టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమైన తొలి రోజే రజత పతకం సాధించి..యావత్ భారతావనిని ఆనంద డోలికల్లో ముంచెత్తిన స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను.. మరో మెగాటోర్నీకి సిద్ధమవుతున్నది. ఇంకో 8 రోజుల్లో ప్రారంభం కానున్న కామన్వెల్త్ క్రీడల్లో మీరా అదే జోరు కొనసాగిస్తూ పసిడి కాంతులు విరజిమ్మాలని చూస్తున్నది. బలం, బలగంతో కూడిన భారత లిఫ్టింగ్ బృందం.. రికార్డులు తిరగరాస్తూ ఈ సారి మరిన్ని మెడల్స్ సాధించేందుకు సిద్ధమైన నేపథ్యంలో కామన్వెల్త్లో భారత వెయిట్ లిఫ్టర్ల పతక అవకాశాలపై ప్రత్యేక కథనం..
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం;ఇతర క్రీడలతో పోల్చుకుంటే కామన్వెల్త్లో ఎక్కువ పతకాలు సాధించిన.. వెయిట్ లిఫ్టింగ్‌పై మరోసారి భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. టోక్యో ఒలింపిక్స్ రజత విజేత మీరాబాయి చాను సారథ్యంలో ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో 15 మంది సభ్యుల బృందం పాల్గొననుంది. ఈ నెల 28 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీలో మన దేశం నుంచి ఏడుగురు మహిళలు, ఎనిమిది మంది పురుష లిఫ్టర్లు బరిలోకి దిగనున్నారు. ఇందులో స్టార్ లిఫ్టర్ చానుతో పాటు.. యువ సంచలనం జెరేమీ లాల్రినుంగా, పోపీ హజారికా, సంకేత్ సాగర్ ఉన్నారు. 1990, 2002, 2018 కామన్వెల్త్ క్రీడల వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన గత క్రీడల్లో భారత లిఫ్టర్లు 9 పతకాలు (5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు) సాధించారు. అప్పుడు దేశానికి తొలి పతకం అందించిన మీరాబాయి చాను ఈసారి కూడా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్నది. ఈ విభాగంలో మీరా ప్రత్యర్థులు దరిరాపుల్లో కూడా లేకపోగా.. ఇటీవలి ప్రదర్శన ప్రకారం మీరా తర్వాత రెండో స్థానంలో ఉన్న లిఫ్టర్ 37 కేజీల దూరంలో ఉంది. ‘కామన్వెల్త్ క్రీడల్లో పతకం నెగ్గడం నాకు పెద్ద కష్టం కాదనుకుంటున్నా. ఈ టోర్నీలో ప్రధానంగా నాతో నాకే పోటీ. వ్యక్తిగత ప్రదర్శన మరింత మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తా’ అని మీరా ఇటీవల పేర్కొంది. ఇప్పటికే కామన్వెల్త్లో ఓ స్వర్ణం, ఓ రజతం నెగ్గిన చాను ఈసారి కూడా పసిడి పట్టాలని చూస్తుంటే.. పూనమ్, ఉషా, పూర్ణిమ సంచలన ప్రదర్శనతో తమ పేరు రికార్డుల్లో నమోదు చేసుకోవాలనుకుంటున్నారు. మనవాళ్లకు ప్రధానంగా నైజీరియా, మలేషియా లిఫ్టర్ల నుంచి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జెరేమీపై భారీ అంచనాలు
అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న జెరేమీ లాల్రినుంగా (67 కేజీలు)పై కూడా భారీ ఆశలు ఉన్నాయి. జూనియర్, యూత్ విభాగాల్లో లెక్కకు మిక్కిలి పతకాలు నెగ్గిన ఈ 19 ఏండ్ల లిఫ్టర్.. సీనియర్ విభాగంలో అదే జోష్ కొనసాగించాలని చూస్తున్నాడు. కామన్వెల్త్లో ఇప్పటికే రెండు పతకాలు (2014 రజతం, 2018 కాంస్యం) సాధించిన వికాస్ ఠాకూర్ (96 కేజీలు) హ్యాట్రిక్ నమోదు చేయాలనుకుంటుంటే.. గురురాజ (61 కేజీలు) వరుసగా రెండోసారి మెడల్‌తో మెరువాలని చూస్తున్నాడు. అజయ్ సింగ్ (81 కేజీలు), అచింత షౌలీ (73 కేజీలు) తొలిసారి బరిలోకి దిగుతున్న పోటీల్లోనే రికార్డులు తిరుగురాయాలని భావిస్తున్నారు.
గతం ఘనం
ఇప్పటివరకు కామన్వెల్త్ క్రీడల చరిత్రలో భారత వెయిట్ లిఫ్టర్లు 125 పతకాలు సాధించారు. ఇందులో 43 స్వర్ణాలు, 48 రజతాలు, 34 కాంస్యాలు ఉన్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (159) అగ్రస్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో కొనసాగు తున్నది.
మహిళలు: మీరాబాయి చాను (49 కేజీలు), బింద్యారాణి దేవి (55), హజారిక (59), హర్జిందర్ (71), పూనమ్ (76), ఉషా కుమారి (87), పూర్ణిమ (ప్లస్ 87).
పురుషులు: సంకేత్ సాగర్ (55 కేజీలు), గురురాజ (61), జెరేమీ (67), ఆచింట (73), అజయ్ (81), వికాస్ (96), లవ్‌ప్రీత్ (109), గుర్దీప్ (ప్లస్ 109).