కష్టపడకుండానే.. జింబాబ్వే పర్యటనలో బోణీ కొట్టింది. చాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన దీపక్ చాహర్ బంతితో నిప్పులు చెరిగితే.. అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ అతడికి చక్కటి సహకారం అందించారు. దీంతో ఆతిథ్య జట్టు రెండొందల మార్క్ కూడా చేరలేకపోగా.. బ్యాటింగ్‌లో ఓపెనర్లు శిఖర్ ధవన్, శుభ్‌మన్ గిల్ దంచికొట్టారు. ఫలితంపై పెద్దగా ఆసక్తి లేకపోయినా.. ఇటీవల బంగ్లాదేశ్ మీద సిరీస్ విజయం సాధించిన జింబాబ్వే కనీస పోటీనైనా ఇస్తుందనుకుంటే.. అదీ సాధ్యపడలేదు. జింబాబ్వే బౌలర్లు ముప్పై ఓవర్లు బౌలింగ్ చేసినా.. టీమ్ఇండియా ఓపెనర్లను ఔట్ చేయలేకపోగా.. పసలేని బౌలింగ్‌ను మనవాళ్లు ఆటాడుకున్నారు!
హరారే: బౌలర్ల క్రమశిక్షణకు.. బ్యాటర్ల సహకారం తోడవడంతో జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి పోరులో టీమ్ఇండియా 10 వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ గెలిచిన భారత సారథి కేఎల్ రాహుల్.. జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. ఆ జట్టు 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ చకాబవా (35), రిచర్డ్ (34), బ్రాడ్ ఇవాన్స్ (33 నాటౌట్) కాస్త పోరాడారు.
గాయం కారణంగా జట్టుకు దూరమై.. సుమారు ఆరు నెలల తర్వాత టీమ్‌లోకి వచ్చిన భారత పేసర్ దీపక్ చాహర్ కొత్త బంతితో ప్రత్యర్థికి చుక్కలు చూపాడు. పదే పదే ఒకే ప్రదేశంలో బంతులు వేస్తూ ఫలితం రాబట్టాడు. అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో మూడు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది.
అనంతరం రాహుల్ సేన 30.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు శిఖర్ ధవన్ (113 బంతుల్లో 81 నాటౌట్; 9 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (72 బంతుల్లో 82 నాటౌట్; 10 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్ధశతకాలతో రాణించడంతో టీమ్ఇండియా సునాయాసంగా గెలుపొందింది. జింబాబ్వే టాపార్డర్‌ను కకావికలం చేసిన దీపక్ చాహర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం ఇక్కడే రెండో వన్డే జరుగనుంది.
గాయం కారణంగా జట్టుకు దూరమై.. ఐపీఎల్‌లోనూ బరిలోకి దిగని దీపక్ చాహర్ అంతర్జాతీయ క్రికెట్లో ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతో జట్టులోకి వచ్చిన చాహర్.. తొలి ఓవర్ నుంచే ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాడు. ఏడో ఓవర్లో ఇన్నోసెంట్ (4)ను ఔట్ చేసిన చాహర్.. మరుసటి ఓవర్లో మరుమని (8)ని బుట్టలో వేసుకున్నాడు.
కాసేపటికే సీన్ విలియమ్స్ (1)ను సిరాజ్ పెవిలియన్ బాటపట్టించగా.. మధెవెరె (5)ను కూడా చాహర్ వెనక్కి పంపాడు. టాపార్డర్‌ను దీపక్ బెంబేలెత్తిస్తే.. అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ మిగిలిన పని పూర్తి చేశారు. ఒక దశలో 110 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే మరింత తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించినా.. బ్రాడ్ ఇవాన్స్, రిచర్డ్ తొమ్మిదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 70 పరుగులు జోడించడంతో ఓ మాదిరి స్కోరు చేసింది.
