న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ)లో నరిందర్ బాత్రా అధ్యాయం ముగిసింది. ఇన్నేండ్లు జోడు పదవులు అనుభవించిన బాత్రాకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. హాకీ ఇండియా (హెచ్ఐ) జీవితకాల సభ్యుడిగా ఐవోఏ అధ్యక్ష పదవిని బాత్రా అధిష్టించడాన్ని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. మాజీ హాకీ ప్లేయర్ అస్లామ్షేర్ఖాన్ దాఖలు చేసిన పిటీషన్ను నజ్మీ వాజిరి, స్వర్ణకంట శర్మతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. లైఫ్ మెంబర్ లేదా లైఫ్ ప్రెసిడెంట్ లాంటి పదవులు చట్ట విరుద్ధమంటూ తీర్పునిచ్చింది. దీంతో ఐవోఏ అధ్యక్ష పదవితో పాటు హాకీ ఇండియా జీవితకాల సభ్యుడిగా బాత్రా వైదొలగక తప్పని పరిస్థితి ఎదురైంది. హైకోర్టు తాజా తీర్పుతో ఖాళీ అయిన ఐవోఏ అధ్యక్ష పదవిలో ప్రస్తుత సీనియర్ ఉపాధ్యక్షుడు ఏకే ఖన్నా బాధ్యతలు అందుకోనున్నాడు.