మ్యాచ్ జరిగేకొద్దీ కోల్కతా నైట్ రైడర్స్.. విజయానికి దూరమవుతోంది. ధాటిగా ఆడే ప్రయత్నంలో ఒక్కొక్కరుగా బ్యాటర్లు పెవిలియన్ చేరుతున్నారు. శ్రేయాస్ అవుటైన తర్వాత భారీ షాట్లు ఆడే బాధ్యతను తీసుకున్న శామ్ బిల్లింగ్స్ (36) కూడా పెవిలియన్ చేరాడు. రవి బిష్ణోయి వేసిన 16వ ఓవర్లో భారీ సిక్సర్ కొట్టిన అతను.. మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
అయితే బిష్ణోయి వేసిన ఫ్లయిటెడ్ డెలివరీ అతన్ని బోల్తా కొట్టించింది. ముందుకొచ్చి భారీ షాట్ ఆడబోయిన బిల్లింగ్స్.. దూరంగా వెళ్తున్న బంతిని అందుకోలేకపోయాడు. అయితే దాన్ని అందుకున్న కీపర్ డీకాక్ వెంటనే స్టంపింగ్ చేయడంతో బిల్లింగ్స్ అవుటయ్యాడు.
ఆ తర్వాత కాసేపటికే ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆండ్రీ రస్సెల్ (5) కూడా అవుటయ్యాడు. మొహ్సిన్ ఖాన్ వేసిన బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చిన రస్సెల్ పెవిలియన్ చేరాడు. 150 పరుగుల వద్ద కోల్కతా జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. రస్సెల్ కూడా అవుటవడంతో కోల్కతా గెలిచే ఆశలు దాదాపు అడుగంటినట్లే.