దుబాయ్: వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ వేటను టీమిండియా.. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో ప్రారంభించింది. 2027 అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో ఇరు జట్ల మధ్య జరిగే పోరుతో మెగా టోర్నీ గ్రూప్ దశ మొదలవనుంది. అదే నెల 10న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో వాండరర్స్ స్టేడియంలో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మేరుకు 2027 అక్టోబర్ 2వ తేదీ నుంచి సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చే ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ గురువారం విడుదల చేసింది.
తొలుత మూడు జట్ల మధ్య సూపర్ సిరీస్ జరగనుంది. అందులోనుంచి రెండు జట్లు ముందుకొస్తాయి. మొత్తం 12 జట్లతో అక్టోబర్ 7 నుంచి గ్రూప్ దశ పోటీలు షురూ అవుతాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, జింబాబ్వే, క్వాలిఫయర్-ఏ చోటు దక్కించుకున్నాయి. గ్రూప్-బిలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, క్వాలిఫయర్-బి ఉన్నాయి. ఈ స్టేజ్‌లో ప్రతీ టీమ్ గ్రూప్‌లోని మరో ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్‌లో పోటీ పడుతుంది.
ప్రతీ గ్రూప్‌లో టాప్-3లో నిలిచిన ఆరు జట్లతో పాటు రెండు గ్రూప్‌ల్లో కలిపి ఉత్తమంగా నాలుగో స్థానంలో నిలిచే మరో దేశం తదుపరి దశ అయిన సూపర్-7 రౌండ్‌కు క్వాలిఫై అవుతాయి. అక్కడ ప్రతీ జట్టు మిగతా ఆరు ప్రత్యర్థులతో ఒక్కోటి చొప్పున ఆరేసి మ్యాచ్‌లు ఆడతాయి. సూపర్-7 స్టేజ్‌లో నవంబర్ 7న భారత్ మరోసారి పాకిస్థాన్‌తో తలపడే అవకాశం ఉంది. 2027 నవంబర్ 17న కేప్‌టౌన్‌లో తొలి సెమీస్, 18న ష్వానెలో రెండో సెమీస్, 21న జోహనెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ఫైనల్ జరుగుతాయి.