lionel Messi : అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తన కల నిజం కావడంతో పట్టలేనంత సంతోషంతో ఉన్నాడు. వరల్డ్ కప్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న వీడియోలు, ఫొటోల్ని అతను సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా మెస్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో గుడ్‌మార్నింగ్ చెప్తూ పోస్ట్ పెట్టాడు. అందులోని రెండు ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. కారణం ఏంటంటే.. మొదటి ఫొటోలో మెస్సీ, ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని పక్కనే పెట్టుకుని నిద్రిస్తున్నాడు. మరో ఫొటోలో బెడ్ మీద నుంచే సగర్వంగా అతను ఫిఫా ట్రోఫీని చూపిస్తున్నాడు. ఈ పోస్టును గంటలోపే 94 లక్షలమందికి పైగా లైక్ చేశారు. ‘లెజెండ్స్ ట్రోఫీలతో నిద్రపోతారు’ అంటూ ఒక యూజర్ కామెంట్ చేశాడు. అయితే.. కొందరు వలర్డ్ కప్ ట్రోఫీని అవమానిస్తున్నాడంటూ మెస్సీని విమర్శిస్తున్నారు.
ఆదివారం లూసెయిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా షూటౌట్లో 4-2తో ఫ్రాన్స్‌ను ఓడించింది. మెస్సీ రెండు గోల్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో, 36 ఏళ్ల తర్వాత మళ్లీ అర్జెంటీనా ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. అంతేకాదు 35 ఏళ్ల మెస్సీ వరల్డ్ కప్ కల కూడా నెరవేరింది. దాంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందుకు తగ్గట్టే మెస్సీ సెలబ్రేషన్స్ ఉన్నాయి. వరల్డ్ కప్ విజయం తర్వాత టీమ్ రూమ్‌లో అతను టేబుల్ ఎక్కి ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. కప్పు గెలిచి స్వదేశం చేరుకున్న మెస్సీ బృందానికి ఘన స్వాగతం లభించింది.