CWC 2023 Final: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. ఆదివారం భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న వరల్డ్ కప్ ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు కళ్లల్లో వత్తులు వేసుకుని వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ సెంటిమెంట్ అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ గెలవాలంటే ఆ మ్యాచ్‌లో సెంచరీ చేసిన బ్యాటర్‌కు సంబంధించిన జట్టు తుదిపోరులో నెగ్గి విశ్వవిజేతగా నిలుస్తోంది. గత 13 ఎడిషన్లలో ఒకే ఒక్కసారి తప్ప మిగిలిన ప్రతీసారి ఒక ఆటగాడు సెంచరీ చేసిన జట్టే గెలిచింది. చరిత్ర చెప్పిన సత్యం ఇది.
చరిత్రలోకి వెళ్తే.. వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఇప్పటివరకూ ఆరు సెంచరీలు నమోదయ్యాయి. వీటిలో ఐదుసార్లూ సెంచరీ చేసిన ప్లేయర్ జట్టే విశ్వవిజేతగా నిలిచింది. వివరాల్లోకెళ్తే,.. 1975లో జరిగిన తొలి వన్డే ప్రపంచకప్‌లో విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్.. ఆస్ట్రేలియాపై 85 బంతుల్లోనే 102 పరుగులు చేశాడు. లాయిడ్ సెంచరీ సాయంతో విండీస్.. ఆసీస్ ఎదుట 292 పరుగల లక్ష్యాన్ని నిలపగా కంగారూలు 274 పరుగులకే ఆలౌట్ అయ్యారు. 1979లో విండీస్ – ఇంగ్లండ్ మధ్య ఫైనల్ జరుగగా తుది పోరులో కరేబియన్ విధ్వంసక వీరుడు వివిన్ రిచర్డ్స్ సెంచరీ (138) సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో విండీస్ 286 పరుగులకు ఆలౌట్ కాగా ఇంగ్లండ్ 194 పరుగులకే ఆలౌట్ అయింది.
1979 తర్వాత మళ్లీ 1996 వరకూ ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఒక్క బ్యాటర్ కూడా సెంచరీ చేయలేదు. 96లో ఆసీస్ – శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్ పోరులో కంగారూలు నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక ఆల్ రౌండర్ అరవింద డి సిల్వ సెంచరీ (107) సాధించి ఆ జట్టుకు తొలి వరల్డ్ కప్ అందించాడు.
2003 వరల్డ్ కప్ ఫైనల్ భారత్ – ఆసీస్ మధ్య జరుగగా ఈ పోరులో ఆస్ట్రేలియా సారథి రికీ పాంటింగ్ 121 బంతుల్లోనే 140 పరుగులు చేసి భారత్ ఎదుట 360 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. బదులుగా భారత్ 234 పరుగులకే చేతులెత్తేసింది.
భారత్ వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్‌లో ధోనీ సేన.. శ్రీలంకతో ఫైనల్ ఆడింది. ఈ మ్యాచ్‌లో లంక దిగ్గజం మహేళ జయవర్దెనే సెంచరీ (103) చేయడంతో ఆ జట్టు భారత్ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అయితే ధోనీ (91 నాటౌట్), గంభీర్ (97)ల పోరాటంతో భారత్ వరల్డ్ కప్ గెలుచుకుంది. ఈ ఒక్క సందర్భంలోనే వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ చేసిన బ్యాటర్ జట్టు ఓటమిపాలైంది.
మరి అహ్మదాబాద్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగబోయే ఫైనల్ పోరులో పాత సంప్రదాయమే కంటిన్యూ అవుతుందా..? అలాగే జరిగితే తుది పోరులో సెంచరీ చేసేదెవరు..? అన్న ఆసక్తినెలకొంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ నుంచి రోహిత్ (1), కోహ్లీ (3), శ్రేయస్ (2), కెఎల్ రాహుల్ (1) సెంచరీలు చేయగా ఆసీస్ నుంచి మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లు తలా రెండు సెంచరీలు ట్రావిస్ హెడ్ ఒక శతకం చేశారు.