టోక్యో : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా అదరగొట్టాడు. బుధవారం జరిగిన పురుషుల జావెలిన్‌త్రో ఈవెంట్లో బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ నీరజ్ తన తొలి ప్రయత్నంలోనే అర్హత మార్క్(84.50మీ)ను అధిగమించాడు. గ్రూపు-ఏ నుంచి పోటీపడ్డ నీరజ్..బరిసెను 84.85మీటర్ల దూరం విసిరి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న నీరజ్ టోక్యోలో తన టైటిల్‌ను నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టాడు.
గ్రూపు-ఏలో జర్మన్ జావెలిన్‌త్రోయర్ జులియన్ వెబర్‌తో సహా కేశర్న్ వాల్కట్, జాకబ్ వాల్దిచ్తో కలిసి పోటీకి దిగిన చోప్రా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచాడు. గురువారం జరిగే ఫైనల్లో పసిడి పతకం సాధించడం ద్వారా రెండు సార్లు టైటిల్ సాధించిన దిగ్గజ అథ్లెట్లు జాన్ జలెంజీ(93,95), పీటర్స్(19, 22) సరసన నిలిచేందుకు చోప్రా పట్టుదలతో ఉన్నాడు. పారిస్(2024) ఒలింపిక్స్ తర్వాత పాకిస్థాన్ త్రోయర్ అర్షద్ నదీమ్‌తో కలిసి నీరజ్ పోటీపడబోతున్నాడు.