అబుదాబి: టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కరోనా వైరస్ బారినపడ్డాడు. అబుదాబి వేదికగా జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పాల్గొని స్వదేశం స్పెయిన్‌కు చేరుకున్నాక అతడికి పాజిటివ్ నిర్ధారణ అయింది. స్పెయిన్‌లోకి అడుగుపెట్టిన అనంతరం చేసుకున్న ఆర్టీ పీసీఆర్ టెస్టులో కొవిడ్-19 పాజిటివ్‌గా తేలిందని నాదల్ ట్విట్టర్లో తెలిపాడు. కొన్ని లక్షణాలు కనిపించాయని.. కోలుకుంటున్నట్లు వివరించాడు. ‘ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నా. నన్ను ఇటీవల కాంటాక్ట్ చేసిన వారందరి కోసం ఈ ప్రకటన చేస్తున్నా’ అని నాదల్ ట్వీట్ చేశాడు. కాలి గాయం కారణంగా వింబుల్డన్, టోక్యో ఒలింపిక్స్, యూఎస్ ఓపెన్‌కు దూరమైన నాదల్.. నాలుగు నెలల అనంతరం శుక్రవారం అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో రాకెట్ పట్టాడు. ఆ మ్యాచ్‌లో నాదల్ బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే చేతిలో పరాజయం పాలయ్యాడు. మ్యాచ్‌కు ముందు జుయాన్ కార్లస్తో కలిసి నాదల్ మాస్క్ లేకుండా తిరిగాడని స్పెయిన్ మీడియా వర్గాలు వెల్లడించాయి.