పొట్టి ఫార్మాట్లో కంగారూలకు గట్టి పోటీనిచ్చిన భారత మహిళల జట్టు సిరీస్ మాత్రం సాధించలేకపోయింది. తొలి పోరులో నెగ్గి ఆశలు రేపిన టీమ్ఇండియా.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి సిరీస్ కోల్పోయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ పేలవ ఫామ్ కొనసాగించగా.. బ్యాటర్ల నిలకడలేమి భారత్‌ను దెబ్బకొట్టింది. మరోవైపు వన్డే సిరీస్‌లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన ఆస్ట్రేలియా.. టీ20ల్లోనూ దుమ్మురేపి రెండు సిరీస్‌లతో సగర్వంగా స్వదేశానికి తిరుగుపయనమైంది!
ముంబై: ఆస్ట్రేలియాపై టెస్టు మ్యాచ్ నెగ్గిన భారత మహిళల జట్టు.. పరిమిత ఓవర్ల క్రికెట్లో అదే ఊపు కొనసాగించలేకపోయింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ ఆసీస్‌పై తొలిసారి టీ20 సిరీస్ గెలువాలనుకున్న మన అమ్మాయిల ఆశ నెరవేరలేదు. వన్డేల్లో వైట్‌వాష్‌కు గురైన టీమ్ఇండియా.. టీ20 సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన చివరి పోరులో హర్మన్‌ప్రీత్ బృందం 7 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో పరాజయం పాలైంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (29; 2 ఫోర్లు, ఒక సిక్సర్), షఫాలీ వర్మ (26; 6 ఫోర్లు) జట్టుకు మెరుగైన ఆరంభాన్నివ్వగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ (34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది మంది అభిమానులు తరలిరాగా.. రిచ భారీ షాట్లతో మైదానాన్ని హోరెత్తించింది. కెప్టెన్ హర్మన్ (3), జెమీమా రోడ్రిగ్స్ (2) విఫలం కావడంతో భారత్ ఆశించినంత భారీ స్కోరు చేయలేకపోయింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో జార్జియా, అనాబెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్ 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఓపెనర్లు అలీసా హీలీ (55; 9 ఫోర్లు, ఒక సిక్సర్), బెత్ మూనీ (52 నాటౌట్; 5 ఫోర్లు) అర్ధశతకాలతో అదరగొట్టడంతో ఆసీస్ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. గతంలో పోల్చుకుంటే.. భారత జట్టు ఫీల్డింగ్ మెరుగైనా.. అంతర్జాతీయ ప్రమాణాలకు ఇంకా దూరంగానే ఉండటంతో.. ప్రత్యర్థి ప్లేయర్లకు భారీ స్కోరు చేసేందుకు చేతులారా అవకాశమిచ్చినైట్లెంది. మన బౌలర్లలో పూజ వస్ర్తాకర్ రెండు వికెట్లు పడగొట్టింది. అనాబెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, అలీసా హీలీకి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 147/6 (రిచ 34, స్మృతి 29; అనాబెల్ 2/12, జార్జియా 2/24), ఆస్ట్రేలియా: 18.4 ఓవర్లలో 149/3 (అలీసా 55, మూనీ 52 నాటౌట్; పూజ 2/26).