్వంసకాండ రచించడంతో.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా రికార్డు స్కోరు చేసింది. డికాక్, డసెన్ సెంచరీలతో జట్టుకు మంచి పునాది వేస్తే.. మార్క్మ్ ఆకాశమే హద్దుగా చెలరేగి మెగాటోర్నీలో ఫాస్టెస్ట్ సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ముగ్గురి దంచుడుకు దక్షిణాఫ్రికా కొండంత స్కోరు చేయగా.. ఛేదనలో కుషాల్ మెండిస్, చరిత అసలంక, డసున్ షనక అదరక బెదరక ఎదురు నిలిచే ప్రయత్నం చేయడంతో.. లంక పోరాడి పరువు నిలబెట్టుకుంది!
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా చరిత్రకెక్కింది. బాదుడే పరమావధిగా బరిలోకి దిగిన సఫారీ ఆటగాళ్లు విశ్వరూపం కనబర్చడంతో శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 102 పరుగుల తేడాతో శ్రీలంకపై జయభేరి మోగించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. 1975 నుంచి ప్రారంభమైన మెగాటోర్నీ చరిత్రలో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. ఓపెనర్ క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), డసెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్మ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో లంకేయులను చీల్చిచెండాడారు. ఆఖర్లో క్లాసెన్ (32; ఒక ఫోర్, 3 సిక్సర్లు), మిల్లర్ (39 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా విజృంభించడంతో సఫారీ జట్టు రికార్డు స్కోరు చేయగలిగింది. లంక బౌలర్లలో మధుషనక రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో లంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. అసలంక (64 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), కుషాల్ మెండిస్ (42 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), కెప్టెన్ డసున్ షనక (62 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. సఫారీ బౌలర్లలో గెరాల్డ్ మూడు, జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ తలా 2 వికెట్లు పడగొట్టారు.
దక్షిణాఫ్రికా: 428/5 (డసెన్ 108, మార్క్మ్ 106; మధుషనక 2/86),
శ్రీలంక: 44.5 ఓవర్లలో 326 ఆలౌట్ (అసలంక 79, కుషాల్ మెండిస్ 76; రబాడ గెరాల్డ్ 3/68, రబడ 2/50)
428/5 శ్రీలంకపై దక్షిణాఫ్రికా 2023 ఢిల్లీలో
417/6 అఫ్గానిస్థాన్‌పై ఆస్ట్రేలియా 2015 పెర్త్‌లో
413/5 బెర్ముడాపై భారత్ 2007 పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో
411/4 ఐర్లాండ్‌పై దక్షిణాఫ్రికా 2015 కాన్బెర్రాలో
408/5 వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా 2015 సిడ్నీలో
వరల్డ్‌కప్‌ను ఆస్వాదించేందుకు మైదానానికి విచ్చేసిన ప్రేక్షకులకు ఈ మ్యాచ్ చక్కటి వినోదాన్ని పంచింది. మెగాటోర్నీలో ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లకు అభిమానులు పెద్ద సంఖ్యలో రాకపోవడంతో.. నిర్వాహకులు కాస్త ఆందోళన చెందినా.. దక్షిణాఫ్రికా, శ్రీలంక మ్యాచ్ ఆ అనుమానాలను పటాపంచలు చేసింది. ఇరు జట్లు కలిసి 754 పరుగులు చేసిన ఈ పోరులో మొత్తంగా.. 74 ఫోర్లు, 31 సిక్సర్లు నమోదయ్యాయి. మొదట దక్షిణాఫ్రికా జట్టు 45 ఫోర్లు, 14 సిక్సర్లతో 264 పరుగులు రాబడితే.. ఆ తర్వాత లంక 29 ఫోర్లు, 17 సిక్సర్లతో 218 రన్స్ పిండుకుంది.
ఐసీసీ మెగాటోర్నీల్లో దురదృష్టాన్ని వెంట పెట్టుకొని తిరిగే జట్టుగా ముద్రపడ్డ దక్షిణాఫ్రికా ఈ సారి మాత్రం తాము ట్రోఫీ పట్టేందుకే వచ్చామని తొలి మ్యాచ్‌తోనే చాటింది. భయం అన్నదే ఎరగనట్లు.. అసలు అలుపు అనే పదమే తమ నిఘంటువులో లేనట్లు.. బంతిపై ఏదో ఆజన్మ శత్రుత్వం ఉన్నట్లు.. లంకేయులపై సఫారీలు నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు.
వరల్డ్‌కప్‌లో 400 పైచిలుకు పరుగులు చేయడం దక్షిణాఫ్రికాకు ఇది మూడోసారి. 2015లో ఐర్లాండ్ (411/4)పై, వెస్టిండీస్ (408/5)పై సఫారీలు ఈ మార్క్ దాటారు. ఓవరాల్‌గా వన్డే క్రికెట్లో ఆ జట్టు నాలుగొందల పరుగులు చేయడం ఇది ఎనిమిదో సారి.
శ్రీలంకపై ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు (428/5) కూడా ఇదే. 2009లో రాజ్‌కోట్ వేదికగా జరిగిన వన్డేలో భారత జట్టు లంకపై 414/7 చేసిన స్కోరు రెండో స్థానానికి చేరింది.
అత్యధిక పరుగుల జాబితా
439/2 వెస్టిండీస్‌పై 2015లో
438/9 ఆస్ట్రేలియాపై 2006లో
438/4 భారత్‌పై 2015లో
428/5 శ్రీలంకపై 2023లో
ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక (428/5) స్కోరు. 2015లో ఆస్ట్రేలియా చేసిన 417 పరుగుల స్కోరు (అఫ్గానిస్థాన్‌పై) రెండో స్థానానికి చేరింది. 413 పరుగులతో (బెర్ముడాపై; 2007లో) భారత్ మూడో స్థానంలో ఉంది. వరల్డ్‌కప్‌లో అత్యంత వేగవంతమైన (49 బంతుల్లో) సెంచరీ చేసిన ప్లేయర్‌గా మార్క్మ్ చరిత్రకెక్కాడు. కెవిన్ ఓబ్రయాన్ (50 బంతుల్లో ఇంగ్లండ్‌పై; 2011లో) రెండో స్థానంలో ఉన్నాడు. మెగాటోర్నీలో ఒకే మ్యాచ్‌లో ఒకే జట్టుకు చెందిన ముగ్గురు ప్లేయర్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి.
వన్డే క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాకు ఇది (428/5) నాలుగో అత్యధిక స్కోరు. 439/2 (వెస్టిండీస్‌పై 2015లో), 438/9 (ఆస్ట్రేలియాపై 2006లో), 438/4 (భారత్‌పై 2015లో) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.