స్వల్ప లక్ష్యఛేదనలో టీమ్ఇండియా ఎలాంటి సంచలనాలకు అవకాశమివ్వలేదు. ఓపెనర్లు ధవన్, గిల్ నింపాదిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. ప్రత్యర్థి బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతుండటంతో.. క్రీజులో కుదురుకున్నాక ఈ జంట చెలరేగిపోయింది. ధవన్ తన అనుభవాన్ని చాటుతూ ఇన్నింగ్స్‌కు ఇరుసులా నిలబడగా.. ఆరంభంలో కాస్త తడబాటుకు గురైన గిల్.. ఆ తర్వాత ధాటిగా ఆడాడు.
ఎడాపెడా బౌండ్రీలతో విజృంభించాడు. ఈ క్రమంలో మొదట ధవన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. కాసేపటికి గిల్ ఫిఫ్టీ మార్క్ చేరాడు. గత నాలుగు వన్డేల్లో గిల్‌కు ఇది మూడో అర్ధశతకం కావడం విశేషం. మ్యాచ్ ఆరంభానికి ముందు ధవన్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని ఊహించినా.. యువ ఓపెనర్ గిల్ కోసం సారథి రాహుల్ తన స్థానాన్ని త్యాగం చేశాడు.
ఆరు నెలల క్రితం ఎక్కడ ఆపానో.. అక్కడి నుంచే తిరిగి మొదలు పెట్టా. తొలి రెండు ఓవర్లు వేసేసరికే ఇది నా రోజు అని అర్థమైపోయింది. వరుసగా ఏడు ఓవర్లు వేయడం నా ఫిట్నెస్ను చాటిచెప్పింది. బంతి స్వింగ్ అవుతుండటంతో ఫుల్ లెంగ్త్ బంతులతో వికెట్లు రాబట్టగలిగా. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఫిట్నెస్ను మెరుగుపర్చుకునేందుకు బాగా కృషిచేశా.
-దీపక్ చాహర్
జింబాబ్వే: ఇన్నోసెంట్ (సి) శాంసన్ (బి) దీపక్ 4, మరుమని (సి) శాంసన్ (బి) దీపక్ 8, మధెవెరె (ఎల్బీ) దీపక్ 5, సీన్ విలియమ్స్ (సి) ధవన్ (బి) సిరాజ్ 1, సికందర్ రజా (సి) ధవన్ (బి) ప్రసిద్ధ్ 12, చకాబవా (బి) అక్షర్ 35, ర్యాన్ బురి (సి) గిల్ (బి) ప్రసిద్ధ్ 11, జాంగ్వే (ఎల్బీ) అక్షర్ 13, బ్రాడ్ ఇవాన్స్ (నాటౌట్) 33, రిచర్డ్ (బి) ప్రసిద్ధ్ 34, విక్టర్ (సి) గిల్ (బి) అక్షర్ 8, ఎక్స్‌ట్రాలు: 25, మొత్తం: 40.3 ఓవర్లలో 189, వికెట్ల పతనం: 1-25, 2-26, 3-31, 4-31, 5-66, 6-83, 7-107, 8-110, 9-180, 10-189, బౌలింగ్: దీపక్ చాహర్ 7-0-27-3, సిరాజ్ 8-2-36-1, కుల్దీప్ 10-1-36-0, ప్రసిద్ధ్ కృష్ణ 8-0-50-3, అక్షర్ 7.3-2-24-3.
భారత్: ధవన్ (నాటౌట్) 81, గిల్ (నాటౌట్) 82, ఎక్స్‌ట్రాలు: 29, మొత్తం: 30.5 ఓవర్లలో 192/0. బౌలింగ్: రిచర్డ్ 7-0-40-0, విక్టర్ 4-0-17-0, బ్రాడ్ ఇవాన్స్ 3.5-0-28-0, సీన్ విలియమ్స్ 5-0-28-0, సికందర్ 6-0-32-0, జాంగ్వే 2-0-11-0, మధెవెరె 2-0-16-0, ర్యాన్ బురి 1-012-0.