అబుధాబి: సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాకు శుభారంభమే దక్కలేదు. నాలుగో ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు కూల్చిన రబాడ ఆ జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఓపెనర్ మొహమ్మద్ నైమ్ (9), సౌమ్య సర్కార్ (0) ఆ ఓవర్లో పెవిలియన్ చేరారు.
ఆ తర్వాత ఆరో ఓవర్లో మరోసారి బంతి అందుకొని బంగ్లా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ముష్ఫికర్ రహీమ్ (0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత ఏ దశలోనూ బంగ్లా జట్టు కోలుకోలేదు. లిటాన్ దాస్ (24) కాసేపు నిలబడినా అతనికి అవతలి ఎండ్ నుంచి ఎటువంటి సహకారం అందలేదు.
కెప్టెన్ మహ్మదుల్లా (3), ఆఫిఫ్ హొస్సేన్ (0), షమీమ్ హొస్సేన్ (11), తస్కిన్ అహ్మద్ (3), నాసుమ్ అహ్మద్ (0) ఎవరూ నిలబడలేదు. జట్టు స్కోరును కనీసం వంద పరుగులు దాటిస్తాడని అనుకున్న మెహెదీ హసన్ (27) కూడా షంసీ బౌలింగ్లో అవుటయ్యాడు.
ఈ క్రమంలో బంగ్లా జట్టు 84 పరుగులకే ఆలౌట్ అయింది. సఫారీ బౌలర్లలో రబాడ, నార్ట్జీ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, షంసీ 2, ప్రిటోరియస్ ఒక వికెట్ తమ ఖాతాల్లో వేసుకున్నారు.