వన్డే ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ నిర్ణయం ఆటను ‘నడిపించేవారికి’ మేల్కొలుపు అని అంటున్నాడు ఆ జట్టు వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్. భారత్ తో వన్డే సిరీస్ ముగియగానే ఈ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు స్టోక్స్. మంగళవారం దక్షిణాఫ్రికాతో ముగిసిన తొలి వన్డేనే ఈ ఫార్మాట్ లో అతడికి చివరి మ్యాచ్ అయింది.
మ్యాచ్ ముగిశాక బట్లర్ స్పందిస్తూ.. ‘ఆటను నడిపించే నిర్వాహకులకు స్టోక్స్ నిర్ణయం కచ్చితంగా మేల్కొలుపు. ప్రపంచ క్రికెట్ లో అత్యంత గుర్తింపు పొందిన ఆటగాళ్లలో బెన్ ఒకడు. అతడు అన్ని ఫార్మాట్ లూ ఆడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తీరిక లేని షెడ్యూల్స్, ఇతరత్రా విషయాల కంటే ఇది ఎక్కువ అని నేను భావిస్తున్నా…’ అని తెలిపాడు.
బెన్ స్టోక్స్ నిర్ణయం తనను ఇంగ్లండ్ అభిమానిగా నిరాశపరిచినా అతడి ప్రాధాన్యతను టెస్టు క్రికెట్ గా ఎంపిక చేసుకునే నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని బట్లర్ చెప్పాడు. ‘ఇంగ్లండ్ అభిమానిగా ఇకనుంచి వన్డే ఫార్మాట్ లో బెన్ స్టోక్స్ ఆడడనే విషయం జీర్ణించుకోవడం కష్టంగానే ఉంది. కానీ వన్డేలలో ఆడకున్నా అతడు టెస్టులకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఈ ఫార్మాట్ లో అతడు ఇప్పుడు కెప్టెన్. టెస్టులలో మాత్రం స్టోక్స్ ఎక్కువకాలం కొనసాగుతాడని నేను ఆశిస్తున్నా..’ అని బట్లర్ అభిప్రాయపడ్డాడు.
దక్షిణాఫ్రికాతో ముగిసిన తొలి వన్డేలో ఇంగ్లండ్ 62 పరుగుల తేడాతో ఓడింది. తన చివరి వన్డేలో స్టోక్స్.. 5 పరుగులకే ఔటై తీవ్ర నిరాశపరిచాడు. స్టోక్స్ తన హోంగ్రౌండ్ (డర్హమ్) లో ఔటై పెవిలియన్ వెళ్తుండగా స్టేడియమంతా కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది.