వావ్..వావ్! వర్ణించడానికి మాటల్లేవ్! శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య హై వోల్టెజ్ పోరు చూసిన ఫ్యాన్స్‌కు కలిగిన అనుభూతి ఇది. కోల్‌కతా నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యఛేదనలో హైదరాబాద్ ఆఖరి మెట్టుపై బోల్తా కొట్టింది. పోరాడితే పోయేదేమి లేదన్న తరహాలో గెలుపు ఆశలు అడుగంటిన వేళ క్లాసెన్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ ఫినిక్స్ పక్షిలా లేచింది. విజయానికి ఆరు బంతుల్లో 13 పరుగులు అవసరమైన దశలో తొలి బంతిని భారీ సిక్స్‌గా మలిచిన క్లాసెన్..జట్టును గెలిపించలేకపోయాడు. రానా బౌలింగ్‌లో క్లాసెన్, షాబాజ్ ఔట్ కావడంతో హైదరాబాద్ ఓటమివైపు నిలిచింది. తొలుత రస్సెల్ వీరవిహారంతో కోల్‌కతా భారీ స్కోరు అందుకుంది. సుడిగాలి ఇన్నింగ్స్‌తో రస్సెల్..హైదరాబాద్ బౌలర్లను ఊచకోత కోశాడు.
కోల్‌కతా: ఐపీఎల్-17వ సీజన్లో మూడో మ్యాచే అభిమానులను ఓ ఊపు ఊపింది. ఆఖరి బంతి వరకు ఊపిరి బిగపట్టి చూసిన మ్యాచ్‌లో కోల్‌కతా 4 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యఛేదనలో హైదరాబాద్ 204/7 స్కోరు చేసింది. క్లాసెన్ (29 బంతుల్లో 63, 8 సిక్స్‌లు) ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేకపోయింది. మయాంక్ అగర్వాల్ (32), అభిషేక్ (32)రాణించారు. హర్షిత్రానా (3/33), రస్సెల్ (2/25) ఆకట్టుకున్నారు. తొలుత రస్సెల్(25 బంతుల్లో 64 నాటౌట్, 3ఫోర్లు, 7 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌కు తోడు సాల్ట్(54), రమన్‌దీప్‌సింగ్(35) రాణింపుతో కోల్‌కతా 20 ఓవర్లలో 208/7 స్కోరు చేసింది. నటరాజన్ (3/32), మార్కండే (2/39) ఫర్వాలేదనిపించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన రస్సెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
రస్సెల్ X క్లాసెన్: కోల్‌కతా, హైదరాబాద్ ఐపీఎల్ పోరులో రస్సెల్, క్లాసెన్ ఇన్నింగ్స్ అదిరిపోయింది. ఓవైపు హైదరాబాద్ బౌలింగ్ దాడిని చీల్చిచెండాడుతూ రస్సెల్ వీరవిహారం చేస్తే..మరో ఎండ్‌లో క్లాసెన్ కోల్‌కతా బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. 119 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న కోల్‌కతాను రస్సెల్ ఒడ్డున పడేశాడు. నరైన్ (2), అయ్యర్ (0), నితీశ్‌రానా (9) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ దశలో రస్సెల్ తన హార్డ్హిట్టర్ను పరిచయం చేశాడు. ఏ మాత్రం కనికరం లేకుండా రైజర్స్ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ ఫోర్లు, సిక్సర్లతో ఈడెన్ గార్డెన్‌ను హోరెత్తించాడు.
ఈ క్రమంలో అర్ధసెంచరీ మార్క్ అందుకున్న రస్సెల్ ఏ ఒక్క బౌలర్‌ను విడిచిపెట్లలేదు. మరోవైపు లక్ష్యఛేదనలో మెరుగైన శుభారంభం అందుకున్న హైదరాబాద్..అదే దూకుడు ఆఖరి వరకు కొనసాగించలేకపోయింది. విజయానికి 18 బంతుల్లో 60 పరుగులు అవసరమైన దశలో క్లాసెన్, షాబాజ్ అహ్మద్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. అప్పటి వరకు గెలుపే కష్టం అనుకున్న హైదరాబాద్ ఆశలను చిగురింపజేస్తూ క్లాసెన్ కొట్టిన కొట్టుడుకు స్టేడియం హోరెత్తిపోయింది. అయితే ఆఖరి ఓవర్లో రానా మ్యాజిక్‌తో హైదరాబాద్ గెలుపు వాకిట బోర్లా పడింది.
8 హైదరాబాద్ తరఫున ఐపీఎల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా క్లాసెన్ నిలిచాడు. ఇంతకుముందు వార్నర్, మనీశ్‌పాండే(8) ఉన్నారు.
15 కోల్‌కతాతో మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో నమోదైన సిక్స్‌లు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం.
కోల్‌కతా: 20 ఓవర్లలో 208/7(రస్సెల్ 64 నాటౌట్, సాల్ట్ 54, నటరాజన్ 3/32, మార్కండే 2/39),
హైదరాబాద్: 20 ఓవర్లలో 204/7(క్లాసెన్ 63, అభిషేక్ 32, హర్షిత్ 3/33, రస్సెల్ 2/25)