హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) అధ్యక్ష పదవిని అధిష్టించబోతున్న దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష ఎన్నిక గర్వకారణమని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రతిష్ఠాత్మక అధ్యక్ష పదవికి ఉష మాత్రమే పోటీలో ఉండగా, ఉపాధ్యక్షుడిగా హైదరాబాదీ ఏస్ షూటర్ గగన్ నారంగ్ ఎన్నిక కూడా లాంఛనప్రాయం కాబోతున్నది.
షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 10న ఎన్నికలు జరుగాల్సి ఉన్నా.. పోటీ లేకపోవడంతో ఏకగీవ్రం కానుంది. ఈ నేపథ్యంలో పీటీ ఉష, గగన్ నారంగ్‌కు వెంకటేశ్వర్‌రెడ్డి సోమవారం శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలో వీరిద్దరిని హైదరాబాద్‌కు ఆహ్వానించి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఉష, నారంగ్ సేవలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని ఆయన అన్నారు.