అద్భుతం ఆవిష్కృతమైంది. ఘన చరిత్ర కల్గిన ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీపై సెర్బియా యోధుడు నోవాక్ జొకోవిచ్ చెరగని సంతకం చేశాడు. టెన్నిస్ ఉన్నంత కాలం తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా పరాజయాన్ని పరిచయం చేస్తూ గెలుపు బావుటా ఎగురవేశాడు. సమకాలీకులు ఫెదరర్, నాదల్‌తో పోటీపడుతూ గ్రాండ్‌స్లామ్ టైటిల్ రేసులో మరో అడుగు ముందుకేశాడు. వరుసగా నాలుగోసారి వింబుల్డన్ ట్రోఫీని సగర్వంగా ముద్దాడుతూ బ్రిటన్ గడ్డపై సెర్బియా సత్తా ఏంటో చూపెట్టాడు. ఆస్ట్రేలియా ప్లేయర్ నిక్ కిరియోస్‌ను వరుస సెట్లలో చిత్తుచేస్తూ ఓవరాల్‌గా ఏడోసారి వింబుల్డన్‌ను తన ఖాతాలో వేసుకుని దిగ్గజ పీట్ సంప్రాస్ సరసన నిలిచాడు.
వింబుల్డన్: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీలో నోవాక్ జొకోవిచ్ అప్రతిహత విజయయాత్ర కొనసాగుతున్నది. వరుసగా నాలుగో ఏడాది జొకో వింబుల్డన్ ట్రోఫీని దక్కించుకుని తనకు తిరుగులేదని ఘనంగా చాటిచెప్పాడు. తాను బరిలోకి దిగనంత వరకే..ఒక్కసారి పోటీకి సై అన్నానంటే ప్రత్యర్థి బలాదూర్ అన్న తరహాలో జొకోవిచ్ వరుస విజయాలతో దుమ్మురేపాడు. ఆదివారం ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ జొకోవిచ్ 4-6, 6-3, 6-4, 7-6(7/3) తేడాతో నిక్ కిరియోస్(ఆస్ట్రేలియా)పై అద్భుత విజయం సాధించాడు. మూడు గంటల పాటు జరిగిన తుది పోరు అభిమానులను ఆకట్టుకుంది. సెంటర్ కోర్టులో దాదాపు 15000 మంది ప్రేక్షకుల సమక్షంలో ఇద్దరు కొదమసింహాల్లా తలపడిన తీరు వారెవ్వా అనిపించింది.
అలవాటు ప్రకారం ప్రత్యర్థికి తొలి సెట్ కోల్పోయిన జొకో..మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. కిరియోస్ పుంజుకునేందుకు శతధా ప్రయత్నించినా..తన సుదీర్ఘ అనుభవాన్ని ఉపయోగించుకుంటూ పాయింట్లు కొల్లగొడుతూ పోయాడు. ఓవైపు వ్యవహార శైలితో కిరియోస్ రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేసినా ఎక్కడా తడబాటుకు తావు ఇవ్వకుండా సెట్ సెట్‌కు ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయాడు. సూపర్ సర్వ్‌లకు తోడు సుదీర్ఘ వ్యాలీలు, బ్యాక్‌హ్యాండ్, ఫోర్ హ్యాండ్ షాట్లతో కిరియోస్‌ను కోర్టులో జొకో ముప్పుతిప్పలు పెట్టాడు. డిఫెండింగ్ చాంపియన్‌ను ఎదుర్కొనేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా..ఆస్ట్రేలియన్ నిక్కు సాధ్యపడలేదు.
తొలి సెట్ గెలిచిన జోరు కొనసాగించడంలో విఫలమైన కిరియోస్..జొకో దగ్గర మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కొని తెచ్చుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో జొకో 15 ఏస్‌లు కొడితే కిరియోస్ అందుకు రెండింతలు 30 ఏస్‌లు సంధించాడు. విన్నర్ల విషయంలో జొకో (46)పై కిరియోస్ 62 ఆధిక్యం కనబరిచినా..అనవసర తప్పిదాలు(33) అతడి కొంపముంచాయి. ఇదే అదనుగా చెలరేగిన సెర్బియా స్టార్ వెనుదిరిగి చూసుకోలేదు. సెట్ సెట్ కు దూకుడు పెంచుతూ పోయాడు.
పచ్చిక తిని..
కిరియోస్ గెలిచిన తర్వాత జొకోవిచ్ తనదైన శైలిలో గెలుపు సంబురాలు చేసుకున్నాడు. కోర్టులో కలియతిరుగుతూ తన భార్య, కోచ్‌తో గెలుపును తనివితీరా ఆస్వాదించాడు. ఈ క్రమంలో తన సిగ్నేచర్ ైస్టెల్లో కోర్టులో పచ్చిక తిని వింబల్డన్పై తన ప్రేమను చాటుకున్నాడు.
వింబుల్డన్ ట్రోఫీని కైవసం చేసుకోవడం జొకోకు ఇది వరుసగా నాలుగోసారి(2018, 19, 21, 22). 2020లో కరోనాతో టోర్నీ రద్దయ్యింది.